పావలా వడ్డీకే విద్యా రుణం!
ABN , Publish Date - May 09 , 2026 | 03:43 AM
విద్యార్థులు జాతీ య, అంతర్జాతీయ స్థాయిల్లో చదువుకునేందుకు వారికి పావలా వడ్డీకే విద్యా రుణం అందించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
నిర్దిష్ట తేదీల్లో ‘దీపం’ లబ్ధిదారులకు డబ్బులు
19న ‘మత్స్యకారుల సేవలో..’ పంపిణీ
‘ఐఐటీ’ సాధించేలా ఎస్సీ, ఎస్టీ పిల్లలకు శిక్షణ
సూపర్ సిక్స్, సంక్షేమంపై సీఎం సమీక్ష
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు జాతీ య, అంతర్జాతీయ స్థాయిల్లో చదువుకునేందుకు వారికి పావలా వడ్డీకే విద్యా రుణం అందించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ల సదస్సులో సూపర్ సిక్స్ పథకా లు, సంక్షేమంపై సమీక్షించారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, దివ్యాంగశక్తి, తల్లికి వందనం తదితర పథకాలపై పలు సూచనలు చేశారు. నిర్దిష్ట తేదీల్లో దీపం 2.0 కింద ఇచ్చే సబ్సిడీ డబ్బులు లబ్ధిదారులకు అందేలా చూడాలని స్పష్టం చేశారు. దీపం 2.0 పథకానికి ఇప్పటి వరకు రూ.3504 కోట్ల మేర ఖర్చు అయిందని, 1.08 కోట్ల మంది లబ్ధిదారులున్నారని తెలిపారు. స్త్రీశక్తి కింద మహిళలు ఇప్పటి వరకు 60.6 కోట్ల ప్రయాణాలు చేశారని, ఏడాదికి రూ.1940 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మందికి రూ.10 వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం 78 లక్షల విద్యార్థుల వివరాలను ధ్రువీకరించే పనిని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపడుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ నెల 19న ‘మత్స్యకారుల సేవలో..’ కార్యక్రమం చేపడుతున్నామని, రూ.286 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు సీఎం సమావేశంలో తెలిపారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ పథకాన్ని ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇమామ్, మౌజన్లకు, ఫాస్టర్లకు పంపిణీ సజావుగా సాగేలా చూడాలన్నారు.
నెట్ జీరో హెల్తీ క్యాంప్‌సల ఏర్పాటు
‘‘హాస్టళ్లలో ఏదీ వృథా కాకుండా చూడాలి. నెట్ జీరో విధానాన్ని హాస్టళ్లకు వర్తింపచేయాలి. నెట్ జీరో హెల్తీ క్యాంప్‌సలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అవసరమైన కూరగాయలు అక్కడే పండించుకునేలా ఏర్పాటు చేయాలి’ అని సీఎం సూచించారు. మరో 10 గురుకులాలను ఐఐటీ/నీట్ కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. ఈ విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గీతం యూనివర్సిటీ 500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ముందుకొచ్చిందని అధికారులు తెలిపారు. గిరిజన, ఎస్సీ సంక్షేమ శాఖలో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించేలా శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. విదేశాల్లో ఉద్యోగాలు దక్కించుకునేలా ఎస్సీ, ఎస్టీ యువతకు జర్మన్ భాష నేర్పిస్తున్నామని, ఈ ఏడాది కూడా కొనసాగించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ, పసుపు, కుంకుమ పువ్వు సాగు చేపడుతున్నామని, వాల్యూ అడిషన్ వచ్చే లా ప్రాసెసింగ్ చేపట్టాలన్నారు. అల్లూరి జిల్లాలో నేచురల్ ఫార్మింగ్, ట్రేసబులిటీ, సర్టిపికేషన్ లాంటి ప్రక్రియలు చేపట్టాలన్నారు.
రోడ్ల మరమ్మతులకు నిధుల్లేవ్..
గుంతలు పడిన రోడ్లను త్వరగా మరమ్మతు చేసేందుకు కలెక్టర్ల వద్ద అత్యవసర నిధులు లేవని కలెక్టర్లు సీఎంకు తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ లు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన కొన్ని భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని కొందరు కలెక్టర్లు చెప్పగా.. ఆ మేరకు చర్య లు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త జిల్లాల్లో జిల్లా స్థాయి అధికారులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని కొంత మంది కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్ల పరిధిలోనే జీతాలు అందేలా చూడాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. కాగా, సూపర్ సిక్స్ పథకాలను సమీక్షించే క్రమంలో పింఛన్లపై సమీక్ష చేసేందుకు సెర్ప్‌కు సంబంధించి ఒక్క అధికారి కూడా హాజరుకాకపోవడంపై సీఎం మండిపడ్డారు. ‘ఒక్కరు కూడా రాలేదా? రమ్మని చెప్పండి.. తమాషాపడుతున్నారు!’ అని అసహనంవ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు 5 లక్షలతో యూనిట్లు
సెర్ప్, మెప్మాతో అనుసంధానం చేసుకుని ఎస్సీ, ఎస్టీలకు రూ.5 లక్షలతో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు రూ.100 కోట్లు నిధులు కేటాయించాలని బీసీ ఎక్స్ అఫిషియో కార్యదర్శి సత్యనారాయణ కోరారు. బీసీల రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం ప్రారంభించిందని సీఎం తెలిపారు. గ్రామాల్లో క్రీడలు ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్, పంచాయతీలు ఐలా ద్వారా క్రీడా సెస్ చెల్లిస్తున్నామని, ఆ నిధులు కొంత మేర క్రీడల నిర్వహణ కోసం జిల్లాలకు అందిస్తే బాగుంటుందని కొందరు కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు.
రేపు సింగపూర్‌కు లోకేశ్ బృందం
మంత్రి లోకేశ్ ఆదివారం సింగపూర్‌కు వెళ్తున్నా రు. ఆయన వెంట ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెళ్తున్నారు. శనివారం నుంచి ఈ నెల 15 వరకూ సింగపూర్‌లో జరగనున్న రెండవ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్‌సీ) సమావేశానికి మంత్రి హాజరు కానున్నారు. ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమతులు ఇస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వు జారీ చేశారు. ఈ వ్యయాన్ని ప్రణాళికా శాఖ భరిస్తుందని పేర్కొన్నారు.