Share News

పైప్డ్‌గ్యాసే ప్రత్యామ్నాయం

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:29 AM

ప్రస్తుత వంట గ్యాస్‌ (ఎల్పీజీ) సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే ఉత్తమ పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

పైప్డ్‌గ్యాసే ప్రత్యామ్నాయం

  • ప్రతి ఇంటికీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ

  • ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్లు వంటి పరికరాలనూ వినియోగించేలా చూడాలి

  • ఏఐతో తిరుమలలో పెరిగిన దర్శనాలు

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వంట గ్యాస్‌ (ఎల్పీజీ) సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే ఉత్తమ పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) సరైన ప్రత్యామ్నాయమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. గ్యాస్‌ సంక్షోభం విద్యుత్‌ రంగానికి అవకాశమని, ఇండక్షన్‌ స్టవ్‌లు, ఎలక్ట్రిక్‌ కుక్కర్లు వంటి విద్యుత్‌ పరికరాలను ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించేలా చూడాలని సూచించారు. ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాలతో పంట నష్టంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. జిల్లాకు కనీసం 10 వేలకు తగ్గకుండా కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్‌ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని సూచించారు. ఏపీ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే క్యాబినెట్‌ సమావేశానికి ‘నేచురల్‌ గ్యాస్‌ పాలసీ ఫర్‌ ప్రమోషన్‌ ఇన్‌ కమర్షియల్‌ సెక్టార్‌’ విధానాన్ని తీసుకురావాలన్నారు. విద్యాసంస్థలకు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్య క్రమంలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


తిరుమలలో పెరిగిన దర్శనాలు

టెక్నాలజీని వినియోగించడంతో అన్నింటా మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. దీనికి తిరుమలలో పెరిగిన దర్శనాల సంఖ్యే నిదర్శనమని చెప్పారు. ఏఐ సాయంతో తిరుమలలో క్యూలైన్లు, భక్తుల రద్దీ నిర్వహణ వల్ల నిరీక్షణ సమయం తగ్గిందని, దీంతో 20 శాతం వరకు భక్తులు అదనంగా దర్శనాలు చేసుకునే అవకాశం లభించిందని వివరించారు. ‘ఇప్పుడు కొండపై ప్రసాదం, దర్శనం బావున్నాయి. శ్రీవారి సేవకులు, భక్తుల్లో సంతృప్తి పెరిగింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. అత్యాధునిక ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ద్వారా తిరుమల ప్రసాదాల్లో న్యూట్రిషనల్‌ విలువలు, పదార్థాల క్వాలిటీ చెక్‌ చేస్తున్నామని, దీంతో కల్తీకి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఇదే తరహాలో మిగిలిన శాఖలు మెరుగైన ప్రజాసేవలకు ఏఐ ఇంటిగ్రేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన పంట నష్టం ప్రాథమిక వివరాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ నెల 26వ తేదీ కల్లా పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


గ్యాస్‌పై ఆందోళన వద్దు: పార్థసారథి

వంట గ్యాస్‌ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారఽథి తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్‌ సరఫరా విషయంలో కేంద్ర ఆయిల్‌ కంపెనీలు, ప్రైవేటు గ్యాస్‌ సరఫరాదారులతో సీఎం సమావేశమై పరిస్థితులను సమీక్షించారని తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం వివరాలను ఈ నెల 27 నుంచి 29 వరకు రైతు సేవా కేంద్రాల్లో డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 31వ తేదీ నాటికి పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కోసం 10 లక్షల వరకు దరఖాస్తులు అందాయని, వాటిలో 6.5 లక్షల నుంచి 7 లక్షల వరకు దరఖాస్తులు అర్హత కలిగినవిగా అధికారులు గుర్తించారని తెలిపారు. కేంద్రానికి అర్హుల జాబితా పంపామని.. ఈ నెలాఖరుకు గానీ, ఏప్రిల్‌ మొదటి వారానికి గానీ లిస్ట్‌ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పైప్‌ లైన్‌ ద్వారా నేచురల్‌ గ్యాస్‌ను ఇంటింటికి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ విధానంలో నేచురల్‌ గ్యాస్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. పైప్‌ లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేసే ప్రణాళికలు అమలు చేసే బాధ్యతను ఏపీజీఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అప్పగించింది. సివిల్‌ సప్లయిస్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖతో ఏపీజీఐసీ ఎండీ సమన్వయం చేసుకోవాలని సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో వినియోగ సమన్వయ కమిటీలను నియమించారు. రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీకి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో చైర్మన్‌గా కలెక్టర్‌, వైస్‌ చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌ ఉంటారు.

Updated Date - Mar 24 , 2026 | 05:30 AM