ఏడాదిలో మరోసారి గృహప్రవేశాలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:12 AM
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని సీఎం చంద్రబాబ స్పష్టం చేశారు.
ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలి: సీఎం
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని సీఎం చంద్రబాబ స్పష్టం చేశారు. మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా గృహనిర్మాణ శాఖ వేగంగా పని చేయాలి. టిడ్కో ఇళ్లు కాకుండా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలి. ఎక్కడా ఆలస్యం కాకూడదు. లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది కొనసాగాలి. ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలి. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్టు సర్వేలో తేలింది. వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రీచ్‌ల వద్ద, స్టాక్ యార్డుల వద్ద రవాణా పేరుతో కానీ, ఇతర పేర్లతో ఎక్కువ చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. దీనిపై పటిష్ఠ నిఘా పెట్టాలి’ అని అన్నారు.
కళాశాల కరిక్యులంను మార్చాలి
కళాశాల విద్యను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కళాశాల విద్యను రీఓరియెంటేషన్ చేయాల్సి ఉందని, ఆ మేరకు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ‘సంప్రదాయ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులను కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. ఈ మేరకు కరిక్యులంను రీస్ట్రక్చర్ చేసేలా చూడాలి. వర్సిటీల ర్యాంకింగ్‌లు పెరగాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదులు రాకూడదు. శాప్ విభాగం 5కే రన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలి’ అని సీఎం సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ‘కఠిన నిబంధనలు అమలు చేయడానికంటే ముందు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. విద్యుత్, కేబుల్ తీగలు కిందకు వేలాడుతున్న కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఇకపై జరగడానికి వీల్లేదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పిడుగుపాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నామని, అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని సీఎం తెలిపారు. ‘టెక్నాలజీని వినియోగిస్తున్నాం. కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చేయకుంటే ఏం ఉపయోగం. ఫోన్లలో మెసేజ్‌లు పెట్టడమే కాదు. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందినీ అలెర్ట్ చేయాలి. ఫలానా టవర్ లొకేషన్ పరిధిలో పిడుగులు పడే ప్రమాదముందని నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు తెలియజేసేలా చూడాలి’ అని సీఎం ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.