Share News

నేడు అమిత్‌షాతో బాబు భేటీ

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:25 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, కూటమి ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు.

నేడు  అమిత్‌షాతో బాబు భేటీ

  • కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, సీఆర్‌ పాటిల్‌, చౌహాన్‌, వైష్ణవ్‌లతోనూ..

  • ఏపీ ప్రాజెక్టులు, నిధులపై చర్చలు!

  • ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి

  • విమానాశ్రయ లాంజ్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సచిన్‌ టెండూల్కర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, కూటమి ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఆయన వారితో సమావేశమై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, కేంద్రం నుంచి రావలసిన నిధులు, తాజా రాజకీయ పరిణామాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కాగా.. చంద్రబాబు ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నారని తెలుసుకుని.. క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆయన్ను లాంజ్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారు ఆత్మీయంగా పలుకరించుకోవడం అక్కడ అందరినీ ఆకర్షించింది. ఏపీలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను టెండూల్కర్‌ ప్రశంసించినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఎం 1-జన్‌పథ్‌లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మరో నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. తొలుత జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, తర్వాత అమిత్‌షా, అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశమవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై చర్చిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆయన అమరావతికి తిరుగుప్రయాణమవుతారు.

Updated Date - Feb 10 , 2026 | 03:27 AM