ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:49 AM
సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం ఆర్టీజీఎస్ ...
జిల్లాల్లో పరిష్కారం కానివి క్యాబినెట్‌కు పంపండి
ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం ఆర్టీజీఎస్ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్యలు పరిష్కరించకుండా చాలా కాలంగా పెండింగ్‌లో పెడుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఏదో ఒక సాకు చూపుతూ సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఎంత వరకు క్రమబద్ధీకరించగలరో సమీక్షించుకుని, అక్కడ సాధ్యం కాకపోతే మంత్రివర్గ సమావేశం ఆమోదానికి పంపాలని సూచించారు. వివాదాల్లేకుండా క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణ శాఖలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులనూ చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు గృహ-ఆర్థిక శాఖలు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు
రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారకులైనవారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఉండకూడదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని, సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇసుక అక్రమాలు జరగడానికి అస్సలు వీల్లేదని, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో తవ్విన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదన్నారు. రాష్ట్రాల సరిహద్దులు దాటిన వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలన్నారు. ఇసుక లారీలకు ట్రాకింగ్‌ను పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై మైనింగ్, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.