Share News

యువత కలల్ని నిజం చేస్తాం

ABN , Publish Date - May 26 , 2026 | 04:18 AM

‘యువత కలల్ని నిజం చేసే బాధ్యతను మేం తీసుకుంటాం. పెద్దలు, టీనేజర్లు, జెన్‌-ఆల్ఫా, జెన్‌-జీ... ఇలా తరానికి, తరానికి ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయి.

యువత కలల్ని నిజం చేస్తాం

  • జెన్‌-జీ, జెన్‌-ఆల్ఫా చదువులకు అండగా ఉంటాం

  • యువత కలల సాకారానికి ఎంఎస్ఎంఈ వేదిక

  • రాష్ట్రంలో కోటి ఎంఎస్ఎంఈల స్థాపనే లక్ష్యం

  • ‘వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌’ సాధిస్తాం

  • 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుచేస్తున్నాం

  • ఇప్పటికే 138 సిద్ధం.. జూలైకి మొత్తం రెడీ

  • చిప్‌ టు షిప్‌ నినాదం మేరకు తయారీపై దృష్టి

  • సైనింగ్‌- గ్రౌండింగ్‌- ఓపెనింగ్‌ పద్ధతిన పరిశ్రమలు

  • ప్రపంచ మార్కెట్‌కు మన ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

  • ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కులకు కూడా ప్రోత్సాహకాలు

  • రూ.200 కోట్లతో క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం

  • ‘ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌’లో సీఎం చంద్రబాబు

  • 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన

  • విజయవాడలో అంబేడ్కర్‌ కళావేదికకు ప్రారంభోత్సవం

  • మెటా, అమెజాన్‌ సహా వివిధ సంస్థలతో ఎంవోయూలు

నాలెడ్జ్‌ ఎకానమీకి ఏపీ చిరునామాగా ఉండాలి. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలవాలనేది నా ఆకాంక్ష. విలువలకు కట్టుబడి నైతికత ప్రాతిపదికగా పనిచేస్తే వెనుదిరగాల్సిన పని ఉండదు. ఏపీని దేశంలోనే అత్యంత స్కిల్‌, నాలెడ్జ్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. క్వాంటమ్‌ కంప్యూటర్ల తయారీ కేంద్రంగా అమరావతి తయారవుతుంది. అప్పుడు అభివృద్ధికి కొత్త దశ ఏర్పడుతుంది.

- సీఎం చంద్రబాబు

అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): ‘యువత కలల్ని నిజం చేసే బాధ్యతను మేం తీసుకుంటాం. పెద్దలు, టీనేజర్లు, జెన్‌-ఆల్ఫా, జెన్‌-జీ... ఇలా తరానికి, తరానికి ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయి. మీ ఆశయాలేంటి? ఏవిధంగా చదువుకుంటారో చెప్పండి. మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది’ అని రాష్ట్రంలోని యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌కళావేదికలో సోమవారం నిర్వహించిన ‘ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌-2026’లో సీఎం ప్రసంగించారు. దేశ ఆర్థిక రంగానికి ఎంఎస్ఎంఈలే వెన్నెముఖ అని చెప్పారు. యువత కలల సాకారానికి ఎంఎస్ఎంఈ రంగమే సరైన వేదిక అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20.77 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని వెల్లడించారు.


అయితే రాష్ట్రంలో 1.30 కోట్ల కుటుంబాలున్నాయని, కాబట్టి రాష్ట్రంలో ఒక కోటి ఎంఎస్ఎంఈ యూనిట్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హైవేస్‌, రైల్వేస్‌ ద్వారా లాజిస్టిక్స్‌, అవసరమైన నీరు, కరెంట్‌... ఇలా అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందన్నారు. కాబట్టి ‘వన్‌ ఫ్యామిలీ - వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌’ లక్ష్యం తప్పకుండా జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

పాలసీలు తెచ్చి ప్రోత్సహిస్తున్నాం

‘రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవల్‌పమెంట్‌ పాలసీ, ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలను తీసుకువచ్చి.. ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. కేవలం 23 నెలల్లో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి.. 23 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత మా ఎన్‌డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలి. ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌ సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలవాలి. పారిశ్రామిక యూనిట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు చొప్పున 175 ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపనలు చేయగా.. 19 పార్కులకు ప్రారంభోత్సవాలు చేశాం. ఇవాళ మరో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశాం. ఈ 138 పారిశ్రామిక పార్కులు సిద్ధమవ్వగా, మిగిలిన వాటిని జూలై నాటికి శంకుస్థాపనలు చేసి అన్ని మౌలిక వసతులను కల్పిస్తాం. ఈ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేయాలి.


రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు

మెటా, అమెజాన్‌, జోహో లాంటి సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాలకు కొత్త దారుల్ని సృష్టిస్తాయి. మారుతున్న టెక్నాలజీ.. ఉద్యోగాల స్వరూపాలకు అనుగుణంగా టెక్నాలజీ స్కిల్‌ బిజినెస్‌ ఇంటిగ్రేషన్‌ మోడల్‌ను అనుసరిస్తున్నాం. ఆఽధునిక టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ ద్వారా రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయిలో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. జెన్‌-జీ, జెన్‌-ఆల్ఫా, టీనేజర్లకు మేలు కలిగేలా వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్‌ రీజియన్ల ద్వారా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. ప్రధాని మోదీ ఇచ్చిన ‘చిప్‌ టు షిప్‌’ అన్న నినాదాన్ని నిజం చేసేలా తయారీ రంగంపై దృష్టి పెట్టాం. సైనింగ్‌ - గ్రౌండింగ్‌ - ఓపెనింగ్‌ విధానంలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌ ద్వారా స్టార్టప్‌ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, నిపుణులు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు ఒకే వేదికపైకి వచ్చారు. ‘వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ కింద పెద్దఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలి. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ.558 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్రోగ్రాం కింద రూ. 300 కోట్లు కేటాయిస్తున్నాం. రూ. 200 కోట్లతో ఏపీ క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నాం. త్వరలో 5 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుతాం. మహిళా సంఘాల దగ్గర ప్రస్తుతం రూ. 28 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఉంది. ఏపీ నుంచి 100 యూనికార్న్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.


శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు.. కొత్త ఒప్పందాలు

రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు ఈ ‘ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌’లో ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. రూ. 200 కోట్లతో 45 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురాల్లో ‘రూట్యాగ్‌ స్మార్ట్‌ విలేజ్‌ సెంటర్‌ (ఆర్‌ఎ్‌సవీసీ) విస్తరణ కేంద్రాలను ప్రారంభించారు. లక్ష సూక్ష్మ పరిశ్రమలకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఆధారిత డిజిటల్‌ మార్కెటింగ్‌, ఉపాధి అవకాశాలపై శిక్షణ కార్యక్రమాలకు మెటా సంస్థతో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 వేలకు పైగా ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను అంతర్జాతీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌తో అనుసంధానం చేస్తూ అమెజాన్‌ సంస్థతో, వ్యాపార సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు రూ.50 వేల విలువైన వాలెట్‌ క్రెడిట్లను అందించేందుకు జోహోతో పాటు వివిధ సంస్థలతో ఈ ‘ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌ వేదికగానే ఏపీ ఎంఎస్ఎంఈడీసీ ఒప్పందాలు కుదుర్చుకుంది.

అంబేడ్కర్‌ కళావేదిక...

ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌కు ముందు 4.4 ఎకరాల విస్తీర్ణంలో 1.45 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించిన అంబేడ్కర్‌ కళావేదికను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఒకేసారి 1500 మంది హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్‌ సెంటర్‌ను తీర్చిదిద్దిన అధికారులను అభినందించారు.


‘బిజినెస్‌ రూల్స్‌’ మారుస్తాం

ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు

ప్రజలకు వేగవంతంగా.. సరళంగా సేవలందించడం కోసం బిజినెస్‌ రూల్స్‌ను మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చినందున ప్రభుత్వ సేవలు ప్రజలకు సులువుగా అందేలా చూడాలని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాలను సరళీకృతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌తో పాటు వివిధ శాఖల పనితీరును సీఎం సమీక్షించారు. ‘ప్రజలకు అందించాల్సిన సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. దాని ఆధారంగా ఆధికారులు, ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తున్నాం. మరింత శ్రద్ధ పెట్టాలి. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదు’ అన్నారు.

Updated Date - May 26 , 2026 | 04:23 AM