Share News

CM Chandrababu Focuses on Investment: సమష్టి కృషితో సత్ఫలితాలు!

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:12 AM

గత ఏడాది సమష్టి కృషితో పనిచేయడం వల్లే పెట్టుబడుల ఆకర్షణలో సత్ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో, ఉత్సాహంతో ఈ ఏడాది కూడా పనిచేయాలని అధికారులకు కర్తవ్యబోధ చేశారు. సక్సెస్‌ ఇచ్చే ‘కిక్‌’’ అద్భుతంగా ఉంటుందని..

CM Chandrababu Focuses on Investment: సమష్టి కృషితో సత్ఫలితాలు!

  • బ్రాండ్‌ ఇమేజ్‌ పునరుద్ధరించుకున్నాం: సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): గత ఏడాది సమష్టి కృషితో పనిచేయడం వల్లే పెట్టుబడుల ఆకర్షణలో సత్ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో, ఉత్సాహంతో ఈ ఏడాది కూడా పనిచేయాలని అధికారులకు కర్తవ్యబోధ చేశారు. సక్సెస్‌ ఇచ్చే ‘కిక్‌’’ అద్భుతంగా ఉంటుందని.. దాని కోసం అందరూ పనిచేయాలని సూచించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన అధ్యక్షతన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇంధన రంగాల్లో రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. ఇవి సాకారమైతే 11,753 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముంది. దీంతో ఇప్పటివరకూ రూ.8,74,705 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం లభించగా.. 8,35,675 మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఉంది. సమావేశం ప్రారంభం కాగానే.. ముఖ్యమంత్రికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధిపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2025లో రాష్ట్రం కోసం అందరూ బాగా పనిచేశారని.. పెట్టుబడులను భారీగా రాబట్టారని అధికారులను ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పోయిన బ్రాండ్‌ ఇమేజ్‌ను పునరుద్ధరించుకోగలిగామని అన్నారు. పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని.. గూగుల్‌, రిలయన్స్‌, అదానీ, టాటా, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఏ చిన్న పొరపాటుకూ తావివ్వకుండా మం త్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సూ చించారు. స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌లో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. దావోస్‌ సదస్సుకు హాజరై రాష్ట్ర బ్రాండ్‌ను ప్రమోట్‌ చేశామని తెలిపారు. గూగుల్‌ డేటా సెంటర్‌ తీసుకురావడానికి మంత్రి లోకేశ్‌ కృషి చేశారన్నారు.


ప్రజలపై భారం తగ్గింపు..

విద్యుత్‌ రంగంలో అద్భుతంగా పనిచేశామని చంద్రబాబు చెప్పారు. యూనిట్‌కు 13 పైసల చొప్పున భారం తగ్గించామని గుర్తుచేశారు. అలాగే రూ.4,500 కోట్ల ట్రూఅప్‌ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ట్రూడౌన్‌కు నాంది పలికామని తెలిపారు. కరెంటు కొనుగోలు ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు అమలు చేయనున్నట్లు చెప్పారు.

ఐలాండ్‌ టూరిజం అభివృద్ధిపై ఫోకస్‌..: ‘సూర్యలంక అత్యంత సురక్షితమైన బీచ్‌ ప్రాంతం. దీనికి మాస్టర్‌ప్లాన్‌ తయారు చేయండి. సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌ బ్రాండింగ్‌ చేయండి. 15 కిలోమీటర్ల మేర బీచ్‌ ఫ్రంట్‌ ఉండాలి. అది కాలుష్య రహిత ప్రాంతంగా ఉండాలి. సూర్యలంకతో పాటు సమీపంలోని దీవులను కూడా బీచ్‌ టూరిజం కింద అభివృద్ధి చేయాలి’ అని సీఎం చెప్పారు. మాల్దీవుల తరహాలో ఐలండ్‌ టూరిజం అభివృద్ధి చేయవచ్చన్నారు. 25 వేల గదులు నిర్మించగలిగితే పర్యాటకులను ఆకర్షించవచ్చని తెలిపారు. సూర్యలంక ఏపీటీడీసీ రేటింగ్‌ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆవకాయ ఫెస్టివల్‌, ఫ్లెమింగ్‌ ఫెస్టివల్‌, గండికోట ఉత్సవాలు, విశాఖ-అరకు ఉత్సవ్‌, సీ టూ స్కై, ఏపీ ట్రావెల్‌ మార్ట్‌లను ఘనంగా నిర్వహించాలి’ అని ఆదేశించారు. ‘ఏపీ ఐటీ ఇన్‌ఫ్రా కనెక్ట్‌’ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఎస్‌ఐపీబీ ఆమోదించిన పెట్టుబడులివీ..

  • బాపట్ల జిల్లాలో అర్థకోస్టల్‌ రిసార్ట్స్‌ రూ.187.58 కోట్ల పెట్టుబడి.. 250 ఉద్యోగాలు

  • ఇదే జిల్లాలో సివాన్‌ యూనిపై కన్సార్షియం-రూ.183.87 కోట్ల పెట్టుబడి.. 196 ఉద్యోగాలు.

  • బాపట్ల జిల్లాలోనే శుభం ఇంద్రనీల్‌ కన్సార్షియం-రూ.64.44 కోట్ల పెట్టుబడి.. 100 ఉద్యోగాలు

  • శ్రీసత్యసాయి జిల్లాలో ఇస్కాన్‌-రూ.425.20 కోట్ల పెట్టుబడి.. 1,035 ఉద్యోగాలు

  • అనంతపురం జిల్లాలో సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌-రూ.200.82 కోట్ల పెట్టుబడి.. 245 ఉద్యోగాలు

  • తిరుపతి జిల్లాలో నవ ఫుడ్‌ సెంటర్‌-రూ.44.22 కోట్ల పెట్టుబడి.. 500 ఉద్యోగాలు

  • నాయుడుపేటలో వెబ్‌సోల్‌ రెన్యువబుల్‌-రూ.3,538 కోట్ల పెట్టుబడి.. 1,980 ఉద్యోగాలు

  • నెల్లూరు జిల్లాలో టాటా పవర్‌-రూ.66.75 కోట్ల పెట్టుబడి.. 1,000 మందికి ఉద్యోగాలు

  • నంద్యాలలో రామ్‌కో సిమెంట్స్‌-రూ.1,500 కోట్ల పెట్టుబడి.. 300 మందికి ఉద్యోగాలు

  • కడప జిల్లాలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌-రూ.5,571 కోట్ల పెట్టుబడి.. 5,000 ఉద్యోగాలు

  • తిరుపతిజిల్లాలో ఎథెరియల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ గిల్ట్‌- రూ.578కోట్ల పెట్టుబడి-382మందికి ఉద్యోగాలు

  • విజయనగరం జిల్లాలో రాధికా వెజిటబుల్స్‌ ఆయిల్స్‌-రూ.234కోట్ల పెట్టుబడి..165 మందికి ఉద్యోగాలు

  • అనకాపల్లి జిల్లాలో రిలయన్స్‌ కన్స్యూమర్స్‌-రూ.30 కోట్ల పెట్టుబడి.


అమరావతికి పర్యాటక శోభ!

  • కృష్ణా తీరంలో మెరీనా వాటర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి

  • సీఆర్డీఏ సమావేశంలో సీఎం ఆదేశాలు

రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్‌ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసి, సరికొత్త పర్యాటక హంగులు అద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన 57వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. మెరీనా వాటర్‌ ఫ్రంట్‌లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్‌ బోట్లు, ఫుడ్‌ ప్లాజాలు, ల్యాండ్‌ స్కేప్‌ పనులను చేపట్టేందుకు పీపీపీ విధానంలో టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. రివర్‌ ఫ్రంట్‌తో పాటు జల క్రీడల (వాటర్‌ స్పోర్ట్స్‌) కార్యకలాపాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అమరావతిని బ్లూ-గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. కృష్ణా నదికి ఇరువైపులా అద్భుతమైన వాటర్‌ ఫ్రంట్‌ను అభివృద్ది చేసుకోవడంతో పాటు నదిలో ఉన్న ద్వీపాలను పర్యాటకపరంగా మరింతగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని సూచించారు. స్పోర్ట్స్‌ సిటీ వంటి ప్రాజెక్టుల కోసం ఖతార్‌ మోడళ్లను పరిశీలించాలన్నారు. కృష్ణా మెరీనా రివర్‌ ఫ్రంట్‌ కోసం టూరిజం పాలసీ కింద ఎకరం భూమి ఇచ్చేలా అథారిటీ నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంలో భాగంగా రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం పెన్షన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పింఛను తీసుకుంటున్న తల్లిదండ్రులు చనిపోయి.. అనాథలైన ఏడుగురు పిల్లలకు నెలకు రూ.5 వేల పెన్షన్‌ మంజూరుకు సమావేశం ఆమోదం తెలిపింది.

Updated Date - Jan 07 , 2026 | 03:12 AM