Share News

పట్టణాల్లోనూ జలధార

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:34 AM

పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలన్నీ పూర్తి వసతులతో ఉండాలని సంక్షేమ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పట్టణాల్లోనూ జలధార

  • స్కూళ్ల ప్రారంభం నాటికి పూర్తి వసతులతో హాస్టళ్లు

  • సంతృప్తికరంగా అన్న క్యాంటీన్లు

  • వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష

సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నామో.. అంతకు పదింతల ప్రాధాన్యం మహిళల భద్రతకు ఇవ్వాలి. శాంతి భద్రతల విషయంలో రాజీ ధోరణి వద్దు. తప్పు చేసినవారిని వెంటనే అరెస్టు చేసి, త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలన్నీ పూర్తి వసతులతో ఉండాలని సంక్షేమ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వివిధ శాఖల పనితీరుపై సోమవారం ఆయన సమీక్షించారు. సెలవులు ముగిసేలోగా ప్రతి హాస్టల్‌నూ గాడిలో పెట్టాలని ఆదేశించారు. ‘‘జూన్‌లో స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యేనాటికి హాస్టళ్లన్నీ చక్కగా ఉండాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు సిద్ధం చేయాలి. హాస్టళ్లకు సంబంధించిన వసతులపై ఫిర్యాదులు రాకూడదు. హాస్టళ్లల్లో వసతులు మెరుగుపరిచేందుకు ‘సాస్కీ’ నిధులు కేటాయించాం. నిధులు అందాక కూడా ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే. వసతులను ఏర్పరచడమే కాకుండా వాటి నిర్వహణ కూడా సక్రమంగా చేయాలి. దీనికిగాను నిరంతర పర్యవేక్షణ అవసరం. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేయాలి.’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాగునీటి సరఫరా, వీధి దీపాల విషయంలో ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. పట్టణ ప్రాంతాల నీటి సరఫరాలో విషయంలో అజాగ్రత్త వద్దని హెచ్చరించారు. అర్బన్‌ ప్రాంతాల్లోనూ ‘జలధార’ను అమలు చేయనున్నట్టు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న మోడల్‌ జలధార ఇక గ్రామీణ ప్రాంతాలతో పాటు.. పట్టణ, నగర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని ఆదేశించారు. చెత్తసేకరణలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనికిగాను మునిసిపల్‌ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.


మహిళల భద్రతే ప్రధానం

మహిళలపై నేరాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని పోలీసు శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళల భద్రతపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వీలైనన్ని కొత్త ఆలోచనలు వచ్చేలా విద్యార్థులలో ప్రేరణ కల్పించాలన్నారు. దీనికిగాను ఆర్టీఐహెచ్‌తో కలసి పనిచేయాలని సూచించారు. 207 అన్న క్యాంటిన్ల ద్వారా ప్రతిరోజూ 2.10 లక్షల మందికి భోజనాలు అందుతున్నాయని అధికారులు తెలిపారు.

‘ఆర్టీజీఎస్’తో వాహనం దొరికింది!

సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఆర్టీజీఎస్‌ అప్లికేషన్‌తో విశ్లేషించడం ద్వారా ఆచూకీ లేకుండా పోయిన ఓ వాహనాన్ని ఆర్టీజీఎస్‌, ఐటీ కోర్‌ బృందం సభ్యులు గుర్తించారు. ఈ విషయాన్ని సోమవారం సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

Updated Date - Apr 14 , 2026 | 06:36 AM