సొంత ఆదాయం పెరగాలి
ABN , Publish Date - May 15 , 2026 | 05:10 AM
కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు సొంత ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ రాబట్టాలి: సీఎం
ఆదాయార్జన శాఖలపై చంద్రబాబు సమీక్ష
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు సొంత ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, వీటి ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గురువారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2024-25లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,04,345 కోట్లు కాగా, 2025-26లో రూ.1,10,643 కోట్లకు పెరిగినట్లు అధికారులు వివరించారు. 2026-27లో రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. ’గనులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ర్టేషన్, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి. ఆదాయంలో ప్రతీ రూపాయి సద్వినియోగం కావాలి. 22ఏ లాంటి భూవివాదాలు పరిష్కారమయితే రిజిస్ర్టేషన్ ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2026-27లో 42 రోజుల్లో ఆదాయం 38 శాతం పెరిగింది. ఈవీ వాహనాల వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలి’ అని ఆదేశాలు ఇచ్చారు.
ప్రతీ శాఖ.. లక్ష్యాలు సాధించాలి
‘‘ప్రస్తుత పెట్టుబడులకు అనుగుణంగా జీవీఏ, ఆదాయాలు పెరగాలి. ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. వీటి ద్వారా ఆదాయం 30 శాతం పెరిగే అవకాశం ఉంది. జిల్లా ఒక యూనిట్‌గా వృద్ధి రేటు లక్ష్యాలను సాధిస్తే.. రాష్ట్రవ్యాప్త లక్ష్యాలను సాధించడం సులభమవుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో మనమంతా కలిసి లక్ష్యాలు సాధిద్దాం. ప్రతీ ప్రభుత్వ శాఖ 360 డిగ్రీల్లో అంశాలను విశ్లేషించి ఆదాయ లక్ష్యాలను సాధించాలి. ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలు ఏఐ టూల్స్ వినియోగించి ఎగవేతలను అరికట్టాలి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేసి ఇక్కడ రిజిస్ర్టేషన్లు చేసుకుంటున్నారు. ఇక్కడే వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలి’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ‘‘ఎర్రచందనం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా విలువ జోడించాలి. వృత్తి పన్ను వసూళ్లలో చట్ట సవరణ అంశాన్ని పరిశీలించాలి. రేర్‌ఎర్త్ మినరల్స్‌పై దృష్టి సారించండి. 24 గంటల్లోనే వాహనాల రిజిస్ర్టేషన్ జరగాలి. పురపాలక శాఖలో పన్నుల ప్రామాణీకరణ, క్రమబద్ధీకరణ జరగాలి. పంచాయతీరాజ్ శాఖలో అన్నీ ఆన్‌లైన్ వసూళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న స్వచ్ఛాంధ్ర నిధులను త్వరగా ఖర్చు చేస్తే కేంద్రం మరిన్ని నిధులు ఇస్తుంది. అర్బన్, రూరల్ స్థానిక సంస్థల్లో నిధులు ఖర్చు చేసి స్వచ్ఛ భారత్ లక్ష్యాలు సాధించాలి’ అని సీఎం తెలిపారు.