Share News

AP CM Chandrababu Naidu: జగన్‌ది విద్వేషమే

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:04 AM

జగన్‌కు నాగరికతపై అవగాహన లేదు. నదీ తీరానికి.. నదీ పరీవాహక ప్రాంతానికీ తేడా తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజధానిపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు...

AP CM Chandrababu Naidu: జగన్‌ది విద్వేషమే

  • ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన ఆపడం లేదు

  • నదీ తీరానికి, పరీవాహక ప్రాంతానికీ తేడా తెలీదు.. నాగరికతపై అవగాహన లేదు

  • నదుల వెంట ఉన్న నగరాలన్నీ అభివృద్ధి

  • లండన్‌, మాస్కో, ఢిల్లీ, కోల్‌కతా ఇలాంటివే

  • తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు

  • ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం

  • పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి

  • మిగులు జలాలతో నల్లమలసాగర్‌ పూర్తయితే

  • శ్రీశైలం, సాగర్‌లో నీటి లభ్యత పెరుగుతుంది

  • అవసరమైతే తెలంగాణ కూడా వాడుకోవచ్చు

  • టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి

అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌కు నాగరికతపై అవగాహన లేదు. నదీ తీరానికి.. నదీ పరీవాహక ప్రాంతానికీ తేడా తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజధానిపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు’ అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుంటే జగన్‌ అమరావతిపై అడ్డగోలుగా మాట్లాడరని అన్నారు. నదులు ఎక్కడ ఉంటే అక్కడ నాగరికత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో గానీ దేశంలో గానీ నదుల వెంబడి ఉన్న నగరాలన్నీ అద్భుతమైన అభివృద్ధిని సాధించాయని అన్నారు. లండన్‌, మాస్కో, మన దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా, వారణాశి, పట్నా, అహ్మదాబాద్‌, లఖ్‌నవ్‌ ఇలా పురాతనమైన, అభివృద్ధి చెందిన నగరాలన్నీ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు. ఇలాంటి అంశాలపై కనీస అవగాహన లేకుండా అమరావతిపై ద్వేషంతో జగన్‌ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మడం మాత్రం ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆలయాలనూ వదలకుండా కుట్రలు

‘‘ఆలయాలను కూడా వదలకుండా వైసీపీ కుట్రలకు తెరతీస్తోంది. తిరుమల కొండపై వారి పార్టీ నేతలతో మద్యం బాటిళ్లను పెట్టించి కుట్ర పన్నారు. భూమనతో ప్రభుత్వంపై ఎదురుదాడి చేయించడం వైసీపీ కుట్రపూరిత రాజకీయాలకు పరాకాష్ఠ. స్వార్థ రాజకీయాల కోసం భక్తుల మనోభావాలతో, తిరుమల పవిత్రతతో ఆడుకుంటున్నారు. కల్తీ నెయ్యిలో వైసీపీ నేతల కుట్రలు బట్టబయలవుతున్న సందర్భంలో కొత్తగా మద్యం బాటిళ్లతో కొత్త కుట్రకు తెరదీశారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీకెమెరాలు, టెక్నాలజీ సాయంతో వైసీపీ కుట్రలు బయటపడుతున్నా ఆ పార్టీ మూకలు బరితెగించి వ్యవహరిస్తున్నాయని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పటి నుంచి జగన్‌ తీరు హిందూ మతాన్ని నిర్వీర్యం చేసేలా ఉందని ఓ సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. దేవాలయాలపై మహ్మద్‌ గజనీ వరుస దాడులు చేసినట్టు జగన్‌ కూడా హిందూ మతంపై దాడులు చేస్తూనే ఉన్నారని మరో సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండగా దేవాలయాలపై దాడులను ప్రేరేపించడమే కాకుండా, ఆ దాడులపై వైసీపీ నేతలు చులకనగా మాట్లాడేవారని నేతలు అన్నారు. పరకామణి చోరీ కేసును జగన్‌ చిన్నపాటి దొంగతనంగా పేర్కొనడం కూడా హిందూమతంపై ఆయనకున్న చిన్నచూపును స్పష్టంచేస్తోందనిన్నారు. వైసీపీ చేస్తోంది రాజకీయ దాడి కాదని, హిందూ మతంపై దాడి అని, దీన్ని సీరియ్‌సగా తీసుకోవాలని కొందరు నేతలు కోరారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఏ మతం ఆచరించినా ఇతర మతాలను గౌరవించాలని, ముఖ్యంగా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ఇది చాలా ముఖ్యమన్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందని జగన్‌ తిరుమల దర్శనానికే రాలేదని సీఎం వ్యాఖ్యానించారు.


నాడు కమీషన్ల కోసమే రాయలసీమ లిఫ్టు

‘‘పట్టిసీమ ద్వారా గోదావరి మిగులు జలాలను తరలించడంతో రాయలసీమకు కృష్ణా జలాలను అందివ్వగలిగాం. రాయలసీమ పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని పట్టిసీమ ద్వారానే చాటుకున్నాం. ఆ ప్రాజెక్టు ఫలితంగానే రాయలసీమకు నీరు అంది.. అక్కడ ఉద్యాన రంగం అభివృద్ధి చెందింది. సీమ లిఫ్టు 2020లో వైసీపీ హయాంలోనే నిలిచిపోయింది. అప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు స్వార్థరాజకీయాలు చేస్తున్నారంటే వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. నాటి వైసీపీ పాలకులు కమీషన్ల కోసం రాయలసీమ లిఫ్ట్‌ స్కీంలో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. నీటి విషయంలో రాజీపడేది లేదు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.

ఫేక్‌ ప్రచారాలను తిప్పికొట్టండి

నెలలో వారంరోజుల పాటు పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం సూచించారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. వైసీపీ చేసే ఆరోపణలకు, ఫేక్‌ ప్రచారాలకు గట్టిగా జవాబు ఇవ్వాలన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటి అంశాలపై ఎమ్మెల్యేలు గట్టిగా జవాబు ఇచ్చారని సీఎం అభిప్రాయపడ్డారు.


గొడవలు వద్దు.. నీళ్లే ముఖ్యం

చర్చించుకుని నీటి సమస్యలను పరిష్కరించుకుందామన్న తెలంగాణ సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై నేతలతో చంద్రబాబు ప్రస్తావించారు. గొడవలు వద్దు.. నీళ్లు కావాలని తాను చాలాకాలం నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లోనూ దీనిపై మాట్లాడారు. ప్రాజెక్టులు ప్రజల కోసమని, జగన్‌ కోసమో ఇంకొకరి కోసమో కాదని అన్నారు. కాళేశ్వరానికి లేని అభ్యంతరం నల్లమలసాగర్‌కు ఎందుకని, తెలుగు ప్రజల కోసం ఒకరికొకరం సహకరించుకోవాలని వ్యాఖ్యానించారు. నల్లమలసాగర్‌ పూర్తయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యత పెరుగుతుందన్నారు. ఆ నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చన్నారు. నీటి విషయంలో గొడవలకుపోతే నష్టపోయేది తెలుగు ప్రజలేనన్నారు. తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని అన్నారు. మిగులు జలాల్ని సద్వినియోగం చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Updated Date - Jan 11 , 2026 | 05:15 AM