Share News

నినాదం కాదు.. సామాజిక విప్లవం!

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:48 AM

సమసమాజ ఉద్యమానికి ఊపిరి పోయడానికి తీసుకొచ్చిన పీ4 కార్యక్రమం నినాదం మాత్రమే కాదని.. అదో సామాజి క విప్లవమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

నినాదం కాదు.. సామాజిక విప్లవం!

  • ‘పీ-4’ మహాయజ్ఞానికి ఏడాది పూర్తి

  • సమసమాజ ఉద్యమానికి ఊపిరి పోయడానికి దీనిని తెచ్చాం: సీఎం

తిరుపతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సమసమాజ ఉద్యమానికి ఊపిరి పోయడానికి తీసుకొచ్చిన పీ4 కార్యక్రమం నినాదం మాత్రమే కాదని.. అదో సామాజి క విప్లవమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం రాత్రి జరిగిన పీ4 తొలి వార్షికోత్సవ సదస్సుకు హాజరై మాట్లాడుతూ.. పేదరికం లేని సమాజం కోసం పీ-4 పేరిట మొదలుపెట్టిన మహా యజ్ఞానికి ఏడాది పూర్తయిందన్నారు. పేద కుటుంబాలకు, సమాజానికి మేలు చేయాలని ముందుకొచ్చిన మార్గదర్శులకు తలవంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంతో కలిగిన తృప్తి, సంతోషం మరెందులోనూ తనకు కలుగలేదన్నారు. ‘ప్రజల భాగస్వామ్యంతో తొలి ఏడాదిలోనే 2.10 లక్షల బంగారు కుటుంబాలకు మేలు జరిగింది. దీనివల్ల రాష్ట్రం మొ త్తం మారిపోయిందని చెప్పడం లేదు. మార్పునకు నాందిగా తొలి అడుగు మాత్రమే’ అన్నారు. కేవలం 12 నెలల స్వల్ప వ్యవధిలోనే 1.06 లక్షల మంది మార్గదర్శులు ముందుకొచ్చి.. 10.30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు. పీ4 వంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాల వల్లే సమాజం లో మార్పు సాధ్యమన్నారు. ‘గతంలో జన్మభూమి కోసం పిలుపిస్తే ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మార్పు తీసుకొచ్చా రు. ఇపుడు పేదరిక నిర్మూలన కోసం పీ4 తీసుకొచ్చాం. 2047 నాటికి ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే దీనిలక్ష్యం. ప్రపంచంలో వున్న తెలుగువారందికీ పిలుపిస్తున్నా.. ప్రతి ఒక్క రూ తమకు తోచిన విధంగా సమాజానికి, పేదలకు ఉపయోగపడాలి.


నా మీద, రాష్ట్రం మీద గౌరవం వున్న వారం తా స్పందించాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క కుటుంబాన్నయినా దత్తత తీసుకోవాలి’ అని కోరారు. దేశ నిర్మాణంలో వారు భాగస్వాములని ప్రశంసించారు. మార్గదర్శుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని, అవార్డులు, సత్కారాలతో వారికి సమాజంలో గౌరవం పెంచుతామని ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేర్లతో అవార్డులు ఇస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో ఒకరికి విశిష్ట మార్గదర్శి అవార్డు, ముగ్గురికి ప్రశంసా పత్రాలు.. నియోజకవర్గాలస్థాయిలో ముగ్గురు మార్గదర్శులకు ప్రశంసా పత్రాలు జారీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పెడనకు చెందిన బాలాజీ అమెరికా నుంచి సీఎంతో మాట్లాడి తన గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం చంద్రబాబు రాష్ట్రస్థాయి ఉత్తమ మార్గదర్శులకు అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. పీ4 వార్షిక హ్యాండ్‌ బుక్‌ను ఆవిష్కరించారు.


  • శ్రీకాళహస్తిలో మీ విధులు అక్కర్లేదు!

  • పీ-4పై సమీక్షలో ఎంపీడీవోలపై ఎమ్మెల్యే బొజ్జల ఆగ్రహం

శ్రీకాళహస్తి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఎంతో గొప్ప ఆశయంతో అమలు చేస్తున్న పీ4 పథకం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు తన నియోజకవర్గంలో పనిచేసే అవసరం లేదంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో సోమవారం పీ4 పథకంపై సమీక్షించారు. రూరల్‌ ఎంపీడీవో శ్యామ్‌, ఏర్పేడు ఎంపీడీవో సౌభాగ్యమ్మ వైఖరిపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కనీస బాధ్యత లేకుండా ఎంపీడీవోలు సమావేశానికి హాజరవుతారా? ఎంతో మంది మార్గదర్శకులు తమ సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. అధికారులు గా బంగారు కుటుంబాల లబ్ధిదారులకు ఫోన్‌ చేసే తీరిక కూడా లేదా? నేనే అందరినీ ఫోన్‌ చేసి పిలవాలా? సమావేశం నుంచి బయటికి వెళ్లండి.’’ అని బొజ్జల అన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 04:49 AM