రాష్ట్రానికి సంజీవని!
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:45 AM
ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు...
ప్రజలందరికీ వైద్య పరీక్షలు.. 72.73 లక్షల మందికి హెల్త్ స్ర్కీనింగ్: సీఎం
ప్రజారోగ్యం డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలి
హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయాలి
ఆస్పత్రుల నిర్మాణం, నిర్వహణకుముందుకొచ్చేవారికి రాయితీలు
నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
ఎంపీహెచ్‌ఏలను విధుల్లోకి తీసుకునేందుకు ఆమోదం
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష జరిపారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని పైలట్ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలు, పైలట్ అమలు తీరును అధికారులకు సీఎంకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టు చేపడుతున్నాం. శిశువుల నుంచి వృద్ధుల వరకూ వైద్య సేవలు అందాలి. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. పోషకాహారాల వల్ల ఉపయోగాలేమిటో మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. న్యూట్రిషన్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకురావాలి’ అని ఆదేశించారు. వీటితో పాటు వచ్చే ఏప్రిల్ నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజారోగ్యమే ప్రధాన ఎజెండాగా సంజీవని ప్రాజెక్టును చేపట్టామని, ప్రభుత్వం దగ్గరున్న డేటాను ఆధారంగా తీసుకుని ప్రజల ఆరోగ్యంపై విశ్లేషించడంతో పాటు ప్రజల వద్దకు వెళ్లి శాంపిల్ సర్వేలు చేపట్టాలని సీఎం సూచించారు. 72.73 లక్షల మందికి హెల్త్ స్ర్కీనింగ్ చేయాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఎనీమియా, కార్డియాక్, డయాబెటిక్, కిడ్నీ, లివర్ వ్యాధులపై అధ్యయనం చేయాలని.. ఎవరైనా రిస్క్ కేటగిరీలో ఉంటే వారిని అప్రమత్తం చేసి మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలని తెలిపారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నియోజకవర్గానికో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు లేదా పర్యావరణ సమస్యల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో వారికి వివరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలని, నియోజకవర్గాల్లో మల్టీస్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలన్నారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. కేంద్రానికి వివరాలు పంపించాలని తెలిపారు. రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్మాణం, ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రముఖ ఆస్పత్రి యాజమాన్యాలకు.. లాభాపేక్ష లేకుండా ఆస్పత్రుల నిర్మాణం, నిర్వహణ చేపట్టే వారికి రాయితీలు ఇస్తామని ప్రకటించారు.
విధుల్లోకి ఎంపీహెచ్‌ఎలు
మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్ల (ఎంపీహెచ్‌ఏ)ను విధుల్లోకి తీసుకునేందుకు సీఎం అంగీకరించారు. వారి సమస్యలను మంత్రి సత్యకుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 730 మంది ఎంపీహెచ్‌ఏలున్నారని, వీళ్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్డు కూడా తీర్పు ఇచ్చిందని, వీళ్ల పోరాటం చాలా కాలంగా సాగుతోందని తెలిపారు. మంత్రి, అఽధికారుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన సీఎం.. వెంటనే వారిని విధుల్లో తీసుకోవాలన్నారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, కమిషనర్ వీరపాండియన్, డీఎ్‌సహెచ్ కమిషనర్ చక్రధరబాబు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేశ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.