Share News

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:25 AM

పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

  • పశ్చిమాసియాలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సీఎం భరోసా

  • తెలుగువారందరినీ ఆదుకోవాలని అధికారులకు ఆదేశం

  • ఏపీఎన్‌ఆర్టీ, ఆర్టీజీఎ్‌సకు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

  • కేంద్రంతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లకు ఆదేశం

అమరావతి, న్యూఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగువారిని రక్షించేందుకు అవసరమైన చర్యలపై చర్చించేందుకు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌ అధికారులు, ఏపీఎన్‌ఆర్టీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సౌదీ అరేబియా, దుబాయ్‌, ఖతార్‌, కువైట్‌ తదితర దేశాల్లో రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారితో మాట్లాడి వారికి ఎలాంటి సహాయం కావాలో తెలుసుకోవాలని, దానికి అనుగుణంగా స్పందించాలని కోరారు. ఏపీఎన్‌ఆర్టీ, ఆర్టీజీఎస్‌ కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, అందరూ సురక్షితంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎయిర్‌పోర్టులు మూసివేయడం, విమాన సర్వీసులు రద్దు చేయడంతో వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చే పరిస్థితులు లేనందున, పరిస్థితులు చక్కబడే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, దీనికి ఏపీఎన్‌ఆర్టీ సహకరిస్తుందని తెలుగువారికి సూచించారు.

హెల్ప్‌లైన్లు ఏర్పాటు... గల్ఫ్‌ దేశాల్లో రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఏపీఎన్‌ఆర్టీతో కలిసి చర్యలు చేపట్టింది. వారికి సహాయం కోసం 0863-2340678 హెల్ప్‌లైన్‌ నంబరు, 85000 27678 వాట్సాప్‌ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైన తెలుగువారికి ఏపీఎన్‌ఆర్టీ కో-ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. ప్రవాసాంధ్రులు సంప్రదించిన వెంటనే ఏపీఎన్‌ఆర్టీ వారికి తక్షణం సహాయ సహకారాలు అందించేలా ఏర్పాట్లు చేసింది. హెల్ప్‌లైన్‌ నంబర్లతో పాటు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

Updated Date - Mar 03 , 2026 | 03:27 AM