సంక్షేమానికి బడ్జెట్ పెంచాం
ABN , Publish Date - Feb 24 , 2026 | 03:48 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అల్పాదాయ వర్గాలవారికి ఆదాయ మార్గాలు కల్పించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం
అన్ని వర్గాలకూ న్యాయం చేస్తాం
సామాజిక సమానత్వం తెస్తాం
బీసీల రిజర్వేషన్ల పెంపునకు కసరత్తు.. అసెంబ్లీలో సీఎం
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అల్పాదాయ వర్గాలవారికి ఆదాయ మార్గాలు కల్పించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సాంఘిక సంక్షేమం, మహిళ, శిశు, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, మైనారిటీ సంక్షేమ శాఖలకు బడ్జెట్ కేటాయింపుల కోసం సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించిన డిమాండ్లపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అన్ని వర్గాలవారికీ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ‘‘రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి సంక్షేమం, అభివృద్ధి కోసం ఆదాయం పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చాం. ఆ దిశగానే ముందుకు వెళుతున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి, ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తున్నాం. ఎన్నికల్లో కూటమికి 94 శాతం విన్నింగ్ చాన్స్ ఇచ్చారంటే ప్రజలు మనపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో చూడండి. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ‘సూపర్-6’ హామీలను సూపర్ హిట్ చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి వీలైనంత వరకు బడ్జెట్ కేటాయింపులు పెంచాం. వాటిని ఆయా వర్గాలకే ఖర్చు చేసేలా చిత్తశుద్ధితో పని చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, వారికి సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌లో నిర్దేశించుకున్న ప్రకారం ప్రజల తలసరి ఆదాయాన్ని రూ. మూడు లక్షల నుంచి రూ. 54 లక్షలకు పెంచే నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం.
భావితరాలపై ప్రధానంగా దృష్టి సారించి, అంగన్‌వాడీ కేంద్రాలు మొదలుకొని రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. పీపీపీ విధానంలో రోడ్లు, విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో సంపద పెరిగినప్పటికీ, సమాజంలో అసమానతలు మాత్రం తగ్గలేదు. వీటిని తగ్గించేందుకే పీ4 విధానం తీసుకువచ్చాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల బంగారు కుటుంబాలను ఒక లక్ష మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. సమాజంలో అసమానతలు తగ్గించడానికి పీ4 కు మించి కార్యక్రమం లేదు. దీనిని నిరంతరం పర్యవేక్షిస్తాం. ప్రభుత్వ విధానాలతోనే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి కసరత్తు చేస్తున్నాం. బీసీ రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తాం. బీసీల్లో కొన్ని కులాలవారు తమను ఎస్సీ, ఎస్టీల జాబితాల్లో చేర్చమని కోరుతున్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ ఉప కులాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలుచేసి సామాజిక న్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే’’నని చంద్రబాబు తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం గతంలో అమలు చేసిన జీవో 3ను నిలిపివేశారని, మళ్లీ ఆ జీవోను తిరిగి తీసుకువచ్చే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ‘‘మైనారిటీ వర్గాల రక్షణతో పాటు అనేక విధాలుగా వారిని ఆదుకుంటున్నాం. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాలు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. మరోవైపు మహిళా కేంద్రంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆడబిడ్డలను అన్ని విధాలుగా ఆదుకోవడానికే డ్వాక్రా సంఘాలు పెట్టాం. త్వరలోనే కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు తీసుకువచ్చి ప్రతి వ్యక్తికీ రక్షణ కల్పిస్తాం.’ అని చంద్రబాబు తెలిపారు.
ఎక్కువ మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు నీటి యాజమాన్య సంఘాల చట్ట సవరణ
అసెంబ్లీలో నీటి యాజమాన్య సంఘాల సవరణ చట్టాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సభలో ప్రవేశపెట్టడంతో శాసనసభ ఆమోదించింది. స్థానిక సంస్థల్లో మాదిరిగానే నీటి యాజమాన్య సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండరాదన్న నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. ఇప్పుడు దేశంలో పరిస్థితి మారడంతో.. ఎంతమంది పిల్లల్ని కనాలన్న దానిపై నియంత్రణ అవసరం లేదన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చట్టాలను సవరణ చేశారు. అదేవిధంగా నీటి యాజమాన్య సంఘ ఎన్నికల్లో ఈ నిబంధన ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది. సోమవారం అసెంబ్లీలో ఏపీ ఫార్మర్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్(సవరణ)బిల్లు-2026ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఏఐతో పిల్లలు నిరుద్యోగులవుతున్నారు: ఎమ్మెల్యే అరవింద్‌బాబు
ఏఐ, క్వాంటమ్ కారణంగా 90 శాతం పిల్లలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రభుత్వాలు వారికి అండగా నిలబడాలి.
22ఏ నుంచి తొలగించాలి: ఆరణి
వైసీపీ హయాంలో తిరుపతిలో 15 వేల ఇళ్లను 22ఏలో పెట్టారు. కరుణాకర్‌రెడ్డి తనకు వ్యతిరేక పార్టీ వారికి సంబంధించి ఇళ్లన్నింటినీ 22ఏలో పెట్టించారు. దీంతో వాటికి పన్నులు వసూలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఇళ్లను 22ఏ నుంచి తొలగించి, పేదలను ఆదుకోవాలి.