Share News

నా దేశం- నా బాధ్యత

ABN , Publish Date - May 15 , 2026 | 03:47 AM

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘నా దేశం.. నా బాధ్యత’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది.

నా దేశం- నా బాధ్యత

  • మనమే ముందడుగు వేద్దాం

  • ఇక ప్రతి శుక్రవారం నో వెహికల్‌ డే

  • కాన్వాయ్‌ సైజు తగ్గించుకుందాం

  • అత్యవసరమైతేనే విదేశీ పర్యటనలు

  • ఏసీలు 24-26 డిగ్రీలను దాటొద్దు

  • కొత్త వాహనాలు కొంటే.. ఈవీలే కొనాలి

  • అవసరమైతే సైకిళ్లపై సచివాలయానికి

  • జిల్లాల పర్యటనల్లోనూ పొదుపు దృష్టి

  • ప్రతి అంశంలోనూ ప్రజలకు ఆదర్శం

  • పొదుపు చర్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ

  • శాఖలవారీగా కార్యదర్శులు నివేదికలివ్వాలి

  • ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశం

  • ఇదే ఏపీపొదుపు మంత్రం కావాలి

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘నా దేశం.. నా బాధ్యత’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. గురువారం జరిగిన క్యాబినెట్‌ భేటీలోను, అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులు, అధికారులతో జరిపిన సమావేశంలోను ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశం మనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు పొదుపు చర్యలు పాటిద్దామని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్రం అమలుచేస్తున్న అన్ని పొదుపు చర్యలను మనమూ పాటిద్దామని స్పష్టం చేశారు. వాటితోపాటు తనతోసహా మంత్రులు, అధికారులు తమ వాహన శ్రేణులను కుదించుకుని ఇంధన ఆదాపై దృష్టి పెట్టాలని కోరారు. మంత్రులు, అధికారులు తమ చాంబర్లలో ఏసీలను 24-26 డిగ్రీల్లో పెట్టుకోవాలని, దానివల్ల ఎంతో విద్యుత్తు ఆదా అవుతుందన్నారు. మంత్రులు, అధికారులు వాడే వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చుకునే అవకాశాలను పరిశీలించాలని కోరారు. బంగారం కొనుగోళ్లను తగ్గించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. అలాగే మంత్రులు, అధికారులు వ్యక్తిగత, అధికారిక విదేశీ పర్యటనలు పూర్తిగా తగ్గించుకోవాలని, అత్యవసరమయితే తప్ప వెళ్లొద్దని సూచించారు. శాఖలవారీగా సమావేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవాలని కోరారు. ఆయా శాఖల్లో ఎలాంటి పొదుపు చర్యలు పాటించవచ్చో అధ్యయనం చేసి కార్యదర్శులందరూ నివేదికలు ఇవ్వాలన్నారు. పొదుపు చర్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీని కూడా నియమిద్దామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


మనమే ముందుందాం..

‘‘పొదుపు చర్యల్లో భాగంగా వారంలో ఒకరోజు (శుక్రవారం) ‘నో వెహికిల్‌ డే’గా పాటిద్దాం. సమావేశాలను ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా నిర్వహిద్దాం. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ రవాణా వ్యవస్థ(ఆర్టీసీ బస్సులు)ను ఉపయోగిస్తే బాగుంటుంది. అవకాశం ఉంటే వాహనాలను పక్కనపెట్టి సైకిలింగ్‌, పాదయాత్రల ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. అందరం సచివాలయానికి సైకిళ్లపై వద్దాం. వారానికో రోజు మంత్రులు, అధికారులు సైకిళ్లపై సచివాలయానికి వస్తే కచ్చితంగా అది ప్రజలపై ప్రభావం చూపి.. వారు సైతం అదే బాట పడతారు. విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పడానికి అవకాశం ఉంటుందేమో పరిశీలించాలి. వర్సిటీలు, విద్యా సంస్థల్లో వారానికి 2 రోజులు విద్యార్థులు ‘నో బైక్‌ డే ’ పాటించాలి. ప్రభుత్వ శాఖల్లో వారానికి రెండ్రోజులు ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రం హోం) చేసే విధానం రూపొందించవచ్చేమో చూడాలి. ఇంధనం విషయంలో తొలుత దేశం గురించి ఆలోచించాలి. పొదుపు చర్యలతో ఆదాయం తగ్గినా భరించేందుకు సిద్ధం. వాకింగ్‌, సైక్లింగ్‌ తదితర పర్యావరణ హితమైన చర్యలు పాటించాలి. రైతులు కూడా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. నానో ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన పెంచుకోవాలి.’’


ఈవీ స్టేషన్లను పెంచుదాం..

‘‘రాష్ట్రంలో ఈవీ స్టేషన్ల పెంపులో భాగంగా ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిద్దాం. ట్రాఫిక్‌లో ఎక్కువ సేపు వాహనాలు నిలవకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ తీసుకుంటున్న పొదుపు చర్యలపై సమీక్షిస్తాం. స్వదేశీ పర్యాటకం, స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. మన దేశంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు తగ్గించుకుని వేసవి, ఇతర సెలవు రోజుల్లో ఆయా ప్రాంతాలను సందర్శించాలి. విదేశీ వస్తువుల కొనుగోళ్లను తగ్గించి స్వదేశీ తయారీ ఉత్పత్తులను ఎక్కువగా వాడాలి. పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ వంటి పథకాలను సీరియ్‌సగా తీసుకోవాలి. ఎప్పటినుంచో చెబుతున్నా, నా మాటలను చాలా మంది మంత్రులు సీరియ్‌సగా తీసుకోలేదు. పదేళ్ల క్రితమే పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) ఆవశ్యకతను ప్రస్తావించాను. మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతో అమలులో తీవ్రజాప్యం చోటుచేసుకుంది’’

డీ లిమిటేషన్‌ జరుగుతుంది..

‘‘కేంద్రం డీలిమిటేషన్‌ విషయంలో చాలా పట్టుదలతో ఉంది. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ తప్పకుండా జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఎలాంటి సంక్షోభ పరిస్థితులు లేకున్నా, యూరియా లభ్యత బాగున్నా, నిర్వహణ లోపంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి యూరియా విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది’’.


ఒక్కసారిగా ప్రకటనలొద్దు: పవన్‌

పొదుపు చర్యలపై ప్రభుత్వం ఒక్కసారిగా ప్రకటనలు, ప్రచారం మొదలుపెడితే ప్రజలు భయపడిపోయే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముందుగా పరిస్థితిని వివరించి, వారికి అవగాహన కల్పించాక ముందుకు వెళితే బాగుంటుందని సూచించారు. సీఎం స్పందిస్తూ, 2-3 రోజులు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిద్దామని అన్నారు.

ఆలస్యంగా వచ్చిన కార్యదర్శులపై ఆగ్రహం

క్యాబినెట్‌ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి ఒకరిద్దరు మినహా కార్యదర్శులు హాజరుకాకపోవడంపై సీఎం సీరియస్‌ అయ్యారు. అందరికీ సమాచారం ఇచ్చారా అని అక్కడే ఉన్న ప్రత్యేక సీఎస్‌ విజయానంద్‌ను ప్రశ్నించారు. బుధవారం రాత్రే అందరికీ సమాచారం పంపామని ఆయన తెలిపారు. దీంతో సీరియస్‌ అయిన సీఎం.. సమావేశానికి రాని వారి పేర్లు, ఆలస్యంగా వచ్చిన వారి పేర్లు నోట్‌ చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


అగ్రిగోల్డ్‌ బాధితులకు 6 నెలల్లో న్యాయం: సీఎం

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆరు నెలల్లో న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. ముగ్గురు మంత్రులతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నియమించాలని నిర్ణయించారు. ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 19.18 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉండగా, ఒక్క ఏపీలోనే సుమారు 11.57 లక్షల మంది ఉన్నారని హోం మంత్రి అనిత తెలిపారు. వారిలో ప్రతి ఒక్క బాధితుడికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు సైతం అగ్రి గోల్డ్‌ బాధితులకు చెందాల్సిన ఆస్తులను స్వాహా చేశారని, ఇది బాధాకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత సమయంలోగా అగ్రి బాధితులకు న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

Updated Date - May 15 , 2026 | 04:01 AM