‘దుర్భిక్ష’ జలాల్లో 76శాతం ఏపీకే!
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:57 AM
దుర్భిక్ష సమయంలో వినియోగం కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ‘క్యారీఓవర్’గా నిల్వ చేసిన జలాల్లో మెజారిటీ నీళ్లను వాడుకునే అధికారం తమకే ఉందని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది.
క్యారీఓవర్ నీటిపై మాకే అధికారం
తుంగభద్ర కుడి హెచ్‌ఎల్‌సీకి
కేటాయించిన నీరూ రావడం లేదు
ఆయకట్టు స్థిరీకరణకే గురురాఘవేంద్ర
తెలంగాణ వాదనలన్నీ అభూత కల్పనలే
ఆర్‌డీఎస్‌లో పూడికతీత, మరమ్మతులు చేపడితే ప్రవాహం పెరుగుతుంది
బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ స్పష్టీకరణ
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): దుర్భిక్ష సమయంలో వినియోగం కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ‘క్యారీఓవర్’గా నిల్వ చేసిన జలాల్లో మెజారిటీ నీళ్లను వాడుకునే అధికారం తమకే ఉందని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. తెలంగాణ వాటాగా 24 శాతం దక్కుతుందని వెల్లడించింది. ఈ విషయాన్ని కృష్ణా ట్రైబ్యునల్ సైతం స్పష్టం చేసిందని తెలిపింది. గురువారం ఢిల్లీలో బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా నేతృత్వంలోని లాయర్ల బృందం వాదనలు వినిపించింది. ట్రైబ్యునల్ కేటాయించని మిగులు జలాలు ఈ రెండు ప్రాజెక్టుల్లో క్యారీఓవర్ కింద నిల్వ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ‘తుంగభద్ర కుడి హైలెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సీ) కింద మాకు కేటాయించిన నీరు దక్కడం లేదు. సాగునీటి వినియోగానికి, ఆయకట్టు స్థిరీకరణకే గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం నిర్మించాం. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్) కుడి ప్రధాన కాలువకు కృష్ణా ట్రైబ్యునల్-2 నాలుగు టీఎంసీలను 65 శాతం మిగులు జలాల కింద కేటాయించింది. కానీ మేం అక్రమంగా వాడుతున్నామని తెలంగాణ చేస్తున్న ఆరోపణలో నిజం లేదు. కృష్ణా జలాలపై ఆ రాష్ట్రం వాదనలన్నీ అభూత కల్పనలే.. పిచ్చివాదనలే. తుంగభద్ర డ్యాం వద్ద జరిగిన భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌డీఎ్‌సకు మరమ్మతులు, పూడికతీత పనులు చేపడితే.. ప్రవాహం పెరుగుతుంది’ అని వివరించింది. 80 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపుపై శుక్రవారం కేంద్రం నియమించిన హైపవర్ కమిటీ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనుంది.