రెండేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:59 AM
రెండేళ్లలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డు నెలకొల్పామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్ తెలిపారు.
వైసీపీ సర్కార్ పారిశ్రామికవేత్తలను తరిమికొట్టింది
కూటమి వచ్చాక రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డు నెలకొల్పామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పారిశ్రామికవేత్తలను తరిమికొట్టిందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చెప్పారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును వివరించారు. గతేడాది విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.11.77లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోగా.. ఈ రెండేళ్లలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) రూ.7.66లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన భారీ పరిశ్రమలన్నీ పూర్తయితే 10.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో 20లక్షల కంటే ఎక్కువే ఉద్యోగాలు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందినవారి వివరాలను ఆధార్ నంబర్లతో సహా వెల్లడిస్తామని చెప్పారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్‌తోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఏటా దావోస్ ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతూ ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరుపుతుండటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగిందన్నారు.
‘ఇంటికొక పారిశ్రామికవేత్త’ నినాదం సాకారం
‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ అని సీఎం ఇచ్చిన నినాదాన్ని నిజం చేసేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పార్కుల్లో పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 23 శాఖలకు సంబంధించిన అనుమతులను 21 రోజుల్లోనే మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ ద్వారా సొంత స్థలాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 మేజర్ ప్రైవేట్ పార్కులు రాగా.. మరో 7 ఎంఎ్‌సఎంఈ ప్రైవేట్ పార్కులు రాబోతున్నాయని తెలిపారు. ప్రపంచ బ్యాంక్, నీతి అయోగ్ సాయంతో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రత్యేక ఎకనమిక్ జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. త్వరలో ప్రత్యేక ఏపీ టాయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ, ఫర్నిచర్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీలతో పాటు పెద్ద పారిశ్రామిక పార్కుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వసతి కోసం ‘ఇండస్ట్రియల్ హౌసింగ్ పాలసీ’లను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలులోకి తీసుకురానుందని మంత్రి వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలనేది లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 50 శాతం పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలకు ఏపీని ప్రధాన ‘ఫుడ్ సప్లయ్ హబ్’గా మార్చేందుకు దుబాయ్ మంత్రులతో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చుతున్నాయని వివరించారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో భారీ టమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చేనెల కల్లా పూర్తి కాబోయే అనకాపల్లి ప్లాంట్‌లో జాక్‌ఫ్రూట్ (పనసపండు), మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లను ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి తెస్తామన్నారు. సిక్ రివైవల్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని సిక్ ఇండస్ట్రీస్ సమస్యల పరిష్కారానికి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని భరత్ చెప్పారు. పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టులు ప్రారంభించని సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గడచిన 20 రోజుల్లో 90 పారిశ్రామిక సంస్థలకు 900 నోటీసులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.