Share News

AP CID SP: విదేశీ ఉద్యోగాల పేరిట సైబర్‌ నేరగాళ్ల ఎర

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:46 AM

విదేశాల్లో ఉద్యోగాలంటూ సోషల్‌ మీడియాలో వచ్చే అనధికారిక ప్రకటనలు నమ్మి యువత మోసపోవద్దని ఏపీ సీఐడీ అప్రమత్తం చేసింది.

AP CID SP: విదేశీ ఉద్యోగాల పేరిట సైబర్‌ నేరగాళ్ల ఎర

  • ఆన్‌లైన్‌ ప్రకటనలతో మోసపోవద్దు.. సీఐడీ ఎస్పీ రాణా హెచ్చరిక

అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాలంటూ సోషల్‌ మీడియాలో వచ్చే అనధికారిక ప్రకటనలు నమ్మి యువత మోసపోవద్దని ఏపీ సీఐడీ అప్రమత్తం చేసింది. అధిక వేతనాలు, ఆకర్షణీయమైన ఉద్యోగాలంటూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సీఐడీ ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా సూచించారు. సోషల్‌ మీడియా ద్వారా ఫేక్‌ రిక్రూట్మెంట్‌ ఏజెన్సీలు యువతను మోసం చేసి విదేశాల్లో సైబర్‌ బానిసల్ని చేసి అమానుషంగా వ్యవహరించిన వైనాన్ని మంగళగిరిలోని ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆయన విలేకర్లకు వివరించారు. రోజు రోజుకూ పెచ్చుమీరుతున్న సైబర్‌ ముఠాలు థాయ్‌లాండ్‌, కంబోడియా, మయన్మార్‌, లావోస్‌ వంటి దేశాల్లో మన దేశ యువతను నిర్బంధించి సైబర్‌ బానిసత్వం చేయించారని తెలిపారు. ఇటీవల కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖలు ఆయా దేశాల నుంచి సైబర్‌ బానిసల్ని విడిపించి తీసుకొచ్చాయని, అందులో ఏపీకి చెందిన 120మంది అనుభవాలు, ఇబ్బందుల్ని సీఐడీ ఎస్పీ వివరించారు. విదేశాల్లో క్రిప్టో, కాల్‌ సెంటర్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగం ఉందని, వీసా అక్కర్లేదంటూ నకిలీ ఏజెన్సీలు ఆశపెట్టి తీసుకెళ్లి రోజుకు 15గంట నుంచి 18గంటల పాటు సైబర్‌ మోసాలు చేయిస్తున్నాయని చెప్పారు. నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోకపోతే శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతూ జీతాలు, పాస్‌ పోర్టు ఇవ్వకుండా అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. కనుక, సోషల్‌ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటన లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దని, 1930కు ఫోన్‌ చెయ్యాలని సీఐడీ ఎస్పీ కోరారు. విదేశాల్లో ఉన్న సైబర్‌ ముఠాల్లోని కింగ్‌ పిన్‌లపై లుక్‌ అవుట్‌ సర్కులర్‌ జారీ చేసి రప్పించి జైలుకు పంపుతామన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 06:48 AM