Share News

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:58 AM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం

  • అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

  • వ్యవసాయ, అనుబంధ శాఖలకు సీఎస్‌

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎల్‌నినో నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్యశాఖలు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. సీఎస్‌, అధికారులు పలు సూచనలు చేశారు.

  • ప్రతి జిల్లా కలెక్టర్‌ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ హైరిస్క్‌ మండలాలు, రైతుసేవా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

  • రాష్ట్రంలో జూన్‌ 1 నుంచి జూలై 15 వరకు 48.3 శాతం వర్షపాతం లోటు నమోదైంది. 24 జిల్లాలు లోటు వర్షపాతం, 4 జిల్లాలు తీవ్ర లోటు వర్షపాతం కేటగిరిలో ఉన్నాయి. అధిక ప్రభావిత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

  • 8,489 రైతు సేవా కేంద్రాల్లో 1,357 అధిక ప్రభావం, 2,077 మోస్తరు ప్రభావం, 5,055 తక్కువ ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. రాయలసీమ జిల్లాలు అత్యధిక ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.

  • రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించాలి. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పంటల సంరక్షణపై నిరంతరం సలహాలు అందించాలి.

  • ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలి. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలి.


  • వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన ప్రీ-మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌), తక్కువ నీటితో సాగు చేసే పంటలను విస్తరించాలి.

  • జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతి రోజూ పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించాలి.

  • ఎల్‌నినో ప్రభావంతో మిర్చి, ఉల్లి, మామిడి, నిమ్మ, నారింజ, కూరగాయలు వంటి ఉద్యాన పంటలకు అధిక ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా రాయలసీమలో నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాల తగ్గుదల వల్ల దిగుబడులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

  • డ్రిప్‌ ఇరిగేషన్‌ను విస్తృతం చేయాలి. పంట కుంటలు, మల్చింగ్‌, షేడ్‌ నెట్లు, సూక్ష్మపోషకాల వినియోగాన్ని ప్రోత్సహించాలి.

  • పశుసంవర్థక శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి. పశుగ్రాసం, తాగునీటి లభ్యత అత్యంత కీలకం.

  • ఆక్వా, మత్స్యరంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించాలి.

Updated Date - Jul 18 , 2026 | 04:59 AM