Share News

చీప్‌ లిక్కర్‌లో కక్కుర్తి!

ABN , Publish Date - May 26 , 2026 | 04:41 AM

పేదల జేబుకు చిల్లు పెట్టకూడదనే సానుకూల ఉద్దేశంతో ప్రభుత్వం ‘క్వార్టర్‌ రూ.99’ ధరతో కొన్ని మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది.

చీప్‌ లిక్కర్‌లో కక్కుర్తి!

  • అధికారుల మామూళ్లు

  • డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటూ రూ.99 బ్రాండ్లపై

  • వసూలు.. ప్రభుత్వ అసలు ఉద్దేశానికి తూట్లు

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): పేదల జేబుకు చిల్లు పెట్టకూడదనే సానుకూల ఉద్దేశంతో ప్రభుత్వం ‘క్వార్టర్‌ రూ.99’ ధరతో కొన్ని మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ బ్రాండ్ల మద్యం హాట్‌ కేకుల్లా అమ్ముడవుతోంది. ఈ డిమాండ్‌ను కొందరు అధికారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి మద్యం డిపోలకు వెళ్తున్న ఈ బ్రాండ్లను షాపులకు సమానంగా పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఒక డిపోకు పంపిన మద్యాన్ని ఆ డిపో పరిధిలోని బార్లు, షాపులకు విక్రయిస్తారు. లైసెన్సీలు పెట్టుకునే ఇండెంట్‌ ఆధారంగా కేటాయిస్తారు. అయితే, క్వార్టర్‌ రూ.99 బ్రాండ్ల ధర తక్కువ కావడంతో వాటికి భారీ డిమాండ్‌ ఉంది. షాపుల లైసెన్సీలు వాటికోసం ఎగబడుతున్నారు. కార్పొరేషన్‌ నుంచి వచ్చే ఈ బ్రాండ్ల సరుకును కొంత డిపోల్లోనే ఉంచి మిగిలిన దానిని షాపులకు అమ్ముతున్నారు. అయితే.. ఈ క్రమంలో కొన్ని షాపుల లైసెన్సీలు సకాలంలో కొనుగోలుకు రాకపోతే ఆ కోటా కూడా డిపోల్లోనే మిగిలిపోతోంది. తొలుత మిగిల్చిన దానిని, ఆ తర్వాత లైసెన్సీలు కొనకపోవడం వల్ల మిగిలిన దానిని కలిపి డిపోల అధికారులు తమకు నచ్చిన వారికి అమ్ముతున్నారు. దీనికోసం ఒక్కో కేసుకు రూ.100 చొప్పున మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో డిపోల అధికారులు ఈ మద్యం అమ్మకాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాండ్లకు డిమాండ్‌ ఉందని, వాటిని ఇవ్వాలంటే ‘మా కేంటి?’ అని అడిగి మరీ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.

18 శాతానికి అమ్మకాలు

ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన కొత్తలో క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లు రాష్ట్రంలోకి వచ్చాయి. నాణ్యమైన మద్యం కేవలం రూ.99కే లభిస్తుండటంతో వినియోగదారులు వాటిని భారీగా కొనుగోలు చేశారు. దీంతో మొత్తం అమ్మకాల్లో ఆ బ్రాండ్ల వాటా 30 శాతానికి చేరింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. దీంతో ఆ తర్వాత ఎక్సైజ్‌ శాఖ ఆ బ్రాండ్లను క్రమంగా తగ్గించింది. దీంతో వాటి వాటా 18శాతానికి చేరింది.


  • ఎక్సైజ్‌ పాలసీలో మార్పులు!

  • ధరలు, లైసెన్స్‌ రుసుము, దుకాణాల పునర్విభజనపై సమీక్ష

  • సంస్కరణలపై చర్చించిన మంత్రివర్గ ఉప సంఘం

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి, భవిష్యత్‌ కార్యాచరణపై సోమవారం మిశ్రిత విధానంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రంలో అమలులో ఉన్న ఎక్సైజ్‌ విధానం, దాని అమలు తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్‌ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, వ్యాపారుల ఆర్థిక స్థిరత్వం, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రవాణా, ప్యాకేజ్‌ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బీరు, మద్యం ధరల సవరణ అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. విమానాశ్రయాల్లో మద్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు, డిజిటల్‌ చెల్లింపుల బలోపేతం వంటి అంశాలపై సమీక్షించారు.

Updated Date - May 26 , 2026 | 04:41 AM