మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కల్పించాలి
ABN , Publish Date - May 30 , 2026 | 05:36 AM
రాష్ట్రంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి గుంటూరు, గుంతకల్లు వంటి ముఖ్యమైన డివిజన్లకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కల్పించాలని...
సౌత్ కోస్ట్ రైల్వే జీఎంకు ఏపీ చాంబర్స్ వినతి
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి గుంటూరు, గుంతకల్లు వంటి ముఖ్యమైన డివిజన్లకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజరు సందీప్ మాధుర్‌కు.. ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ‘విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, కొచ్చిన్, అహ్మదాబాద్, పుణే తదితర ముఖ్యమైన నగరాలకు విజయవాడ నుంచే ప్రారంభమయ్యేలా అదనపు రైళ్లను ప్రవేశపెట్టాలి. ప్రతిపాదిత విజయవాడ-బెంగుళూరు వందేభారత్ సేవలను వేగవంతం చేయాలి. విజయవాడ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, తిరుపతిలకు ఉదయం వేళల్లో కనెక్టివిటీ ఉండేలా సేవలను విస్తరించాలి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర సుదూర ప్రాంతాలకు వందే భారత్ స్లీపర్ సేవలను ప్రవేశపెట్టాలి. విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు, తిరుపతిలకు వందే భారత్ కనెక్టివిటీని పెంచాలి.’ అని పొట్లూరి భాస్కరరావు కోరారు.