చింతలపూడిని సాగర్‌తో ముడిపెడతారా?
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:43 AM
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుపై తెలంగాణ చేసిన వాదనలో హేతుబద్ధత లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. గోదావరి వరదజలాలపై ఆధారపడిన చింతలపూడి ఎత్తిపోతల పథకం..
ఆ ఎత్తిపోతల గోదావరి వరద నీటిపై ఆధారపడి ఉంది
అది ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోకి ఎలా వస్తుంది?
తెలంగాణ వాదనలపై ఏపీ అభ్యంతరం
బ్రిజేశ్ ట్రైబ్యునల్ విచారణ వచ్చే నెలకు వాయిదా
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుపై తెలంగాణ చేసిన వాదనలో హేతుబద్ధత లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. గోదావరి వరదజలాలపై ఆధారపడిన చింతలపూడి ఎత్తిపోతల పథకం.. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉందనడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎడమ కాలువ ఆయకట్టుతో పాటు పంటల విధానంపై ఆ రాష్ట్రం అన్యాయంగా మాట్లాడుతోందని తెలిపింది. బుధవారం ఢిల్లీలో బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా పటిష్ఠ వాదనలు వినిపించారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో 3.78 లక్షల ఎకరాలే ఉందని.. ఖరీ్‌ఫలో 52 వేల ఎకరాల్లోనే సాగు చేసుకోవాలని.. మిగతా 3.26 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలు వేయాలని తెలంగాణ డాక్యుమెంటులో పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఎడమ కాలువ ఆయకట్టుపై ట్రైబ్యునల్ ముందు తెలంగాణ సాక్షి చెప్పిన గణాంకాలన్నీ ఊహాజనితమేనని.. ఆ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్నే చెప్పారని ఆక్షేపించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం గోదావరి వరద నీటిపై ఆధారపడి ఉందని.. కృష్ణా బేసిన్ పరిధిలో లేదని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ వాదనలన్నీ తోసిపుచ్చాలని కోరారు. తదుపరి విచారణను ట్రైబ్యునల్ వచ్చే నెలకు వాయుదావేసింది. వచ్చే నెల 22 నుంచి 24వ తేదీ దాకా వాదనలు వింటామని వెల్లడించింది.