ఏరువాక సాగాలో
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:35 AM
జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక ఉత్సవాన్ని రైతులు ఘనంగా జరుపుకొన్నారు.
అరక దున్ని విత్తనాలు చల్లి పండగ చేసుకున్న రైతులు
అన్నదాతలకు సీఎం శుభాకాంక్షలు
‘వీబీ జీ రాంజీ’తో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం: డిప్యూటీ సీఎం పవన్
రంగా వర్సిటీలో రాష్ట్రస్థాయి కార్యక్రమం
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక ఉత్సవాన్ని రైతులు ఘనంగా జరుపుకొన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుడుతూ రైతులు ఎద్దులకు అరకలు కట్టి, ట్రాక్టర్లతో పొలాలు దున్ని, పంటలు దండిగా పండాలని కోరుకుంటూ విత్తనాలు జల్లారు. గ్రామాల్లో రైతులు గ్రామ దేవతలకు నీరు పోసి, ఎడ్ల జతలు, ట్రాక్టర్లతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి, ఏరువాక సాగారు. వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో గుంటూరు సమీపంలోని లాంఫాంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్నలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ, ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ’వీబీ-జీ-రాం-జీ’ పనుల్లోనూ రైతులకు మేలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా రైతాంగానికి అందిస్తున్న సేవలను వివరించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయపాలెంలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి నాగలి పట్టి, దుక్కి దున్ని ఏరువాక ఉత్సవంలో పాల్గొన్నారు. మన్యం జిల్లాలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏరువాక ఉత్సవంలో పాల్గొని, ఎల్‌నినో నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.