దిశ బిల్లు వెనక్కి..
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:23 AM
తెలంగాణలో 2019లో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో అప్పటి ఏపీ సీఎం జగన్ హడావుడిగా తెచ్చిన ‘దిశ బిల్లు’ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
నాడు హడావుడిగా తెచ్చి, అసాధ్యంగా మార్చేసిన జగన్
కేంద్రం సూచనతో ఉపసంహరించుకున్న సర్కార్
బిజినెస్ మరింత ఈజీ.. కొత్త పాలసీకి గ్రీన్‌సిగ్నల్
రూ.1.50కే ఆక్వా చెరువులకు విద్యుత్.. కొనసాగింపు
పీపీపీలో ‘అమరావతి-ఐ’.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2019లో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో అప్పటి ఏపీ సీఎం జగన్ హడావుడిగా తెచ్చిన ‘దిశ బిల్లు’ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ బిల్లులోని పలు నిబంధనల అమలు అసాధ్యమని అప్పట్లోనే కేంద్ర హోంశాఖ తేల్చేసింది. ‘నిర్భయ’ చట్టం దేశమంతా అమలవుతుండటంతో కేవలం ఏపీకే ప్రత్యేక చట్టం అవసరమా అని సందేహం వెలిబుచ్చింది. దీనికితోడు.. బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించి.. కేంద్రం స్థాయిలో ప్రక్రియ కొనసాగుతుండగానే... ఐపీసీ, సీఆర్‌పీసీల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత తదితర చట్టాలు అమల్లోకి వచ్చాయి. మహిళలపై వేధింపులను గట్టిగా కట్టడి చేస్తూ భారతీయ న్యాయ సంహితలో కఠిన నిబంధనలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో దిశ బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గురువారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ప్రతిపాదించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026’కు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదా బిల్లును కూడా ఆమోదించింది. భవిష్యత్‌లో ఆదాయం తెచ్చిపెట్టే ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించేలా ప్రత్యేక బ్రిడ్జ్ ఫండ్‌ను ఈ పాలసీలో పొందుపరిచారు. ఈ వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు.
కీలక నిర్ణయాలు..
ఆక్వా చెరువులకు యూనిట్ రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ రాయితీ పొడిగింపు. దీనివల్ల ఆక్వా రైతులకు రూ.1,150 కోట్ల లబ్ధి.
గోదావరి పుష్కరాలకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 238 స్నాన ఘట్టాలు, ఇతర పనులకు రూ.210.06 కోట్లకు పాలనా అనుమతి.
పాదచారుల రక్షణ బిల్లు, కార్యాచరణ మార్గదర్శకాలకు ఆమోదం.
పునర్వ్యవస్థీకరించిన జిల్లాల పరిధికి అనుగుణంగా ఏపీ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల పునర్విభజనకు ఆమోదముద్ర.
విశాఖ ఎకనామిక్ రీజియన్ కార్యక్రమం కింద వెలంపేట మురికివాడ పునరాభివృద్ధిని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు జీవీఎంసీకి అనుమతి.
పరిశ్రమలశాఖ ఆమోదించిన ప్రాజెక్టుకు హడ్కో మంజూరు చేసిన రూ.680.21 కోట్ల టర్మ్ లోన్‌ను బల్క్ డ్రగ్ కార్పొరేషన్ ద్వారా పొందేందుకు అనుమతి.
అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూసమీకరణకు అనుమతి.
అమరావతి క్యాంటమ్ వ్యాలీ టెక్ పార్కులోని కంప్యూటింగ్ సెంటర్‌కు ఇరువైపులా టీ1, 2 ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి ఎల్1 బిడ్ ఖరారు చేసేందుకు ఏజీఐసీఎల్‌కు అధికారం.
’అమరావతి-ఐ’ అభివృద్ధికి పీపీపీ విధానంలో తిరిగి టెండర్.
వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ సిఫారసులకు, సీఆర్డీయే ప్రతిపాదనలకు ఆమోదం.
రాజధాని రెండోదశ భూసమీకరణ పథకంలో భాగంగా పల్నాడు జిల్లా వైకుంఠపురంలోని దేవదాయ, ఈనాం భూములకు సంబంధించి, పరస్పర వివాద దావాలను పరిష్కరించేందుకు దేవదాయ శాఖ రూ.122.20కోట్ల పరిహారం చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం.
హైకోర్టు భవన నిర్మాణ విస్తీర్ణం పెరుగుదల వల్ల కన్సల్టెన్సీ సేవల పరిధి, ఫీజు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ల నియామకం, అదనపు ఫీజుకు జీఎస్టీతో కలిపి రూ.206.59కోట్లు చెల్లింపు.
ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం-2016 సవరణ ద్వారా ఆర్వీఎస్ యూనివర్సిటీ, ప్రగతి యూనివర్సిటీ పేర్ల చేర్పు.
హంద్రీనీవా ప్రాజెక్టు-2లో ఉన్న ప్రధాన కాలువకు మిగిలిపోయిన ఐదు పనులు రూ.600కోట్ల అంచనా వ్యయంతో మంజూరు.
భూ బదిలీలు..లీజులు..
పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం కడప జిల్లా చెర్లోపల్లిలో 49.67 ఎకరాలు, వేములలో 51.37 ఎకరాలు లీజు ప్రాతిపదికన ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి బదిలీ.
కుప్పం మండలంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.12.44లక్షల చొప్పున పరిహారం.
చిత్తూరు జిల్లా తిమ్మ సముద్రంలో 13.47 ఎకరాల భూమి లేఔట్ అభివృద్ధి కోసం చిత్తూరు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీకి బదిలీ.
కండలేరు నుంచి శ్రీసిటీలోని పారిశ్రామిక క్లస్టర్లకు నీటి సరఫరా పైపులైన్ నిర్మాణానికి తిరుపతి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మళ్లించిన 1.76హెక్టార్ల అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా నెల్లూరు జిల్లా పంగిలిలోని 8.70ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ శాఖకు బదిలీ.
శ్రీసత్యసాయి, అన్నమయ్య, కోనసీమ జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల్లో రెండేసి ఎకరాలు లీజుపై ఇచ్చేందుకు ఆమోదం.
జగన్ హడావుడికి ‘దిశ’ బలి
అసాధ్యమని అప్పుడే చెప్పిన కేంద్ర హోంశాఖ
మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై ఒక వారంలో ట్రయల్, మరో వారంలో తీర్పు, వారికి కేవలం మూడు వారాల్లో మరణ శిక్ష వంటి వంటి అంశాలతో ‘దిశ బిల్లు’ను నాటి వైసీపీ ప్రభుత్వం తయారుచేసింది. 2019 డిసెంబరులో అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. అయితే, ఈ బిల్లులోని అంశాలను అమలుచేయడం అసాధ్యమని అప్పట్లోనే కేంద్రం తేల్చేసింది. అయినా, జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు రాష్ట్ర ప్రజల్ని దిశ చట్టం పేరుతో మభ్య పెట్టింది. అప్పటికే ఉన్న మహిళా పోలీసు స్టేషన్లకు దిశ పోలీసు స్టేషన్లుగా పేర్లు మార్చింది. 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఫోర్త్ లయన్ యాప్‌ను దిశ యాప్‌గా మార్చి బలవంతంగా డౌన్‌లోడ్ చేయించింది. అయితే కేంద్రం కొర్రీలను నివృత్తి చేయలేకపోయింది. కేంద్ర న్యాయశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ లేవ నెత్తిన ప్రశ్నలకు, కేంద్ర హోంశాఖ తెలిపిన అభ్యంతరాలకు సరైన వివరణ ఇవ్వలేకపోయింది. ఐపీసీ, సీఆర్‌పీసీ లాంటి చట్టాలతో పాటు నిర్భయ లాంటివి ఉన్నప్పుడు కేవలం ఏపీ వరకే అమలయ్యేలా మరో చట్టం(దిశ) అమలును రాజ్యాంగం అంగీకరించబోదని రాష్ట్రపతి కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో దిశ బిల్లు ముందుకు కదలకుండా ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో నిర్భయ లాంటి చట్టాలతో పాటు బీఎన్‌ఎస్ వంటివి బలంగా ఉన్నాయి. దీంతో వాటినే ఏపీలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం హడావుడిగా ప్రకటించి, అమల్లో కష్టమైన దిశ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందే అవకాశం లేనట్టే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది.