ప్రైవేటు బస్సులపై పన్ను తగ్గింపు
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:02 AM
రాష్ట్రంలో నడిచే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు సంబంధించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
సీటుకు రూ.2500గా నిర్ణయం
ఏడాదికి బస్సుపై రూ.2 లక్షలు ఆదా
మంత్రివర్గం నిర్ణయం.. ఆపరేటర్ల హర్షం
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నడిచే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు సంబంధించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క సీటుపై రూ.4000గా ఉన్న పన్నును రూ.2500కు తగ్గించింది. దీనిని ప్రతి 3నెలలకు ఒకసారి అమలు చేయనున్నారు. తద్వారా ప్రైవేటు బస్సులను రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రోత్సహించినట్టు అవుతుందని, ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పన్నుల భారం కారణంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. ఫిట్‌నెస్ పరీక్షలు కూడా రాష్ట్రంలోనే జరగనున్నాయి. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటి వరకు..
రాష్ట్రంలో తిరిగే ప్రైవేటు బస్సుల రిజిస్ట్రేషన్ ఇక్కడ కాకుండా.. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటిచోట్ల చేయిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. రిజిస్ట్రేషన్ చార్జీల భారంతోపాటు పన్నుల మోతేనని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏపీలో ప్రతి 3నెలలకు ఒకసారి సీటుకు రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.12వేల వరకు రోడ్డు రవాణా విభాగానికి పన్ను చెల్లించాలి. ఒక్కో బస్సకు ప్రతి క్వార్టర్‌కు రూ.1.50 లక్షల చొప్పున ఏడాదికి 4 విడతల్లో రూ.6 లక్షల వరకుభరించాల్సి వస్తోంది. అదే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో అయితే ఏడాదికి రూ.40వేల నుంచి రూ.56వేలు చెల్లిస్తే అనుమతులు వస్తున్నాయి. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. కేంద్రానికి ఆలిండియా పర్మిట్ కోసం ఏడాదికి రూ.90వేలు చెల్లించాలి. ఇది ఏపీలో చెల్లించే పన్ను కన్నా తక్కువగా ఉండటంతో బస్సుల యజమానులు ఈశాన్య రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు.
ఫిట్‌నెస్ విషయంలో కూడా..
ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్ అంశం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలపై చేపట్టిన దర్యాప్తులో వాహన ఫిట్‌నెస్‌లో గోల్‌మాల్ జరుగుతోందని గుర్తించారు. రెండేళ్లకు ఒకసారి అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌కు వెళ్లి ఫిట్‌నెస్ టెస్టు చేయించాల్సి ఉన్నా.. ప్రైవేటు యజమానులు దొడ్డిదారిలో పూర్తి చేస్తున్నారు. రికార్డులు మాత్రమే మెయిల్ ద్వారా పంపి ఏజెంట్ల ద్వారా ఫిట్‌నెస్ చేయిస్తున్నట్లు బయట పడింది. దీనిని నివారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పన్నులు తగ్గిస్తే ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని, ఫిట్‌నెస్ టెస్టులు ఇక్కడే జరుగుతాయని యజమానులు విన్నవించారు. ఈ విషయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఇకపై ప్రైవేటు బస్సులు చెల్లించే పన్ను ఒక్కో సీటుపై రూ.1500 చొప్పున ఏడాదికి రూ.6వేలకు తగ్గిపొనుంది. ఒక్కో బస్సుకు ఏటా రూ.6 లక్షలు చెల్లించే యజమానికి సుమారు రూ.2 లక్షలు కలిసి రానుంది. ఏఆర్ బస్సులతో పాటు నాగాలాండ్ రిజిస్ట్రేషన్లన్నీ ఏపీలోకి మార్పుచేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రైవేటు బస్సుల యజమానులకు సూచించారు. ఇదిలావుంటే, పన్నులు తగ్గించిన నేపథ్యంలో ప్రయాణ చార్జీలు కూడా తగ్గించే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.