అమరావతి క్వాంటమ్ వ్యాలీలో..జంట ఆఫీసు టవర్లు
ABN , Publish Date - May 01 , 2026 | 03:57 AM
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జంట ఆఫీసు టవర్లు (టీ1, టీ2), షెల్ అండ్ కోర్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
37 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం.. మంత్రివర్గ నిర్ణయం
ఎస్పీఎఫ్‌లో 385 కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. న్యాయ విభాగాల్లో కొత్తగా 21 పోస్టులు
రూ.124 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్.. పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమకు 350 ఎకరాలు
41 అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ఆర్థిక మంత్రి పయ్యావుల వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జంట ఆఫీసు టవర్లు (టీ1, టీ2), షెల్ అండ్ కోర్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ వెనుక రూ.1208.41 కోట్ల వ్యయంతో 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు టవర్లు నిర్మిస్తారు. ఒక్కో టవర్ 43 అంతస్తులతో నిర్మించనున్నారు. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణానది కుడి గట్టుపై వరద నిరోధక (కరకట్ట) రోడ్డును పటిష్ఠపరచాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీని నిర్మాణానికి ఉద్దేశించిన మూడు ప్యాకేజీలకు.. సవరించిన అంచనా ప్రకారం మొత్తం రూ.443.26 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపింది. పని పరిధి రిటైనింగ్ వాల్ నుంచి రెండు వైపులా ఎంబ్యాంక్‌మెంట్‌కు మార్చడానికి గతంలో పరిపాలనా ఆమోదం పొందిన రూ.1304.89 కోట్లను సవరించి.. తాజాగా టెండర్లు పిలవడానికి అమరావతి డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు అనుమతించింది. మొత్తం 11 కిలోమీటర్ల కరకట్టలో కొత్తగా 4 కిమీ రోడ్డు నిర్మాణం చేపడతారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. 41 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.
ఢిల్లీలోని 11.536 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.124.50 కోట్లతో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి నిర్ణయం. నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు నిర్మాణ బాధ్యత అప్పగింత. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణానికి ఆమోదం. దీనికి తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ప్రజలే పేరు సూచించాలని వినతి.
ఏపీ భవన్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టు రద్దు.. ఆఫీస్ మేనేజర్ పోస్టు సెక్షన్ ఆఫీసర్ స్థాయికి అప్‌గ్రేడ్.
అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్సుల్లో రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, జీఏడీ టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్, బీఎంయూ పనుల కోసం కంబైన్డ్ పరిపాలన ఆమోదం కింద రూ.2,540 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అమరావతి గ్రోత్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్)కు అనుమతి.
అమరావతిలో శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్, అప్రోచ్ వంతెనలు వంటి పనులకు రూ.798 కోట్లకు పరిపాలనా ఆమోదం.
అమరావతి జోన్-11 పరిధిలో ఉండవల్లిలో భూసమీకరణ పథకం కింద లేఅవుట్లలో రూ.580 కోట్లతో రోడ్డు, కాలువలు, మౌలిక వసతుల కల్పన.
సీఆర్‌డీఏ సరిహద్దు లోపల ఎన్10-ఈ1 జంక్షన్ నుంచి ఎన్13-ఈ1 వరకు 220 కేవీ లైన్ల బ్యాలెన్స్ పనులకు యూజీ కేబుల్స్ ద్వారా రీరూటింగ్ చేయడానికి సవరించిన అంచనా రూ.1180.54 కోట్ల వ్యయానికి ఆమోదం.
ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్ల పోస్టులను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి ఆమోదం.
హైకోర్టు, జిల్లా న్యాయవ్యవస్థ, న్యాయ విభాగాల్లో కొత్తగా 21 పోస్టులు మంజూరు.. చీఫ్ కోర్టు మేనేజర్, ఐదుగురు సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 మంది కోర్టు మేనేజర్ల నియామకానికి నిర్ణయం.
శ్రీకాళహస్తిలోని ఏపీఎ్‌సఐఆర్‌డీ-పీఆర్, 3 ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్లలో మంజూరైన 20 రెగ్యులర్ పోస్టుల స్థానంలో 6 రెగ్యులర్, 14 అవుట్ సోర్సింగ్ పోస్టులు. సామర్లకోట, శ్రీకాళహస్తిలో మంజూరైన రెగ్యులర్ పోస్టుల స్థానంలో ఏడాది పాటు 9 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ.
ప్రకాశం జిల్లా రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సంబంధించి వ్యత్యాస పనులకు ఆమోదం. డ్రెడ్జింగ్‌తో తీసిన మట్టిని తరలించే ప్రదేశం మార్పు వల్ల ప్రాజెక్టు వ్యయంలో మార్పు, డ్రెడ్జింగ్‌తో అదనపు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రూ.354.23 కోట్ల ఖర్చుకు అనుమతి.
నెల్లూరు, కాకినాడ, కర్నూలు, కడప క్లస్టర్లలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు ఇంప్రూవ్‌మెంట్ చార్జీలపై 2ు స్టాంప్ డ్యూటీ మినహాయింపు.
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల స్థిరాస్తులు, షాపు గదుల లీజు పునరుద్ధరణ, అద్దెల నిర్ణయాన్ని సరళీకరించడానికి చట్ట సవరణ.
అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ చార్జీలు ఏకరూపంలో ఉండేలా మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు సవరణల ముసాయిదా బిల్లుకు ఆమోదం.
2025-26 రబీ సీజన్‌లో వరి సేకరణకు ఎన్సీడీసీ నుంచి రూ.1,800 కోట్ల మూలధన రుణం తీసుకోవడానికి మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాల్లో ఎస్టీ, ఎస్టీయేతరులకు వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద ఇల్లు నిర్మాణ యూనిట్ ధర రూ.2.85 లక్షల నుంచి రూ.3.57 లక్షలకు పెంపునకు నిర్ణయం. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఇంటి స్థలం విలువ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంపు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజీ-1 ఏజెన్సీకి పుష్కర ఎత్తిపోతల స్కీం మెయిన్ కాలువలో 12.885 కిలోమీటర్ల వద్ద డ్రెయిన్, సైఫన్ నిర్మాణం, 525 మీటర్ల పొడవున ఎస్కేప్ చానల్ తవ్వకం పనులు అదనంగా అప్పగింత.
శ్రీసత్యసాయి జిల్లాలో హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్-2లో సిమెంట్ కాంక్రీటు లైనింగ్‌తో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను ఆధునికీకరించే పనికి రూ.309.92 కోట్లకు ఆమోదం.
శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సవరించిన అంచనా రూ.1586.69 కోట్లకు ఆమోదం.
ఏపీపీసీసీ, డిస్కంలు.. ఆర్‌ఈసీ నుంచి తీసుకున్న ఎంటీఎల్ రుణాలు రూ.7 వేల కోట్లకు కొన్ని షరతులతో ప్రభుత్వ హామీ పొడిగింపు.
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంట్రిక్ స్కూల్ స్థాపనకు తిరుపతి జిల్లా కురుకాల్వ గ్రామంలో 10.10 ఎకరాల ప్రభుత్వ భూమి
ఆధునిక డంపింగ్ యార్డ్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు కడప జిల్లా కొలుముళ్లపల్లిలో 92 ఎకరాల ప్రభుత్వ భూమి.
పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో 22.74 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకి కేటాయింపు
అసెప్టిక్ ప్యాకింగ్ యూనిట్ అప్‌గ్రెడేషన్, పండ్ల నుంచి పల్ప్ తీసే సదుపాయాల కోసం ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు చిత్తూరు జిల్లా మజర కొత్తపల్లెలో 13.71 ఎకరాల ప్రభుత్వ భూమి (ధర ఎకరం రూ.లక్షన్నర).
టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి విజయనగరం జిల్లా కనపాక అయ్యన్నపేట, ప్రకాశం జిల్లా కొత్త మామిడిపాలెం, పార్వతీపురం మన్యం జిల్లా సుందరనారాయణపురం, రాజమండ్రి అర్బన్‌లో రెండెకరాల చొప్పున.. ఏలూరులో 1.61 ఎకరాలు, కర్నూలు జిల్లా కల్లూరులో ఒకటిన్నర ఎకరం ప్రభుత్వ భూమి కేటాయింపు. ఏడాదికి రూ.వెయ్యి చొప్పున లీజు పద్ధతిలో ఇవ్వడానికి నిర్ణయం.
మచిలీపట్నంలో ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ట్రస్టుకు ఒకటిన్నర ఎకరం ప్రభుత్వ భూమి రూ.37.56 కోట్లకు కేటాయింపు.
పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమకు 350 ఎకరాలు.