Share News

చిన్న పరిశ్రమలకు భారీ ఊతం

ABN , Publish Date - May 15 , 2026 | 05:27 AM

రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ( ఎంఎస్ఎంఈ)లకు ఈక్విటీ, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజ్‌...

చిన్న పరిశ్రమలకు భారీ ఊతం

  • ఏపీ ఎస్‌ఎంఈఎక్స్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ నిర్ణయం

  • లక్ష కోట్లతో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌

  • మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ( ఎంఎస్ఎంఈ)లకు ఈక్విటీ, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజ్‌ (ఏపీఎస్ఎంఈఎక్స్‌) ప్రారంభానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు కూడా నిర్ణయించింది. ఇది ఏపీఎస్ఎంఈఎక్స్‌ రూపకల్పనకు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, రెగ్యులేటరీ సంస్థలతో సమన్వయంతో సమగ్ర ప్రతిపాదనలను రూపొందించి సమర్పిస్తుంది. విశాఖపట్నం జిల్లాలో కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌తో అనుసంధానంగా గిగా స్కేల్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడానికి రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు 854.97 ఎకరాల భూమి కేటాయించి.. ప్రోత్సాహకాలను విస్తరించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. విశాఖ జిల్లాలోని పోలిపల్లి, భోగాపురం ఈస్ట్‌, భోగాపురం వెస్ట్‌ గ్రామాల్లో ఈ డేటా సెంటర్‌ నెలకొల్పుతారు. భూమిని 25 శాతం రాయితీతో కేటాయిస్తారు. రూ.1,08,010 కోట్ల భారీ పెట్టుబడితో వచ్చే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే క్యారియర్‌ ఎయిర్‌కండిషనింగ్‌ అండ్‌ రెఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ తిరుపతి జిల్లా శ్రీసిటీలో అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, రిఫ్రిజరేషన్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ నెలకొల్పడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశమైంది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) సిఫారసుల ఆమోదం సహా క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు.


  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ కోసం గ్రిడాన్‌ ఎనర్జీకి గుత్తపాడులో 47.65 ఎకరాలు కేటాయింపు. ఏపీ ఇండస్ట్రియల్‌ డెవల ప్‌మెంట్‌ పాలసీ(4.0) 2024-2029 కింద ప్రత్యేక ప్రోత్సహకాలు మంజూరు.

  • చిత్తూరు జిల్లా చినపందూరులో టైరు తయారీ యూనిట్‌ ఫేజ్‌-4 విస్తరణకు అపోలో టైర్స్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • నెల్లూరు జిల్లాలోని ఇఫ్‌కో కిసాన్‌ సెజ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎంజైమ్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ అండ్‌ ఫ్రాగ్నన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • తిరుపతి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్‌ తయారీ కర్మాగారం స్థాపనకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పేడగర్లపాడు, కాసానుపల్లి గ్రామాల్లో వేస్‌-హీట్‌ ఆధారిత పవర్‌ జనరేషన్‌ సహా ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ విస్తరణకు చెట్టినాడ్‌ సిమెంట్‌ కార్పొరేషన్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • ఎర్లీబర్డ్‌ స్కీమ్‌ కింద కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్(సీఎఫ్ఈ) పొందే గడువును 6 నెలలు పొడిగించడానికి ఆమోదం.

  • ఏఏకే సౌత్‌ ఈస్ట్‌ ఇండియా, ఐటీసీ, హ్యాంగ్యో ఐస్‌క్రీమ్స్‌ కంపెనీలకు మూలధన సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలు మంజూరు.

  • అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో నాలుగు బ్రాయిలర్‌ బ్రీడర్‌ ఫార్మ్‌లు, ఒక హేచరీ స్థాపనకు స్నేహ ఫార్మ్స్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.

  • కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టులో పీపీపీ విధానంలో ఆపరేట్‌-మేనేజ్‌-డెవలప్‌ మోడల్‌ ద్వారా కన్సెషనైర్‌ ఎంపిక కోసం ముసాయిదా ఆర్‌ఎఫ్‌పీకి ఆమోదం.

  • యామ్‌నాకో ఇండియా అభ్యర్థన మేరకు తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల గ్రామాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల స్థాపనకు ఆమోదం.. ప్రోత్సాహకాలు మంజూరు.

  • వేస్ట్‌ టు ఎనర్జీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ స్థాపన కోసం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం అనూరు గ్రామంలో 10.66 ఎకరాల ప్రభుత్వ భూమి కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కేటాయింపు.

  • పార్టీల కార్యాలయాలకు ప్రస్తుతం 33 సంవత్సరాల లీజు కాలపరిమితి 99 ఏళ్లకు పొడిగింపు.

  • మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ విస్తరణ, వెడల్పు పనులకు సంబంధించిన మూడు ప్రధాన ప్రాకేజీలకు రూ.790.38 కోట్లు మంజూరు.


  • ఐఐటీ తిరుపతి,ఐఐఎస్ఈఆర్‌ తిరుపతి, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుని ఏపీ ఫస్ట్‌ సంస్థను కంపెనీగా స్థాపించడానికి ఆమోదం.

  • పౌర ఆరోగ్య స్ర్కీనింగ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 904, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా 104 డయాగ్నిస్టిక్స్‌ ప్రోగ్రాం అమలు.

  • విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో కాంట్రాక్టు ఫ్యాకల్టీకి ఒక్కసారి మాత్రమే వర్తించేలా వెయిటేజీ ఇవ్వడానికి ఆమోదం.

  • ప్రధాని ‘నేషన్‌ ఫస్ట్‌’ పిలుపునకు అనుగుణంగా పొదుపు చర్యల అమలుకు రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం.

  • వివిధ ప్రాంతాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్ల స్థాపనకు పలు సంస్థలకు అనుమతి.

Updated Date - May 15 , 2026 | 05:29 AM