చట్టంతో కట్టడి
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:51 AM
సోషల్ మీడియా దుర్వినియోగానికి చెక్ పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే సహించొద్దని క్యాబినెట్ సమావేశంలో..
సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు
భావ వ్యక్తీకరణ సరే.. దూషణలకు దిగేవారికి చెక్
అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోం.. క్యాబినెట్ భేటీలో సీఎం స్పష్టీకరణ
వ్యవస్థలపై ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే స్థాయికి ఆ అరాచకం
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సాధనలో ఇలాంటివాటికి చోటు లేదు
నియంత్రణ వ్యవస్థలపై అధ్యయనం.. ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్
మహిళలు, బాలికలపై వేధింపుల కట్టడికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
విశాఖలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.. కాపులుప్పాడలో అదానీ మెడికల్ కాలేజీ
రూ.1008 కోట్లతో గూగుల్ వేర్‌హౌస్ నిర్మాణానికి ఓకే
సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షలకు కోచింగ్
రాష్ట్రంలో 3 ఎక్స్‌లెన్స్ సెంటర్లు.. రాజధానిలో భూ యజమానులకు కౌలు పెంపు
7 గ్రామాల రైతులకు లక్షన్నర రుణమాఫీ.. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా దుర్వినియోగానికి చెక్ పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే సహించొద్దని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు దీనిపై అమలుచేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతున్న హ్యాండ్లర్లను గుర్తించే సాంకేతిక శిక్షణను పోలీసులకు ఇప్పించాలని, సైబర్ నేరాలపై విషయ పరిజ్ఞానం కలిగినవారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించాలని తీర్మానించింది. అవసరమైతే సైబర్ నిపుణులతో పోలీసులు సమన్వయం చేసుకునేలా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని యోచించింది. మహిళలు, బాలికలపై వేధింపుల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని కూడా నిర్ణయించింది. ఈమేరకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. క్యాబినెట్‌లో సోషల్ మీడియాపైనే అధిక చర్చ జరిగిందని తెలిపారు. ‘‘సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలను.. ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక సామరస్యానికి తీవ్రమైన ముప్పుగా పరిగణించాలి. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలేగానీ, వ్యక్తిగతంగా కాదు.
ఈ అంశంపై పోలీస్ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించాం. ముఖ్యంగా మహిళలు, బాలికలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా అవమానకరమైనప్రచారం, అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రజాజీవితంలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదు. అవసరమైతే నేరస్థులను చట్టపరంగా జైలుకు పంపే చర్యలు కూడా తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణను ప్రభుత్వం గౌరవిస్తుంది. కానీ స్వేచ్ఛ పేరుతో అసత్యప్రచారం చేయడం, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం చేస్తామంటే మాత్రం సహించరాదని క్యాబినెట్ నిర్ణయించింది’’ అని మంత్రి వివరించారు.
ముఖ్యమైన నిర్ణయాలు
ఎన్‌ఐఏ కేసుల విచారణ కోసం విశాఖలో జిల్లా, సెషన్స్ జడ్జి స్థాయిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. రాష్ట్రంలో 20 ఎన్‌ఐఏ కేసులు పెండింగ్‌లో ఉండగా, అందులో 19 కేసులు విశాఖపట్నంలోనే ఉన్నాయి. దీంతో అక్కడ ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసిన కేసులను వేగంగా పరిష్కరించాలని క్బాబినెట్ నిర్ణయం. హైకోర్టులో జిల్లా న్యాయమూర్తి స్థాయికి సమానమైన, రెగ్యులర్ ప్రాతిపదికన రిజిస్ట్రార్ (కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్) పోస్టు సృష్టికి మంత్రి మండలి ఆమోదం.
ఏపీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన విధంగా 2024 జూన్ 12 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమలు చేసిన క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీంలో భూ యజమానులకు పదేళ్ల కాలానికి చెల్లించే కౌలును మెట్ట భూమి ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేలకు, జరీబు భూమి ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేలకు పెంచుతూ నిబంధనల సవరణకు ఆమోదం. సీఆర్డీఏ అథారిటీ తీర్మానం ప్రకారం 634 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 12 నెలలకాలానికి చెల్లించే అద్దెను నెలకు రూ.5వేలనుంచి రూ.10వేలకు పెంచుతూ నిబంధనల సవరణకు క్యాబినెట్ ఆమోదం. సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన విధంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని ఏడు గ్రామాల్లో రైతులకు రూ.లక్షన్నర చొప్పున రుణమాఫీ. సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుపై కొత్త ప్రతిపాదనలు, గత కేటాయింపుల సమీక్షకు సంబంధించి మంత్రుల బృందం సిఫారసుల ఆమోదం.
నెల్లూరు జిల్లా ఆకుతోటలో ఐటీసీ వారి వెల్‌కమ్ హోటల్స్ బ్రాండ్ కింద 4 స్టార్ హోటల్ ప్రాజెక్ట్ కోసం డీఎస్సార్ హాస్పిటాలిటీ సర్వీసె్‌సకు; కడపలో మాధవ్ బ్రాండ్ కింద 3స్టార్ హోటల్ ప్రాజెక్ట్ కోసం మాధవీ లేజర్ అండ్ స్టేస్‌కు; కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ అభివృద్ధికి శ్రీనివాసం అమ్యూజ్‌మెంట్‌కు ప్రోత్సాహకాలకి ఆమోదం.
కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి రూ.67.98కోట్లతో లిఫ్ట్, గ్రావిటీ ద్వారా మైనర్ ఇరిగేషన్ చెరువులకు నీరందించే ఫీడర్ చానెళ్ల నిర్మాణం, బీరగానిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనికి ఆమోదం.
ప్రభుత్వ హామీతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.1,800కోట్ల రుణం పొందటానికి మార్క్‌ఫెడ్‌కు అనుమతి.
శ్రీసిటీలో ప్రస్తుత చాక్లెట్ తయారీ యూనిట్‌ను రూ.1,801కోట్ల పెట్టుబడితో విస్తరించి, 80మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే మొండెలీజ్ ఇండియా ఫుడ్స్ కంపెనీకి ప్రోత్సాహకాలు.
చిత్తూరు జిల్లా గుడిపల్లి, శాంతిపురం మండలాల్లో రూ.1,137కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్యానెల్ తయారీ ప్రాజెక్ట్ ద్వారా 350 మందికి ఉపాధి కల్పనకు ముందుకొచ్చిన అవెరాన్ ప్యానల్స్ సంస్థ ప్రతిపాదనలకు ఆమోదం.
అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ర్టియల్ పార్క్‌లో రూ.1,600కోట్లతో 750 మందికి ఉపాధి కల్పించే అక్షత్ గ్రీన్‌టెక్‌కు ఎకరాకు రూ.65లక్షల రాయితీధరతో 34.02 ఎకరాల కేటాయింపు.
విశాఖ జిల్లా కనమంలో ఎకోబాక్స్ ఇండస్ర్టియల్ అసెట్ సంస్థకు ఎకరా రూ.55లక్షల చొప్పున 91.38 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం.
తిరుపతి జిల్లా చిన్నేటివాకంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ కోసం 63.01 ఎకరాల భూ సేకరణకు అనుమతి.
తిరుపతి జిల్లా దామినేడులో 21.10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీటూరిజం అథారిటీకి ఎకరం రూ.90 లక్షల చొప్పున బదిలీకి ఆమోదం.
గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో 10.04 ఎకరాల భూమిని పంచాయతీ పరిధి నుంచి డీనోటిఫై చేయడానికి, తోపు పోరంబోకు నుంచి పట్టా భూమిగా మార్చడానికి అనుమతి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.9,355కోట్ల అంచనాతో తలపెట్టిన 10 మల్టీ విలేజ్ స్కీమ్‌లకు, జల్‌జీవన్ మిషన్ లేదా ఇతర నిధులతో తీవ్ర నీటి కొరత ఉన్న ఆవాసాలకు తాగునీరు అందించేందుకు ఎస్డీఎస్ కింద రూ.1,811.81కోట్ల అంచనాతో 2,943 పనులకు అనుమతివ్వడానికి, ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన 53,54 జీవోలను రద్దు చేయడానికి అనుమతి.
మూడు ఎక్సలెన్సీ సెంటర్లకు క్యాబినెట్ ఓకే
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు విశాఖ జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఈ ఎక్సలెన్సీ సెంటర్లను ఈ విద్యాసంవత్సరం నుంచే ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్‌తోపాటు ఐఐటీ, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ ఇస్తారు. ఒక్కో సెంటర్‌లో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఎంపీసీ, బైపీసీలకు 150 మంది చొప్పున జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్‌లో 300 మందికి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశాల్లో బాలికలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.