Share News

గ్రామాలకు సురక్షిత తాగునీరు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:31 AM

వేసవి నేపథ్యంలో గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో రూ.9,355 కోట్లతో ఏడు మల్టీ విలేజ్‌ స్కీం ప్రాజెక్టులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

గ్రామాలకు సురక్షిత తాగునీరు

  • రూ.9,355 కోట్లతో ఏడు మల్టీ విలేజ్‌ స్కీం ప్రాజెక్టులు

  • రూ.119 కోట్లతో నీరుకొండలో తెలుగు కల్చరల్‌ సెంటర్‌

  • గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌

  • క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో రూ.9,355 కోట్లతో ఏడు మల్టీ విలేజ్‌ స్కీం ప్రాజెక్టులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 76 మండలాల్లోని 65 లక్షల మందికి ఒక్కొక్కరికీ రోజుకు 55 లీటర్ల చొప్పున తాగునీరు సరఫరా చేయనున్నారు. అలాగే తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 112 గ్రామీణ నియోజకవర్గాల్లోని 3 వేల నివాస ప్రాంతాలకు సింగిల్‌ విలేజ్‌ స్కీం కింద సురక్షిత తాగునీరు అందించడానికి మరో రూ.1,814 కోట్లతో చేపట్టే 3వేల పనులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.

  • ఏపీ సీఎం ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (ఏపీ-సీఎంఈజీపీ) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 3,500 మంది మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందుకోసం రూ.300కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా 17వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని అంచనా.

  • ఏపీఎస్పీలోని 300మంది హెడ్‌కానిస్టేబుళ్ల పోస్టులను అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా స్థాయిని పెంచాలన్నప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌.

  • రాజధాని అమరావతిలోని నీరుకొండలో రూ.119.27 కోట్ల వ్యయంతో ‘తెలుగు కల్చరల్‌ సెంటర్‌’ నిర్మాణానికి ఆమోదం.

  • మిషన్‌ శక్తి కింద ‘సఖీ నివాస్‌’ పథకంలో కొత్తగా 30వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల ఏర్పాటు. వీటిలో ఉద్యోగానికి వెళ్లే తల్లుల కోసం పిల్లల డే కేర్‌ సదుపాయం.


  • ‘ధాత్రి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌’ అమలు చేయనున్న 8 జిల్లాల్లో అటవీ భూమి సాగు హక్కుదారులకు 100ు సబ్సిడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌, 90ు సబ్సిడీపై స్ర్పింక్లర్‌ ఇరిగేషన్‌ సంతృప్త స్థాయిలో ఇవ్వడానికి ఆమోదం.

  • విశాఖలో వాణిజ్య పన్నుల శాఖకు అదనపు కమిషనర్‌ (ఎస్టీ) పోస్టు మంజూరు చేయడానికి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అప్పిలేట్‌ కార్యాలయాల పరిధిని నోటిఫై చేయడానికి అనుమతి.

  • పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ కేటాయించిన 75వేల ఎకరాలు 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండగా, ఇందులో అభ్యంతరాలు లేని 66,157 ఎకరాలను ఆ జాబితా నుంచి తక్షణమే తొలగించడానికి గ్రీన్‌సిగ్నల్‌. పరిశ్రమల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 3,803 ఎకరాలను కూడా జాబితా నుంచి తొలగించనున్నారు.

  • 51,603 ఎకరాల ప్రభుత్వ, ఇతర భూములను ఏపీఐఐసీ పేరు మీదకు మార్చేందుకు ఏకకాల అనుమతి.

  • అమరావతిలో రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవన సముదాయాల్లో ఎలక్ర్టికల్‌, ఫైర్‌ ప్రొటెక్షన్‌, లిఫ్టులు, ప్లంబింగ్‌ పనులకు రూ.2,316.88 కోట్లకు పరిపాలనా అనుమతులు.

  • సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయానికి 0.8ఎకరాలు, ఏపీఎ్‌సఐఆర్టీ అండ్‌ పీఆర్‌ ఎడ్యుకేషనల్‌ క్యాంప్‌సకు 5 ఎకరాలు, నిడమర్రులో ’కిమ్స్‌’ వైద్యశాల, ఆదిత్య విద్యాసంస్థలకు గతంలో ఇచ్చిన భూ కేటాయింపుల్లో మార్పులతో పాటు రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన స్థలానికి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీకి 3 ఎకరాలు ఇవ్వాలనినిర్ణయం.

  • పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌వర్క్స్‌ ప్యాకేజీ నం.62లో అదనపు గ్రానైట్‌ కొనుగోలు, లైనింగ్‌ పనులకు రూ.23.47కోట్లు కేటాయింపు. ప్యాకేజీ నం.64 పనులకు రూ.24.51కోట్ల మంజూరుకు అనుమతి.

  • తుని ఇరిగేషన్‌ సర్కిల్‌లో పోలవరం కాలువ పనులకు సంబంధించి ఎస్‌ఈ తీసుకున్న చర్యలకు ఆమోదం.

  • ఎలక్ర్టిసిటీ యాక్ట్‌-2003లోని సెక్షన్‌-11 కింద ల్యాంకో కొండపల్లి పవర్‌ లిమిటెడ్‌ వైస్‌చైర్మన్‌కు నోటీసు జారీకి నిర్ణయం.


పలు సంస్థలకు భూ కేటాయింపులు

  • ఎన్టీఆర్‌ జిల్లా రాఘవాపురంలో రూ.3.75 కోట్ల విలువైన ఐదెకరాలు, ఏలూరు జిల్లా నూజివీడులో రూ.14కోట్ల విలువైన ఏడెకరాలు, శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురంలో రూ.31.94 కోట్ల విలువైన ఐదెకరాల భూములను కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉచితంగా కేటాయింపు.

  • చిత్తూరు జిల్లా చౌడెపల్లె, దిగువపల్లెలో 20.62 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక మౌలిక సదుపాయాల కోసం ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.

  • నెల్లూరు జిల్లా పంగిలిలో 82.40 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిహార వనీకరణ కింద అటవీ శాఖకు బదిలీకి ఆమోదం. నెల్లూరు రూరల్‌లో రూ.4.64కోట్ల విలువైన భూమిని ఈఎ్‌సఐసీ ఆస్పత్రి నిర్మాణానికి ఉచితంగా ఇచ్చేందుకు ఆమోదం.

  • నెల్లూరు జిల్లా బ్రహ్మదేవంలో రూ.27.95 లక్షల విలువైన 0.86 ఎకరాల భూమిని ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ సీఎ్‌సఆర్‌ హాస్పటల్‌ స్థాపనకు ఇవ్వాలని నిర్ణయం.

  • కడప జిల్లా జమ్మలమడక మండలంలోని ఐదు గ్రామాల్లో 424.45 ఎకరాలను జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపన కోసం ఏపీఐఐసీకి రూ.21.30 కోట్ల చెల్లింపుపై కేటాయింపు.

  • హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌కు తిరుపతి జిల్లా కాశిపెంటలో మిల్క్‌ ప్రొసెసింగ్‌ యూనిట్‌ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ కోసం ప్రత్యేక ప్రోత్సాహాలు మంజూరు చేయడానికి సంబంధించిన కొరిజెండమ్‌కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనివల్ల రూ.209.68కోట్ల పెట్టుబడితో ఉపాధి కల్పన జరగనుంది.


డిజిటల్‌ మీడియాపై సీఎంతో చర్చిస్తా

డిజిటల్‌ మీడియా పాలసీ తెచ్చే అంశంపై సీఎంతో చర్చిస్తానని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా డిజిటల్‌ మీడీయాను ప్రోత్సహిస్తామన్నారు.

ఏప్రిల్‌ 1 నుంచి ‘జలధార’

రాష్ట్రంలో జలధార కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 1నుంచి 90 రోజుల పాటు అమలు చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చివరి భూములకు కూడా నీళ్లు వెళ్లేలా కాలువలన్నీ బాగు చేయాలని సీఎం ఆదేశించారు. మే, జూన్‌ నెలల్లో హడావుడి పడకుండా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులన్నీ మే 15లోగా పూర్తిచేయాలని సూచించారు. మే 15 నాటికి రైతులకు సాగునీరు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి సమన్వయంతో తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులకు సీఎం సూచించారు’ అని మంత్రి వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు పార్థసారథి తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 05:32 AM