Share News

నేతన్నల సేవలో!

ABN , Publish Date - Jul 24 , 2026 | 04:24 AM

రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త. ‘నేతన్నల సేవలో..’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో నేతన్నకు ఏటా రూ.25 వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయించింది.

నేతన్నల సేవలో!

  • చేనేత కార్మికుల కోసం కొత్త పథకం

  • ఒక్కొక్కరికి ఏటా రూ.25 వేలు

  • రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

  • వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేదు

  • 51,952 మందికి ప్రయోజనం

  • నేరడి బ్యారేజ్‌, అనుబంధ పనులకు

  • రూ.641.10 కోట్లు

  • గోదావరి పుష్కరాల భద్రతకు 50 కోట్లు

  • మార్క్‌ఫెడ్‌కు 300 కోట్ల రుణానికి హామీ

  • పలు సంస్థలకు భూకేటాయింపులు

  • క్యాబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త. ‘నేతన్నల సేవలో..’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో నేతన్నకు ఏటా రూ.25 వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో నిమిత్తం లేకుండా, వారివద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా ’నేతన్నల సేవలో’ పథకాన్ని అమలు చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిద్వారా క్రియాశీలంగా ఉన్న చేనేత కార్మికులందరికీ రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలుకు, పరికరాల ఆధునికీకరణకు ఏటా రూ.25 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు ఏటా రూ.129.88 కోట్లు ఖర్చవుతుందని.. రాష్ట్రవ్యాప్తంగా 51,952 మంది చేనేత కార్మికులు లబ్ది పొందుతారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. క్యాబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.

మరికొన్ని నిర్ణయాలు..

  • బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో బధిర విద్యార్థుల కోసం 2026-27 విద్యాసంవత్సరం నుంచి బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌(మేజర్‌), ఏఐ సర్టిఫికేషన్‌ కోర్సులతో పాటు 30 మంది విద్యార్థుల ప్రవేశ సామర్థ్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల.

  • 2027లో విజయవంతంగా గోదావరి పుష్కరాల నిర్వహణకు భద్రత, పోలీసు బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల మంజూరు.


  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.300 కోట్లు టర్మ్‌ లోన్‌గా పొందేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ.

  • శ్రీకాకుళంలోని 333.3 చ.గజాల మున్సిపల్‌ ఖాళీస్థలంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయవిశ్వవిద్యాలయానికి లీజు కొనసాగింపు.

  • భీమవరం విష్ణు ఉమెన్స్‌ యూనివర్సిటీ, గుంటూరు సమీపంలోని లాంలో చలపతి యూనివర్సిటీ పేర్లను చేరుస్తూ.. ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ చట్టంలో సవరణలకు, ఆర్డినెన్స్‌ జారీ ద్వారా ఈ రెండు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతి.

  • శ్రీసత్యసాయి జిల్లాలో హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్‌-2 కింద మిగిలిన పనులు, ప్రధాన కాలువకు 360-400, 400-500 కిలోమీటర్ల వరకు సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులకు రూ.312 కోట్లతో పరిపాలనా ఆమోదం.

  • విశాఖ రూరల్‌ ఎండాడలో 2.16 ఎకరాల ప్రభుత్వ భూమిని.. ఎకరా రూ.5 కోట్ల చొప్పున.. నర్సింగ్‌ కళాశాల, అలైడ్‌ హెల్త్‌కేర్‌ సైన్సెస్‌ కళాశాల, నర్సులు, విద్యార్థులు, సిబ్బంది కోసం హాస్టళ్లతో పాటు తక్కువ ఖర్చుతో రోగులకు వసతి ఏర్పాటుకు హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్స్‌ చైర్మన్‌కు దఖలుపరిచేందుకు ఆమోదం.

  • విజయవాడ రూరల్‌ జక్కంపూడిలోని జెట్‌ సిటీ ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ టవర్‌-1లోని స్థలాన్ని తొలుత ఏఎల్‌ఈఏపీ తదితర సంస్థలకు కేటాయించగా.. మిగిలిన టవర్లను పీపీపీ విధానం లేదా ఏదైనా కేంద్ర పథకాన్ని వినియోగించుకుని పూర్తి చేసేందుకు ఏపీఐఐసీకి ఆదేశాలు.

  • తిరుపతి జిల్లా పానగల్‌ గ్రామంలోని 35ఎకరాల ప్రభుత్వ భూమి, భవనాలతో కూడిన శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రాంగణాన్ని, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున అనంతపురంలోని జేఎన్‌టీయూకి దీర్ఘకాలిక లీజుకు అప్పగించేందుకు కుదుర్చుకున్న ఒప్పందానికి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ చార్జీల నుంచి పూర్తి స్థాయి మినహాయింపు.

Updated Date - Jul 24 , 2026 | 04:26 AM