రాష్ట్రంలో ‘ఏఐ లివింగ్ ల్యాబ్స్’
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:17 AM
రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకురావడానికి ‘‘ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్’’ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం జరిగింది.
ప్రతి కుటుంబంలో ఒకరికి కృత్రిమ మేధలో శిక్షణ
ఉపాధ్యాయులకు ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్
తిరుపతిలో రాష్ట్ర డేటా సెంటర్‌కు ‘డిజాస్టర్ రికవరీ సెంటర్’ ఏర్పాటు
గృహాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ గడువు జూన్ 30 వరకూ పొడిగింపు
నీటి వనరుల నిర్వహణకు రూ.344 కోట్లు
పలు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులకు ఆమోదం
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకురావడానికి ‘‘ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్’’ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 20 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రాజెక్టు నిర్వహణ కోసం అమరావతి కేంద్రంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని కంపెనీ ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇందుకోసం మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ ఆండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను రూపొందించడానికి, ఎన్వీడీయాతో అవగాహనా ఒప్పందాన్ని సవరించడానికి సమ్మతి తెలిపింది. విద్యార్థులు విద్యా అవసరాల కోసం ఏఐ హార్డ్‌వేర్ సేకరణకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు దీని నుంచి ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్ అందించడానికి, ఏఐ శిక్షణ వ్యవస్థ అభివృద్ధిలో ఇతరతా మద్దతు అందించడానికి కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా ఏఐ శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థకు వచ్చే లాభాలను తిరిగి ఏఐ అభివృద్ధి, పరిశోధనల కోసమే వినియోగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్‌కు డిజాస్టర్ రికవరీ సెంటర్‌ను తిరుపతిలో ఐఐడీటీ క్యాంప్‌సలో ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ మోడల్లో అమలు చేస్తారు.
మరిన్ని నిర్ణయాలు..
2025-26లో భారీ, మధ్య, చిన్న తరహా నీటి వనరుల నిర్వహణకు రూ.344 కోట్లతో 7,189 పనులు చేపట్టడానికి పరిపాలనా అనుమతులు.
2025 నాటి ఆర్డినెన్స్ నంబర్ 10 స్థానంలో ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు సవరణ బిల్లు-2026 ముసాయిదాకు ఆమోదం.
విశాఖపట్నం జిల్లా గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణ లేదా నిర్మాణాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ గడువు జూన్ 30 వరకూ పొడిగింపు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో గృహాల క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దరఖాస్తుల సమర్పణ గడువు జూన్ 30 వరకూ పొడిగింపు.
ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో 45.60 ఎకరాలు ఏపీ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు కేటాయింపు.
నంద్యాల జిల్లా నొస్సం గ్రామంలో 1,500 ఎకరాల భూమిని 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు 30 ఏళ్లు లీజుగా ఇవ్వాలని నిర్ణయం. లీజు ధర ఏడాదికి ఎకరాకు రూ.31 వేలు.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో 18.57 ఎకరాల ప్రభుత్వ భూమి రాష్ట్ర సేవా సమితికి బదిలీ.
ఆర్డినెన్స్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాల బిల్లు-2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం.
అమరావతితో సుమారు ఎకరా నదీతీర భూమిపై పీపీపీ విధానంలో అమరావతి మెరీనా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు ఆమోదం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకంలో ప్రతి గృహ యూనిట్ విలువ రూ.2,39,000గా నిర్ణయం. ప్రతి యూనిట్ వ్యయంలో కేంద్రం వాటా రూ.95,400, రాష్ట్రం వాటా రూ.63,600 కాగా.. మిగిలిన మొత్తం డ్వాక్రా రుణాలు, కన్వర్జెన్స్ పథకం ద్వారా సమకూరుస్తారు. ఇందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని ద్వారా రూ.27,000, వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తుంది.
రామాయపట్నం పోర్ట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఉన్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాన్ని సాగర్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రీఫైనాన్స్ చేయడానికి ఆమోదం.
గత ఏడాది జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026 ముసాయిదాకు ఆమోదం.
ఏపీ జెన్కో-ఎన్‌హెచ్‌పీసీ జాయింట్ వెంచర్ పరిధి నుంచి యాగంటి పీఎ్‌సపీ, రాజుపాలెం పీఎ్‌సపీలకు మినహాయింపు. వీటిని జెన్కో స్వతంత్రంగా చేపట్టడానికి ఆమోదం.
జీవిత ఖైదీ (నంబర్ 9709) పి.లియాఖత్ అలీఖాన్‌కు శిక్ష తగ్గింపునకు అంగీకారం.
ఆర్డినెన్స్ 9 స్థానంలో అగ్నిమాపక సేవల చట్టం-1999లో సవరణలు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం.
పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన పథకం కోసం రూ.10.37 కోట్లతో డీపీఆర్ తయారీ ప్రతిపాదనకు ఆమోదం.