బడ్జెట్ హామీలు నెరవేర్చాల్సిందే
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:29 AM
బడ్జెట్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధుల కొరత అడ్డంకి కాకూడదని ఆర్థిక శాఖకు స్పష్టం చేశారు.
ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండకూడదు
ఆదాయ వనరులు పెంచుకోండి.. ఆర్థిక శాఖకు సీఎం దిశానిర్దేశం
ప్రజలకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ లక్ష్యాలు చేరుకోవాలి
అమరావతి, పోలవరం సహా ప్రాజెక్టులు పూర్తయితే సంపద సృష్టి
కేంద్ర పథకాల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయాలి: సీఎం
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): బడ్జెట్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధుల కొరత అడ్డంకి కాకూడదని ఆర్థిక శాఖకు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా హామీలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి నిధుల రూపంలో అందే సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని.. పీపీపీ విధానంలో చేయదగిన ప్రాజెక్టులను గుర్తించాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా సూక్ష్మ, స్థూల ప్రణాళికలు అమలు చేయాలని.. పూర్తిస్థాయి ఉత్పాదకతను చేరుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యాన్ని అందుకునేలా క్షేత్రస్థాయి వరకూ ఈ ప్రణాళికలను సమర్థంగా అమలుచేయాలన్నారు. నీరు, విద్యుత్ లాంటి వనరులను వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైనంత మేర అందిస్తున్నామని.. ఈ నేపథ్యంలో ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులున్నా విద్యుత్ చార్జీలు పెంచలేదని.. గత పాలకుల నిర్ణయాల కారణంగా తలెత్తిన రూ.4,600 కోట్ల విద్యుత్ భారాన్ని కూడా కూటమి ప్రభుత్వమే భరిస్తోందని గుర్తుచేశారు. ప్రజలపై భారం లేకుండా ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు పూర్తయితే సంపద సృష్టికి అవకాశాలు ఏర్పడతాయన్నారు.
సింగపూర్ పాలనా సంస్కరణలను అధ్యయనం చేయండి
మంత్రులకు సీఎం దిశానిర్దేశం
‘సింగపూర్ చిన్న దేశమైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది.. అక్కడ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండడం.. అవినీతి రహితంగా ఉండడం, పాలనా సంస్కరణలు, అపారమైన మేధోశక్తి ఈ రోజు ఆ దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతస్థానంలో నిలబెట్టాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు 9 మంది మంత్రుల బృందం సింగపూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం సచివాలయంలో ఆయన వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైసీపీ హయాంలో సింగపూర్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగా వెళ్తున్న మీరంతా.. అక్కడి పాలనా సంస్కరణలు, పాలనలో వేగం, పారదర్శకతను పెంచేందుకు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. ‘2019లో మనమే అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లేది. జగన్ రావడంతో ఆర్థిక విధ్వంసంతోపాటు పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకుడితో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది’ అని ధ్వజమెత్తారు. జగన్ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం మనతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. ఏపీకి రావలసిన సింగపూర్ కంపెనీలు మలేసియాలో టౌన్‌షి్‌పలను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని, పి.నారాయణ, నిమ్మల, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్ పాల్గొన్నారు.