ఇది భవిష్య దర్శిని
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:55 AM
‘‘ఈరోజు మనం ఎంచుకున్న మార్గాలే, రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ స్ఫూర్తికి ఈ బడ్జెట్ అద్దం పడుతుంది. ఇది కేవలం మన రాష్ర్టాన్ని రేపటి కోసం సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది మాత్రమే కాదు.
దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు దార్శనిక పత్రం
గత ప్రభుత్వంలో విధ్వంసం.. ఇప్పుడు వికాసం
పెట్టుబడిదారులను తిరిగి రప్పిస్తున్నాం
గ్రోత్ ఇంజన్లుగా విశాఖ, అమరావతి, తిరుపతి
ఉత్తరాంధ్రకు 28 వేల కోట్లు.. సీమకు 30 వేల కోట్లు
ఇకపై రాయలసీమ అంటే కొరత కాదు.. మిగులు
బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ వెల్లడి
50 పేజీలు.. గంటా 13 నిమిషాల ప్రసంగం
‘‘గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి రాష్ర్టాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ పునాది వేసింది. అంతటి విధ్వంసానికి గురైన రాష్ర్టాన్ని పునర్నిర్మించడానికి రెండేళ్లు చాలా తక్కువ సమయం. రాష్ట్ర విభజన రాష్ర్టానికి మొదటి దెబ్బ అయితే, వైసీపీ పాలన మరో పెద్ద షాక్. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం 20 నెలల్లో అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావడం బడ్జెట్ ఉద్దేశం.’’
- ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈరోజు మనం ఎంచుకున్న మార్గాలే, రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ స్ఫూర్తికి ఈ బడ్జెట్ అద్దం పడుతుంది. ఇది కేవలం మన రాష్ర్టాన్ని రేపటి కోసం సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది మాత్రమే కాదు. భవిష్యదర్శిని. కేవలం వృద్ధి లెక్కలు చెప్పేది మాత్రమే కాకుండా, భావి ఆర్థిక గమనాన్ని, లక్ష్యాన్ని బలంగా చాటిచెబుతుంది’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ బడ్జెట్‌ను తాత్కాలిక ఉపశమనం కలిగించేదిగా కాకుండా, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన దార్శనిక పత్రంగా ఆయన అభివర్ణించారు. 2026-27 వార్షిక బడ్జెట్‌ను శనివారం శాసనసభలో పయ్యావుల ప్రవేశపెట్టారు. శాఖల వారీగా కేటాయింపులను తన ప్రసంగంలో వివరించారు.
విధ్వంసం నుంచి వికాశం దిశగా..
‘‘కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. 2019-24 మధ్య 10.3 శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటును 11.75 శాతానికి పెంచాం. డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుచేయాలన్న గూగుల్ నిర్ణయంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఏపీవైపు చూసింది. రాష్ర్టానికి పెట్టుబడులు వస్తూ, ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందంటే దానికి సీఎం చంద్రబాబు దార్శనిక పాలన, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విశ్వసనీయ భాగస్వామ్యమే కారణం. దేశ జనాభాలో 4.2 శాతంగా ఉన్న ఏపీ...పెట్టుబడుల సాధనలో మిగిలిన రాష్ర్టాలను వెనక్కి నెట్టింది. కేంద్ర బడ్జెట్ ఆశాకిరణంగా మారింది. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, విద్యుత్ బస్సుల కొనుగోలుకు ‘పూర్వోదయ’ ఉపయోగపడుతుంది.’’
ఆ మూడు రీజియన్లూ గ్రోత్ ఇంజన్లు
‘‘విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజియన్లను గ్రోత్ ఇంజన్లుగా ప్రభుత్వం గుర్తించింది. విశాఖ ఎకనమిక్ రీజియన్‌కు (వీఈఆర్) మాస్టర్ ప్లాన్ తయారుచేశాం. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా వీఈఆర్‌కు రూ.28వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఈ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి చేస్తాం. రాయలసీమ రీజియన్‌ను గ్లోబర్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. రాయలసీమ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశాం. 2030 నాటికి ఉద్యాన పంటలను 14.41 లక్షల హెక్టార్లకు పెంచుతాం. దీనివల్ల లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో 9 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇకపై రాయలసీమ పేరు చెబితే ‘మిగులు’ అన్న మాట తప్ప, కొరత అనే మాట వినబడదు. ఈ ప్రాజెక్టుకు రూ.30వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం.’’
జల వనరులతో కరువు రహితం: ‘‘సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యమిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో రూ.5వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించి, పనులు వేగవంతం చేశాం. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.86 లక్షల కుటుంబాలకు రూ.20వేలు చొప్పున అందించాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో ధరల స్థిరీకరణ నిధికి 880 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మేం ఒక్క ఏడాదిలోనే రూ.1,200 కోట్లపైగా ఖర్చు చేశాం. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేశాం.’’
ఆర్థిక క్రమశిక్షణ చర్యలు
‘‘గత ప్రభుత్వం 12.3శాతం వడ్డీ రేటుతో అప్పులు చేసింది. దానిని 9ు లోపునకు తెచ్చేందుకు చర్యలుచేపడుతున్నాం. ఇప్పటివరకూ రూ.43,298 కోట్ల రుణాలకు వడ్డీ తగ్గించి, రూ.327కోట్లు ఆదా చేశాం. మరో రూ.1.2లక్షల కోట్లపై చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా 1658 కోట్లు ఆదా అవుతాయని అంచనా. 2024 జూన్ 12నాటికి పెండింగ్‌లో ఉన్న రూ.24,811కోట్ల బకాయిలు చెల్లించాం. ఏపీ వెల్త్ ఫండ్‌ను 100కోట్ల సీడ్ కార్ప్‌సతో ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తున్నాం. ‘బ్రాండ్‌ఆంధ్ర’ను పునరుద్ధరించాం. జూన్ 2024 నుంచి 9.68 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఆమోదించడంతో, 5.41 లక్షల ఉద్యోగావకాశాల సృష్టికి మార్గం ఏర్పడింది. దేశంలో అతిపెద్ద ఎఫ్‌డీఐని ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 15 బిలియర్ డాలర్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నాం. ఐటీ మంత్రి లోకేశ్ ‘బ్రాండ్ చంద్రబాబు’ను సమర్థంగా ఉపయోగించి ఈ చారిత్రక ఒప్పందాన్ని సాధించారు. ఆయనను ‘ఏపీ చీఫ్ జాబ్ క్రియేటర్’గా పిలవడం సముచితం. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లకు 19 నెలల్లో రూ.58 వేల కోట్లు వెచ్చించాం. ఆర్థిక ఒత్తిడి ఉన్నా సూపర్ సిక్స్ అమలుచేస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తున్నాం. 1,100 కోట్ల డీఏ, డీఆర్ బకాయిలు విడుదల చేశాం. వివిధ కేటగిరీల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.
ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలుస్తూ, ఒకేరోజు రికార్డుస్థాయిలో రూ.9,740 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. దీపం 2.0 కింద మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తూ... 2897 కోట్లు వారి ఖాతాల్లో జమచేశాం. గత ప్రభుత్వం 6,486 కోట్లు ఆరోగ్య రంగంలో బకాయిలు పెట్టింది. వీటిలో చాలా వరకు చెల్లించాం. పౌరుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రాజెక్టు సంజీవిని చేపట్టాం. ఈ ఏడాది రూ.11వేల కోట్ల విద్యుత్ రాయితీని విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 11 నగరాల్లో 750 ఎలక్ర్టిక్ బస్సులు ప్రవేశపెడతాం. స్ర్తీశక్తి కింద మహిళా ప్రయాణికులు లబ్ధి పొందుతున్నారు. గోదావరి పుష్కరాలకు రూ.60 కోట్లు కేటాయిస్తున్నాం.’’
అమరావతికి చట్టబద్ధత
‘‘అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజధానిలో రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం. ఇది ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే మా నిబద్ధతకు నిదర్శనం. 2027 నాటికి అమృత్ 2.0 కింద 117 యూడీఏల్లోని 506 ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. విశాఖపట్నం, విజయవాడల్లో ఆధునిక మెట్రో రైలులో ప్రయాణించే కల త్వరలో సాకారమవుతుంది. పీఎం ఆవాస్ యోజన- ఎన్టీఆర్ నగర్స్‌లో పేదలకు 25 లక్షల ఇళ్లను అందించడం లక్ష్యం. పోలీసు శాఖకు 3వేల కొత్త వాహనాలు త్వరలో అందిస్తాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. కొత్త పోలీసు అకాడమీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నాం. మహిళల భద్రత కోసం ‘శక్తి యాప్’ను ప్రారంభించాం. ఏడు నిమిషాల్లోనే స్పందించి, చర్యలు తీసుకుంటున్నాం. కొత్త ఎక్సైజ్ విధానంతో మద్యంలో లీకేజీలను అరికట్టాం. అగ్నిమాపక సేవల కోసం 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలు స్థాపిస్తున్నాం.’’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
మీ అప్పులు మేం తీరుస్తున్నాం
‘‘అప్పుల గురించి మాట్లాడుతున్న మిత్రులకు ( వైసీపీ నేతలను ఉద్దేశించి) ఒక విషయం గుర్తు చేస్తున్నా. రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారు. మీరు చేసిన అప్పులు తీర్చడానికి మేం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. నేడు మేం చేస్తున్న అప్పులోని ప్రతి రూపాయి కూడా ఉత్పాదక వ్యయంలోకే వెళ్తుంది. సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నుంచి సమర్థ పాలన దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది.’’