Share News

జీఎస్టీ ద్వారా 17,603 కోట్ల రాబడి

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:39 AM

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయార్జన పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు రూ. 17,603 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేసింది.

జీఎస్టీ ద్వారా  17,603 కోట్ల రాబడి

  • ఐజీఎస్టీ నుంచి 18,893 కోట్లు

  • రిజిస్ర్టేషన్లు, ఎక్సైజ్‌ నుంచి భారీగా ఆదాయం

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయార్జన పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు రూ. 17,603 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. గత బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయానికి రూ. 15,889.37 కోట్లు జీఎస్టీ వసూలవుతుందని భావిస్తున్నారు. 2024-25లో రూ. 15,210 కోట్లు జీఎస్టీ వసూలైంది. ఇక 2026-27లో ఐజీఎస్టీ రూ. 18,893.64 కోట్లుగా అంచనా వేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.16,755 కోట్లు వస్తుందని భావిస్తున్నారు. స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ఆదాయం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 18,701.35 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రూ. 11,024.60 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. 2024-25లో రిజిస్ర్టేషన్ల శాఖకు రూ. 8,837 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాఖ నుంచి రూ. 30,066 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. 2025-26 ముగిసే నాటికి రూ. 23,648 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. అమ్మకాలు, వాణిజ్య పన్నుల ద్వారా రూ. 24,125 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనాలు వేయగా, 2025-26లో రూ. 18,006 కోట్లు వచ్చాయి. ఇక విద్యుత్‌ పన్నుల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 512 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.


మైనార్టీల సంక్షేమానికి రూ.6,090 కోట్లు

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి రూ.6,090 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో రూ.5,434 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది 6,090 కోట్లు కేటాయించింది. గత ఏడాది కన్నా రూ.656 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. మైనార్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఇతర శాఖల ద్వారా మైనార్టీలు లబ్ధి పొందేందుకు వీలుగా సబ్‌ప్లాన్‌కు రూ.3,133 కోట్లు కేటాయించిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇలా...

ప్రస్తుత బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రధానమంత్రి జన్‌ వికాస్‌ కార్యక్రమం కింద రూ.300 కోట్లు, స్వయం ఉపాధి, ఆర్థిక భరోసాకు రూ.183 కోట్లు, క్రిస్టియన్‌ మైనార్టీల స్వయం ఉపాధి, ఆర్థిక భరోసాకు రూ.21 కోట్లు, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతి గృహాల భవన నిర్మాణాలకు రూ.20 కోట్లు, హజ్‌ యాత్రికులకు రూ.లక్ష చొప్పున, ఇతరత్రా హజ్‌ యాత్ర నిర్వహణ కోసం హజ్‌ కమిటీకి రూ.6.97 కోట్లు, వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇచ్చేందుకు సీఈడీయంకు రూ.3.97 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.7.83 కోట్లు, ఉర్దూ ఘర్‌ కమ్‌ షాదీఖానాల నిర్మాణానికి రూ.2.85 కోట్లు, ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాలకు రూ.90 కోట్లు కేటాయించారు.

Updated Date - Feb 15 , 2026 | 04:39 AM