బడ్జెట్ బారెడు.. లోటు బోలెడు!
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:56 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇది 9 నెలలకే రూ.60,480 కోట్ల లోటుతో కనాకష్టంగా సాగుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.13 లక్షల కోట్ల లోటు
అప్పులతో కలిపి ఖజానాకు వచ్చేది 2.6 లక్షల కోట్లు
బడ్జెట్‌లో ఖర్చు మాత్రం 3.23 లక్షల కోట్లు
లోటు అంచనా రూ.33,186 కోట్లు
అయితే 9 నెలల్లోనే 69 వేల కోట్లు
అప్పుల కోసం జీఎ్‌సడీపీని ఎక్కువగా చూపుతున్న సర్కార్లు
లేని ఆదాయం పేపర్లపై సృష్టి
భారీ లోటుతో అట్టహాసంగా జంబో బడ్జెట్లు
2017-18 నుంచీ ఇదే ట్రెండ్
కార్పొరేషన్ల మాటున ఆఫ్ బడ్జెట్ అప్పులు
అవి కట్టాల్సిన అప్పులు, వడ్డీలూ చూపరు
కొండలా పేరుకుపోతున్న పెండింగ్ బిల్లులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇది 9 నెలలకే రూ.60,480 కోట్ల లోటుతో కనాకష్టంగా సాగుతోంది. బడ్జెట్లో మాత్రం రెవెన్యూ లోటును రూ.33,186 కోట్లుగా మాత్రమే అంచనా వేశారు. అప్పుల కోసం జీఎ్‌సడీపీని ఎక్కువ చేసి చూపించుకోవడం.. రాజకీయ కారణాలతో లేని ఆదాయాన్ని పేపర్లపై సృష్టించి రూ.లక్షల కోట్ల లోటుతో అట్టహాసంగా జంబో బడ్జెట్లను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. 2017-18 నుంచీ ఈ ట్రెండ్ నడుస్తోంది. అలాగే ప్రతి ఏడాది ఫిబ్రవరిలోనో, మార్చిలోనో ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కానీ ఏప్రిల్ రెండో వారం నుంచే ఆర్థిక శాఖ అదనపు నిధులు మంజూరు చేస్తోంది. అంటే వాస్తవాలతో సంబంధం లేకుండా బడ్జెట్లు ఉంటున్నాయన్న మాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3.23 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే.. ఏప్రిల్ రెండో వారం నుంచి జనవరి నాటికే రూ.50,000 కోట్ల అదనపు కేటాయింపులు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంత ఆదాయం రూ.1.80 లక్షల కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. అప్పుల ద్వారా రూ.80,000 కోట్లు తెస్తారు. మొత్తం చేతిలో ఉండే డబ్బు రూ.2.60 లక్షల కోట్లు. బడ్జెట్ మాత్రం రూ.3.23 లక్షల కోట్లు, అదనంగా మంజూరు చేసిన రూ.50,000 కోట్లు కలిపితే రూ.3.73 లక్షల కోట్లు. ఆదాయానికి, బడ్జెట్‌లో వ్యయానికి మధ్య వ్యత్యాసం రూ.1.13 లక్షల కోట్లు. మరి వీటిని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందంటారా..? చెల్లించదు.. వాయిదాలు వేస్తూ ఉంటుంది. అసలా బిల్లులను చెల్లింపుల సిస్టమ్‌లోకేరానివ్వరు. ఫిబ్రవరి నుంచే సీఎ్‌ఫఎంఎ్‌సలోకి బిల్లులు తీసుకోరు. మార్చి 31న చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న బిల్లులన్నింటినీ రద్దు చేస్తారు. బాధితులు అడిగితే.. వచ్చే ఏడాది బడ్జెట్ ఉంటే మళ్లీ పెట్టుకోండని సలహా ఇస్తారు. కొందరు ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, పర్సంటేజీలు ఇచ్చుకునే వాళ్లకు బిల్లుల చెల్లింపులు జరిగిపోతుంటాయి. వీరెవరూ పర్సంటేజీలనను సొంత జేబుల్లో నుంచి ఇవ్వరు. రూ.10కి చేసే పనిని రూ.12కి చేస్తారు. పలుకుబడి లేని వారు, పర్సంటేజీలు ఇవ్వలేని వారు ఆర్థిక శాఖ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు.
9 నెలల్లో 40 వేల కోట్ల ఆఫ్ బడ్జెట్ అప్పులు
కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని తెచ్చే ఆఫ్ బడ్జెట్ అప్పులను బడ్జెట్లో చూపించరు. అలాగే కార్పొరేషన్లు కట్టాల్సిన అప్పులు, వడ్డీలను కూడా చూపించరు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి రూ.40,000 కోట్ల పైచిలుకు ఆఫ్ బడ్జెట్ అప్పులు తెచ్చారు. ఆ అప్పులతో గతంలో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు, వాటి వడ్డీలను చెల్లిస్తున్నారు. ఒకటో అరో మిగిలితే ఏదో సంక్షేమ పథకానికి వాడుతున్నారు. వైసీపీ హయాంలో చివరి నాలుగేళ్లు, కూటమి హయాంలో ఏడాదిన్నరగా జరుగుతున్న ఆర్థిక గందరగోళం ఇదే.
ఆదిలోనే అదనపు బడ్జెట్..
గతంలో ప్రతి 3నెలలకోసారి ఎంత ఆదాయం వస్తుందో చూసుకుని.. అందుకు అనుగుణంగా వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయించేవారు. ఇలా 3 నెలలకొకసారి ఆర్థిక శాఖ అనుమతి తెచ్చుకోవడానికి సమయం వృథా అయి.. ప్రాజెక్టులు, ఇతర పనుల వేగం తగ్గిపోతుందని భావించి.. మొత్తం బడ్జెట్‌కు 12 నెలలకు కలిపి ఒకేసారి అనుమతి ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పట్లో బడ్జెట్ అంచనాలకు, రాష్ట్ర ఆదాయానికి పెద్దగా వ్యత్యాసం ఉండేది కాదు. దాంతో ఆ పద్ధతి మంచి ఫలితాలే ఇచ్చింది. రాను రానూబడ్జెట్ అంచనాలకు, రాష్ట్ర ఆదాయానికి వ్యత్యాసం పెరుగుతుండడంతో బిల్లులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. మళ్లీ పాత విధానం ప్రకారం 3 నెలలకొకసారి వస్తున్న ఆదాయం ప్రకారమే బడ్జెట్ అనుమతులు ఇస్తే కొండలా పెరుగుతున్న పెండింగ్ బిల్లుల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆదాయం తగ్గితే ఆ మేరకు అనుమతులు నిలిపివేస్తే రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుంది. సాధారణంగా మొదటి త్రైమాసికంలో పెద్దగా ఆదాయం రాదు. అయినప్పటికీ ఏడాది బడ్జెట్ మొత్తాన్నీ మొదటి త్రైమాసికంలోనే ఖర్చు పెట్టుకోండంటూ ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చేస్తోంది.