Share News

క్వాంటమ్‌ వ్యాలీలో క్యూఏఐజీ పరిశోధన కేంద్రం

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:24 AM

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధనలకుగాను క్యూఏఐజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

క్వాంటమ్‌ వ్యాలీలో క్యూఏఐజీ పరిశోధన కేంద్రం

  • రెండున్నర ఎకరాల భూమి, కార్యాలయం కేటాయింపు

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధనలకుగాను క్యూఏఐజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2025-30 క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ప్రోత్సాహక మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రతిపాదనలకు అమోదం తెలుపుతూ ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు. దీనిపై రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సీఈవో తదుపరి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్సుడ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌) అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో రూ.17 కోట్లతో ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామంటూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ఐటీ శాఖ ఆమోదించింది. ఈ హబ్‌కు 7900 చదరపు అడుగుల కార్యాలయ స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదించింది.

అదాని ఏఐ సెంటర్‌కు ప్రోత్సాహకాలు

అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో రూ.87,520 కోట్లతో 1000 మెగావాట్ల ఇంధన సామర్థ్యంలో అదానీ ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు ఐటీశాఖ ఆమోదం తెలిపింది. ఈ నెల 7న స్టీరింగ్‌ కమిటీ సిఫారసుల మేరకు అదానీ ఏఐ సెంటర్‌కు 480 ఎకరాల భూమిని అదానీ ఎస్పీవీ కింద ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం కాపులుప్పాడలో రూ.626.9 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐస్ర్పౌట్‌కు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ కింద 9.5 ఎకరాలను కేటాయిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఐస్ర్పౌట్‌ కాపులుప్పాడలో ఐటీ కంపెనీని స్థాపించడం ద్వారా 2000 మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో రూ.1305 కోట్లతో పీ అండ్‌ జీ టెక్నాలజీస్‌ సంస్థను స్థాపించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, వాషింగ్‌ మెషిన్ల తయారీ సంస్థ ఏర్పాటుతో 2910 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు 105 ఎకరాల కేటాయింపు

చిత్తూరు జిల్లాలో ఎన్‌పీఎస్‌పీఎల్‌కు 105 ఎకరాలు కేటాయిస్తూ ఐటీశాఖ ఉత్తర్వు జారీ చేసింది. రూ.2550 కోట్లతో కేథోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో 400మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

Updated Date - Apr 18 , 2026 | 03:44 AM