ప్రభుత్వ అంధుల, బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశాలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:10 AM
ప్రభుత్వ అంధుల, బధిరుల ఆశ్రమ పాఠశాలలు, బధిరుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అర్హతగల అంధ, బధిరుల బాల బాలికల ప్రవేశాలకు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ దరఖాస్తులను..
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అంధుల, బధిరుల ఆశ్రమ పాఠశాలలు, బధిరుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అర్హతగల అంధ, బధిరుల బాల బాలికల ప్రవేశాలకు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈమేరకు ఆ శాఖ సంచాలకులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక అవసరాలు గలిగిన విద్యార్థులకు 1 నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వం ప్రత్యేక ఉపాధ్యాయులతో ప్రత్యేక బోధనను ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 3 అంధుల, 3 బధిరుల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రవేశాల కోసం ఆయా పాఠశాలల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసే విద్యార్థి వయస్సు ఐదేళ్లు పైబడి ఉండాలన్నారు. ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, 3 పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు దరఖాస్తుకు జత చేసి పంపాలన్నారు. ఈ పాఠశాలల్లో ఉచిత విద్యతోపాటు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, ఉచిత భోజనం, అన్ని వేళలా వైద్య సౌకర్యం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు బ్రెయులీ లిపి, సాంకేతిక భాష నేర్పనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం బధిరుల ఆశ్రమ పాఠశాలలు.. బాపట్ల-9948372899, ఒంగోలు- 9490726636, విజయనగరం-9985837919. అంధుల ఆశ్రమ పాఠశాలలు-- విజయనగరం-9494914959, విశాఖపట్నం-9441665545, హిందూపూర్- 6302242130 ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ నంబర్లను సంప్రదించాలన్నారు.