Share News

కృష్ణా జలాలపై నేటి నుంచి బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ విచారణ

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:18 AM

కృష్ణా జలాల్లో హక్కులపై బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌ బుధవారం నుంచి మూడు రోజుల పాటు వాదనలు వినిపించనుంది.

కృష్ణా జలాలపై నేటి నుంచి బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ విచారణ

  • రాష్ట్రం తరఫున హాజరుకానున్న సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా బృందం

  • 3 రోజులపాటు వాదనలు

అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో హక్కులపై బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌ బుధవారం నుంచి మూడు రోజుల పాటు వాదనలు వినిపించనుంది. రాష్ట్రం తరఫున సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, జి.ఉమాపతి, అడ్వకేట్‌-ఆన్‌-రికార్డ్‌ గుంటూరు ప్రమోద్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ దఫా జరిగే వాదనలు చాలా కీలకమైనవిగా సాగునీటి రంగ నిపుణులు భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రాజెక్టులు, భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేయడానికి గుప్తా బృందం ఢిల్లీనుంచి కొద్దిరోజుల కిందట విజయవాడ వచ్చింది. క్యారీఓవర్‌ నిల్వలు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటి వినియోగం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఎత్తిపోత వంటి అంశాలపై జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించింది. ఆ తర్వాత గుప్తా, ఉమాపతి, ప్రమోద్‌కుమార్‌.. ప్రభుత్వ సలహాదారు, అంతర్రాష్ట్ర జల వివాద నిపుణుడు గంగాధర్‌తో కలసి సీఎం చంద్రబాబుతో కూడా సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో రాష్ట్రం తరఫున సమర్థంగా వాదనలు వినిపించారని వారిని అభినందించారు. ఇదే కొనసాగించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని సూచించారు. శుక్రవారం వరకు ఏపీ న్యాయవాదుల బృందం తన వాదనలు వినిపిస్తుంది. ఆ తర్వాత ట్రైబ్యునల్‌ మరోసారి తెలంగాణ అభిప్రాయాలను ఆలకిస్తుంది. ఈ అభిప్రాయాలపై వచ్చే నెలలో జరిగే విచారణలో ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతరుల అభ్యంతరాలను వింటుంది.

Updated Date - Jul 22 , 2026 | 05:27 AM