Share News

ఏపీ అటవీ ఉత్పత్తులకు ప్రమాణ్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:56 AM

అటవీ ఉత్పత్తులకు భారత అటవీ, కలప ధ్రువీకరణ పథకం(ఐఎఫ్‌డబ్ల్యూసీఎస్‌) కింద దేశంలోనే ‘ప్రమాణ్‌’ పొందనున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కానుంది.

ఏపీ అటవీ ఉత్పత్తులకు ప్రమాణ్‌

  • ఐఎఫ్‌డబ్ల్యూసీఎస్‌ సర్టిఫికెట్‌ పొందనున్న తొలి రాష్ట్రం

  • 1035 ఉత్పత్తులను పరిశీలించిన ఐఐఎఫ్ఎం

  • మన అటవీ ఉత్పత్తులకు జాతీయ మార్కెట్లో గుర్తింపు

  • ‘ప్రమాణ్‌’తో రైతుల, పరిశ్రమల ఆదాయం మెరుగు: ప్రొఫెసర్‌ యోగేష్‌దుబే

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అటవీ ఉత్పత్తులకు భారత అటవీ, కలప ధ్రువీకరణ పథకం(ఐఎఫ్‌డబ్ల్యూసీఎస్‌) కింద దేశంలోనే ‘ప్రమాణ్‌’ పొందనున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కానుంది. వ్యవసాయ, అటవీ, సహజ అటవీ వనరుల కోసం స్థిరమైన నిర్వహణ పద్ధతుల గుర్తింపు, అక్రిడిటేషన్‌ కోసం 2023లో భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్వచ్ఛంద థర్డ్‌ పార్టీ మార్కెట్‌ ఆధారిత ధ్రువీకరణ పథకమే ‘ప్రమాణ్‌’. అడవులు, అడవుల వెలుపల, చెట్ల స్థిరమైన నిర్వహణను ప్రోత్సహించడం, ధ్రువీకరించిన ఉత్పత్తులకు మార్కెట్‌ ప్రోత్సాహకాలను అందించడమే ఐఎ్‌ఫడబ్ల్యూసీఎస్‌ ప్రమాణ్‌ లక్ష్యం. జాతీయ విధానాలు, అంతర్జాతీయ నిబద్ధతలతో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అనుసంధానాలను కూడా ప్రమాణ్‌ సర్టిఫికెట్‌ ప్రోత్సహిస్తుంది. ఇది భారతీయ కలప ఆధారిత పరిశ్రమల సమగ్రత, పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. విజయవాడ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆధ్వర్యంలో భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్టు మేనేజ్‌మెంట్‌( ఐఐఎఫ్ఎం)ను సందర్శించిన పాత్రికేయులతో ప్రొఫెసర్‌ యోగేష్‌ దుబే మాట్లాడుతూ చట్టబద్ధత, జాడ తెలుసుకోగల సదుపాయంతో కూడిన ప్రమాణ్‌ సర్టిఫికెట్‌ రైతులకు, పరిశ్రమలకు ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుందన్నారు. స్థిరమైన పంటకోత పద్ధతులు, జీవనోపాధి, సామాజిక భద్రత ఈ పథకం కింద నిర్ధారించబడిన కీలక సూచికలు అని అన్నారు. పర్యావరణం, ఆర్థిక సాధ్యత, సామాజిక అంశాలను ధ్రువీకరణ ప్రక్రియల కోసం ఐఐఎ్‌ఫఎం పరిగణిస్తుందని ప్రొఫెసర్‌ దుబే తెలిపారు. ఐఎ్‌ఫడబ్ల్యూసీఎ్‌స-ప్రమాణ్‌ సర్టిఫికెట్‌ను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అన్విత పాండే మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు చెందిన కాఫీ, రబ్బరు, కలప, విత్తనాలు, నూనెలు సహా మొత్తం 1035 ఉత్పత్తులను ప్రమాణ్‌ సర్టిఫికెషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి పరిశీలించినట్లు చెప్పారు.


పథకం నిర్వహించే సంస్థగా ఐఐఎఫ్ఎం ఆరు నెలల్లో సర్టిఫికెట్‌ సంస్థలచే ఫీల్డ్‌ ఆడిట్‌తో సహా వివిధ స్థాయిల తనిఖీలతో ప్రమాణ సర్టిఫికేషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసింది. ఈ సంస్థలు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కింద నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ సర్టిఫికేషన్‌ సంస్థల గుర్తింపు పొందాయని ఆమె చెప్పారు. సర్టిఫికెట్లు జారీచేసేందుకు ఇండియన్‌ ఫారెస్టు మేనేజ్‌మెంట్‌ స్టాండర్డ్‌ ఆధారంగా 8 ప్రమాణాలతో 69 సూచికలు, 254 వెరిఫైయర్లను అనుసరిస్తామని, ఇది నేషనల్‌ వర్కింగ్‌ ప్లాన్‌కోడ్‌ 2023లో అంతర్భాగంగా ఉంటుందని అన్విత తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు కొన్ని పరిశ్రమలు కూడా సర్టిఫికేషన్‌ ప్రక్రియలు జరుగుతాయని అన్విత చెప్పారు. ఆదాయం, సామాజిక భద్రతను మెరుగుపరచడానికి ఖర్చుతో కూడిన ప్రభావవంతమైన ప్రమాణ్‌ దరఖాస్తు ప్రక్రియను ఉపయోగించుకోవాలని ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, వ్యక్తులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 16 , 2026 | 04:57 AM