Share News

బీచ్‌ శాక్స్‌ పాలసీ భేష్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:38 AM

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన బీచ్‌ శాక్స్‌ పాలసీతో తీరప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి ముందడుగు పడుతుందని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య(ఏపీ చాంబర్స్‌) పేర్కొంది.

బీచ్‌ శాక్స్‌ పాలసీ భేష్‌

  • స్వాగతించిన ఏపీ చాంబర్స్‌.. టూరిజం అభివృద్ధికి పలు సూచనలు

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన బీచ్‌ శాక్స్‌ పాలసీతో తీరప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి ముందడుగు పడుతుందని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య(ఏపీ చాంబర్స్‌) పేర్కొంది. గురువారం విజయవాడలో ఏపీ చాంబర్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పర్యాటక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న భాగస్వామ్య పక్షాలు, పర్యాటక రంగ నిపుణులు మాట్లాడుతూ బీచ్‌ శాక్స్‌ పాలసీని స్వాగతించారు. ఈ పాలసీని మరింత బలోపేతం చేయడంతోపాటు సుస్థిర పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడానికి దోహదపడే సిఫార్సులను ఏపీ చాంబర్స్‌ ప్రతినిధి బృందం త్వరలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ మీనాకు సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహి ంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయమని సంస్థ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. పరిశ్రమల సమస్యల పరిష్కారం, నిరంతర చర్చల కోసం పర్యాటక రంగంలోని అన్ని విభాగాల ప్రాతినిధ్యంతో రాష్ట్ర పర్యాటక భాగస్వాముల సంప్రదింపుల కమిటీని, రాష్ట్రంలోని కీలక పర్యాటక కేంద్రాల వద్ద డెస్టినేషన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పర్యాటక, ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతం చేయాలన్నారు.


రాష్ట్రంలో ప్రాంతీయ పార్యటకాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, రాయలసీమ సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ పర్యాటక కేంద్రాలను రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భాస్కరరావు చెప్పారు. ఏపీ చాంబర్స్‌ టూరిజం కమిటీ చైర్మన్‌, ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.వి.స్వామి మాట్లాడుతూ... సూర్యలంక, విశాఖపట్నం బీచ్‌లలో బీచ్‌ శాక్‌ల నిర్మాణానికి అనుమతించే విస్తీర్ణాన్ని (ప్లింత్‌ ఏరియా)ను 1,500 చదరపు అడుగుల నుంచి 3 వేల చదరపు అడుగులకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఆమోదించిన హోమ్‌స్టేల జాబితాను విడుదల చేయాలని ఆయన కోరారు.

Updated Date - Jun 19 , 2026 | 04:39 AM