బీసీలు 50.26 శాతం!
ABN , Publish Date - Aug 15 , 2026 | 04:41 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో కీలకమైన బీసీ జనాభా... స్థానిక సంస్థల్లో వారికి కేటాయించాల్సిన సీట్లపై నివేదిక సర్కారుకు అందింది.
సర్కారుకు మిశ్రా కమిషన్ నివేదిక!
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా నిర్ధారణ
‘స్థానికం’లో బీసీ కోటా 27.66 శాతం
గతంతో పోల్చితే 3.82 శాతం పెరుగుదల
మేయర్లు, పట్టణ వార్డుల్లో పెరిగిన వాటా
సిఫారసులపై నిర్ణయం ప్రభుత్వానిదే!
బీసీలకు 34 శాతం కోటాపై ఎన్నికల్లో హామీ
కోటా 50శాతం దాటితే న్యాయపరమైన చిక్కులు?
అసెంబ్లీలో తీర్మానం చేసి తదుపరి అడుగులు!
ఇవి కీలకం..
2021తో పోలిస్తే 2026లో కొన్ని స్థానిక స్థానాల మొత్తం సంఖ్యలో తేడాలు వచ్చాయని నివేదిక పేర్కొంది. 2021లో కొన్ని స్థానాలకు పరిపాలనా కారణాలు లేదా న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగకపోవడం, అలాగే విలీనానికి సంబంధించిన అంశాలు ఇందుకు కారణాలుగా పేర్కొంది.
2011 జనాభా లెక్కలతో 2026 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను పోల్చినప్పుడు... ఎస్టీ, ఎస్సీల జనాభా నిష్పత్తి పెరగడం వల్ల బీసీలకు సిఫారసు చేసిన స్థానాల్లో తగ్గుదల ఏర్పడిందని నివేదిక స్పష్టం చేసింది.
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పాత ఉమ్మడి జిల్లాల ఆధారంగానే జడ్పీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. ఆ తర్వాత జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో... దానికి అనుగుణంగా మార్పులు జరుగుతాయి.
అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 243 సర్పంచ్ స్థానాలు(37.62 శాతం) బీసీలకు కేటాయించాలని సిఫారసు చేశారు.
నెల్లూరు జిల్లాలో 700 సర్పంచ్ స్థానాల్లో 96 (13.71 శాతం) బీసీలకు కేటాయించాలని సూచించారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో కీలకమైన బీసీ జనాభా... స్థానిక సంస్థల్లో వారికి కేటాయించాల్సిన సీట్లపై నివేదిక సర్కారుకు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మొట్టమొదటిసారిగా జనాభా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను సిఫారసు చేసింది.
ఈ నివేదికలోని కొన్ని వివరాలు ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. దీని ప్రకారం... యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 50.26 శాతం ఉన్నట్లు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తేల్చింది. దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. నోటిఫై చేసిన షెడ్యూలు ఏరియాల్లో మొత్తం సీట్లను ఎస్టీలకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. మిగిలిన నాన్-షెడ్యూల్ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల స్థానాల్లో మాత్రమే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీని ప్రకారం.. పంచాయతీ వార్డులు కాకుండా.. ఇతర స్థానిక సంస్థల స్థానాల్లో బీసీలకు 27.66 శాతం స్థానాలు లభిస్తున్నాయి. 2021లో ఇది 23.84 శాతం మాత్రమే. అంటే... గతంలో కంటే ఇప్పుడు 3.82 శాతం కోటా పెరిగినట్లు. పంచాయతీ వార్డులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మారుతుంది.
ఎక్కడ ఎలా... నాన్ షెడ్యూల్ ఏరియాలో మొత్తం 11,190 సర్పంచ్ స్థానాలున్నాయి. వీటిలో 27.95 శాతం బీసీలకు కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. అలాగే... ఎంపీపీలు 24.6 శాతం, ఎంపీటీసీలు 25.55 శాతం, జడ్పీటీసీలు 24.6 శాతం, జడ్పీ చైర్‌పర్సన్‌లు 23.08 శాతం బీసీలకు కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. కార్పొరేషన్ల మేయర్లలో 35.29 శాతం బీసీలకు కేటాయించాలని స్పష్టం చేసింది. గతంలో ఈ సంఖ్య 31.25 శాతం మాత్రమే. ఇక.. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌లు 33.02 శాతం కేటాయించాలని తెలిపింది. గతంతో పోల్చితే ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. పట్టణ స్థానిక సంస్థల వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్ మాత్రం గతంలో 30.73 శాతం ఉండగా... ఇప్పుడు దానిని 32.78 శాతానికి పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది.
ఇప్పుడేం చేద్దాం... 1931 తర్వాత రాష్ట్రంలో గాని, దేశంలో గాని కుల గణన సర్వే జరగలేదు. దీంతో బీసీలకు స్థానిక రిజర్వేషన్లను ఉజ్జాయింపుగానే అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా నిర్ధారించి, ఆ మేరకు రిజర్వేషన్ ఖరారు చేసేందుకు... సుప్రీం కోర్టు ఆదేశం మేరకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్‌లు 34 శాతానికి పెంచితే... మొత్తం కోటా పరిమితం 50 శాతాన్ని మించిపోతుంది. ఇది న్యాయపరంగా చెల్లుబాటు అయ్యే అవకాశంలేదు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచినా... కోర్టులో చుక్కెదురైంది. దీంతో పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఏపీలో అలాంటి సమస్యరాకుండా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడమెలా అన్న చర్చ ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో జరుగుతోంది. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి తీర్మానం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.