బీసీ రిజర్వేషన్లపై మేమైతే కోర్టుకు వెళ్లం
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:18 AM
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించబోదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కోర్టుకు వెళ్తే తామేం చేస్తామని శాసనమండలిలో విపక్ష నేత బొత్స వ్యాఖ్యానించారు.
ఎవరైనా ఆశ్రయిస్తే మేమేం చేస్తాం: బొత్స
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించబోదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కోర్టుకు వెళ్తే తామేం చేస్తామని శాసనమండలిలో విపక్ష నేత బొత్స వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలన్నారు. 2014-19, 2019-24 మధ్య బీసీలకు ఎన్ని పదవులు వచ్చాయో కూటమి ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబులా తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను పట్టించుకోబోమని అన్నారు. గురువారంనాడు తన అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబరులో మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలకూ పోటీ చేస్తామని చెప్పారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అప్పగింత నుంచి ఇప్పటి డీఎస్సీ వరకూ తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ పోరాటాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి కలసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అసెంబ్లీకి రాకపోవడం తమ పార్టీ విధానమని చెప్పారు. కాగా, ప్రభుత్వ వైఫల్యాలపై సభలో నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం లేక అధికార పక్షం పారిపోతోందని బొత్స విమర్శించారు. అసెంబ్లీ గేటు బయట మీడియాతో మాట్లాడారు. అమరావతి చంద్రబాబుకు ఏటీఎంలా మారిందన్నారు.