అసెంబ్లీలో చర్చించాకే.. బీసీ కోటాపై ముందడుగు!
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:24 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్ల శాతం నిర్ధారించాలని భావిస్తోంది.
స్థానిక సంస్థల్లో ఆ వర్గాలకు 27శాతం రిజర్వేషన్
ఇవ్వాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు
కూటమి మేనిఫెస్టోలో 34 శాతానికి హామీ
బీసీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వారికి మరీ తక్కువ కోటా సూచించిన కమిషన్
పరిష్కారంపై అధికారులతో నేడు కూడా మాట్లాడనున్న సీఎం
వీటన్నిటిపై రేపు శాసనసభలో సమగ్ర చర్చ
అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్ల శాతం నిర్ధారించాలని భావిస్తోంది. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు స్థానిక సంస్థల్లో 27 శాతం కోటా ఇవ్వాలని సిఫారసు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కమిషన్ ఈ సూచన చేసింది. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ-జనసేన-బీజేపీ కూటమి హామీ ఇచ్చింది. అయితే పార్టీపరంగా 34 శాతం సీట్లు ఇస్తామా.. చట్టపరంగా 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తారా అనే అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశముంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధనలకు లోబడే రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అనుసరించకుండా బీసీలకు 40 శాతం రిజర్వేషన్ల ఖరారుచేసి ముందుకెళ్లిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మొత్తం 50 శాతంలోపే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రిజర్వేషన్ల ప్రక్రియను కొలిక్కితేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
34శాతం కోటాతో ఎన్నికలు మరింత ఆలస్యం..?
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే... ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 34 శాతం కోటా ఇస్తే ఎవరో ఒకరు కోర్టుకెళ్లే అవకాశముంది. అదే జరిగితే కచ్చితంగా కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టు ఆదేశాలతో నిలిచిపోతే తిరిగి ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పడుతుంది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకు బీసీలకు నేరుగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలనే అంశంపైనా అసెంబ్లీలో సమగ్రంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
బీసీలకు కొన్ని జిల్లాల్లో తక్కువ రిజర్వేషన్లు..
రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు మరీ తక్కువ రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సూచించింది. నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో బీసీలకు 10 శాతం కోటా చాలని పేర్కొంది. ఆయా జిల్లాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉండడంతో బీసీలకు అక్కడ తక్కువ ప్రకటించాల్సి వచ్చింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతంలోపు ఉండాల్సి రావడం, ఆయా జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఈ సమస్య ఏర్పడింది. బీసీ జనాభా తక్కువగా ఉన్న చోట.. రిజర్వేషన్లు తక్కువగా ప్రకటించినా ఇబ్బంది ఉండదని.. కానీ వారు ఎక్కువగా ఉన్న చోట కూడా తగుమాత్రంలో రిజర్వేషన్లు కల్పించలేకపోతే ఆయా వర్గాల్లో ఆందోళన పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశంపై ఆయన ఆదివారం అధికారులతో చర్చించారు. ఈ వ్యత్యాసం రాకుండా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలంటే ఏం చేయాలన్న దానిపై సోమవారం మరోసారి వారితో చర్చించనున్నారు. ఈ తేడాను తగ్గించేందుకు మండలాల రిజర్వేషన్లను జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవచ్చని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ సలహా ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా సర్పంచ్‌లకు ఇప్పటి వరకు మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు చేపట్టగా.. ఇక నుంచి జిల్లా యూనిట్‌గా నిర్ధారించే అవకాశముంది. ముందు బీసీలకు అన్ని జిల్లాల్లో సమానంగా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత 34 శాతం రిజర్వేషన్ ప్రక్రియపై ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా.. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో కూలంకషంగా చర్చించాలని సీఎం శనివారంనాటి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులకు స్పష్టంచేశారు.