Share News

స్థానిక రిజర్వేషన్లపై కమిషన్‌ కసరత్తు

ABN , Publish Date - May 02 , 2026 | 04:47 AM

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై డెడికేటెడ్‌ కమిషన్‌ కసరత్తును వేగవంతం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను ...

స్థానిక రిజర్వేషన్లపై కమిషన్‌ కసరత్తు

  • బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం

  • శ్రీకాకుళంలో చైర్మన్‌ మిశ్రా బహిరంగ విచారణ

శ్రీకాకుళం, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై డెడికేటెడ్‌ కమిషన్‌ కసరత్తును వేగవంతం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ నిర్వహించారు. అధికారులతో సుదీర్ఘంగా సమీక్షిస్తూనే, వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. గత ఎన్నికల్లో సర్పంచ్‌, జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు, వాస్తవంగా గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య తదితర నివేదికలను జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవోలను అడిగి తెలుసుకున్నారు. మునిసిపల్‌ కమిషనర్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో బీసీల గెలుపు శాతాలపై వివరాలు సేకరించారు. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను కచ్చితంగా అంచనా వేసేందుకు.. గృహనిర్మాణం తదితర సంక్షేమ పథకాల ద్వారా ఎంతమంది బీసీలకు లబ్ధి చేకూరిందన్న వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పలు కుల సంఘాల ప్రతినిధులు కమిషన్‌ దృష్టికి తమ డిమాండ్లను తీసుకొచ్చారు. తమను బీసీ-డీ నుంచి బీసీ-బీ గ్రూపులోకి మార్చాలని ఉత్తరాంధ్ర యాదవ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే అత్యంత వెనుకబడిన కులాల వారు.. బీసీల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వర్గాలతో ఏమాత్రం పోటీ పడలేకపోతున్నారని రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో అందిన వినతులు, అధికారుల నివేదికలను క్షుణ్నంగా పరిశీలించి ప్రభుత్వానికి త్వరలోనే ఒక సమగ్ర నివేదికను అందజేస్తామని చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడించారు.

Updated Date - May 02 , 2026 | 04:47 AM