‘బీసీ కోటా’ హామీని నిలుపుకొందాం!
ABN , Publish Date - Aug 16 , 2026 | 04:57 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసులను అమలు చేస్తే..
34శాతం అమలుకు అవకాశాలను పరిశీలిద్దాం
న్యాయపరమైన సమస్యలు లేకుండా చూద్దాం
కుదరకపోతే.. పార్టీ పరంగా న్యాయం చేద్దాం
బీసీ కమిషన్ సిఫారసులపై కూటమిపక్షాల
మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసులను అమలు చేస్తే బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించగలమన్నారు. కానీ, ఎన్నికల సమయంలో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. దీని అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై శనివారం కూటమిపక్ష నాయకులు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సిఫారసులు చర్చకు వచ్చాయి. టీడీపీ ముందు నుంచీ బీసీల పార్టీగా గుర్తింపు పొందిందని, ఈ నేపథ్యంలో కమిషన్ సిఫారసులను అమలు చేయడమా? లేక, 34 శాతం రిజర్వేషన్ కల్పించడమా అన్న అంశాలను న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేపక్షంలో బీసీలకు పార్టీపరంగా న్యాయం చేద్దామన్నారు. వారికి రాజకీయంగా సముచితస్థానం కల్పిద్దామని సీఎం స్పష్టం చేశారు. టెలీకాన్ఫరెన్సులో.. అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైనా చర్చ జరిగింది. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో.. ఎల్‌నినో, వ్యవసాయం, నీటిపారుదల, శాంతిభద్రతలు, వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1పై సిట్ నివేదిక వంటి అంశాలతోపాటు మరిన్ని అంశాలపై చర్చించాలని భావించారు. 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన వివిధ బిల్లుల ఆమోదంపై చర్చిద్దామని సీఎం అన్నారు. టెలీకాన్ఫరెన్సులో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్‌తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొన్నారు.