Share News

బీసీలకు రక్షణ

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:42 AM

బీసీలకు రక్షణగా, వారి ఆత్మ గౌరవం, మర్యాదపూర్వక జీవనానికి భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన చట్టం తీసుకురానుంది. వెనుకబడిన తరగతులపై వేధింపులు, వివక్ష, సామాజిక-ఆర్థిక బహిష్కరణ, హింసాత్మక ఘటనలను అరికట్టడం లక్ష్యంగా..

బీసీలకు రక్షణ

  • బడుగులను వేధిస్తే కఠిన శిక్షలు

  • బీసీ రక్షణ బిల్లు-2026 ముసాయిదా రెడీ

  • అటు బాధితులకు సమగ్ర న్యాయం,ఇటు నిందితులపై ఉక్కుపాదం

  • ప్రత్యేక కోర్టులు పెట్టి 2 నెలల్లో విచారణ

  • బాధితులకు ప్రభుత్వ రక్షణ.. పరిహారం..

  • నేరం రుజువైతే ఐదేళ్ల వరకు కఠిన శిక్ష

  • నిర్లక్ష్యం వహించే సిబ్బందిపైనా వేటు

  • ‘బీఎన్‌ఎ్‌స’ నేరాలకు ప్రత్యేక షెడ్యూల్‌

  • బీసీలపై అవి జరిగితే అదనపు శిక్షలు

  • మరో హామీ అమలుకు కూటమి సిద్ధం!

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

బీసీలకు రక్షణగా, వారి ఆత్మ గౌరవం, మర్యాదపూర్వక జీవనానికి భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన చట్టం తీసుకురానుంది. వెనుకబడిన తరగతులపై వేధింపులు, వివక్ష, సామాజిక-ఆర్థిక బహిష్కరణ, హింసాత్మక ఘటనలను అరికట్టడం లక్ష్యంగా ప్రత్యేక చట్టానికి రూపకల్పన చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ బీసీ రక్షణబిల్లు-2026 ముసాయిదాను సిద్ధం చేసింది. బీసీలకు న్యాయం చేస్తామంటూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకొనే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బీసీలపై కులగుర్తింపు లేదా సంప్రదాయ వృత్తుల ఆధారంగా జరుగుతున్న వేధింపులు, దాడుల ఘటనలపై తీవ్రంగా స్పందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి, బాధితులకు రక్షణ, పరిహారం, పునరావాసం; నిందితులకు కఠిన శిక్షలు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా బిల్లులో కఠిన నిబంధనలను పొందుపరిచారు. బాధితులు, ఆధారిత కుటుంబసభ్యులు, సాక్షులు, సామాజిక-ఆర్థిక బహిష్కరణ, ప్రత్యేక కోర్టు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ప్రభుత్వ ఉద్యోగి తదితర అంశాలపై బిల్లులో స్పష్టమైన నిర్వచనాలు ఇచ్చారు.


బిల్లు లక్ష్యాలివే....

బాధిత బీసీలకు ప్రత్యేక కోర్టుల ద్వారా వేగంగా న్యాయం అందించడం ప్రధాన లక్ష్యం. ప్రతిపాదిత చట్టం పరిధిలోకి వచ్చే నేరాలు చేసిన బీసీయేతర వ్యక్తులకు కనీసం ఆర్నెల్లు జైలు శిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశముంది. తప్పుడు సాక్ష్యాలతో ఒక బీసీకి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తే నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే నిబంధనను బిల్లులో చేర్చారు. బాధితుడి ఫిర్యాదును నమోదు చేయకపోవడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యం, దర్యాప్తు చేపట్టకపోవడం, బాధితులు,సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయకపోవడం, 60 రోజుల్లో చార్జీషీట్‌ దాఖలు చేయకపోవడం వంటి విధుల నిర్లక్ష్యాన్ని శిక్షార్హంగా బిల్లులో పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఒకసారి శిక్షపడిన వ్యక్తి మళ్లీ అదే తరహా నేరానికి పాల్పడితే కనీసం ఏడాది జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. నేర తీవ్రత, బాధితుడికి జరిగిన నష్టం, నేరం పథకం ప్రకారం చేశారా.. అనేది పరిగణనలోకి తీసుకుని కోర్టు మరింత కఠిన శిక్ష విధించవచ్చు.

ప్రత్యేక కోర్టులు..వేగవంతమైన న్యాయం..

బీసీలపై జరిగే నేరాల విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిసమ్మతితో ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. కేసులను నేరుగా తీసుకుని సాధ్యమైనంత వరకు రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రతి ప్రత్యేక కోర్టుకు కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదిని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించాలి. బాధితులు, సాక్షులకు బెదిరింపుల నుంచి రక్షణ, గౌరవప్రదమైన ప్రక్రియ, వాదన వినిపించే హక్కు, సాక్షులను పిలిపించుకునే హక్కు, కేసు పురోగతిపై సమాచారం పొందే హక్కు, విచారణలో పాల్గొనే హక్కు కల్పించారు.


ప్రభుత్వ బాధ్యతలివీ..

ఉచిత ఎఫ్‌ఐఆర్‌, తక్షణ నగదు లేదా వస్తు సహాయం, ప్రయాణ, జీవన భత్యాలు, పునరావాసం, అవసరమైతే సురక్షిత ప్రాంతానికి తరలింపు, గుర్తింపు గోప్యత, వైద్య సహాయం, ఉచిత న్యాయ సహాయం, పరిహారం అందించే బాధ్యతను ప్రభుత్వంపై ఈ బిల్లు ఉంచింది. చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రత్యేక అధికారులను నియమించాలి. పర్యవేక్షణ కమిటీలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. వేధింపుల ప్రభావిత ప్రాంతాల గుర్తింపు, కాలానుగుణ సర్వేలు, వార్షిక నివేదికలను శాసనసభకు సమర్పించాలి. ప్రతిపాదిత చట్ట అమలుకు అవసరమైన నియమావళిని ప్రభుత్వం రూపొందించాలి.

ఆ నేరాలకు ప్రత్యేక షెడ్యూల్‌..

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)-2023 పరిధిలోకి వచ్చే నేర కుట్ర, అక్రమ గుంపు, అల్లర్లు, దాడులు, తీవ్ర గాయాలు, యాసిడ్‌ దాడులు, మహిళలపై లైంగిక నేరాలు, అపహరణ, నేరపూరిత ఉద్దేశంతో అక్రమ చొరబాటు, బెదిరింపులు, హత్య, హత్యాయత్నం, మూక దాడులు వంటి నేరాలను ప్రత్యేక షెడ్యూల్‌లో చేర్చారు. బీసీలపై ఈ నేరాలు జరిగితే ఈచట్టం ప్రకారం అదనపు శిక్షలు విధిస్తారు. రాష్ట్రంలో బీసీ జనాభా అధికం. దీంతో రాజకీయ, సామాజిక, న్యాయవర్గాల్లో ప్రతిపాదిత బిల్లు విస్తృత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం కల్పించే ప్రయత్నంగా ఈబిల్లును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అది ముసాయిదా దశలో ఉంది. దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించిన అనంతరం తుదిరూపు దాల్చే అవకాశముంది.

Updated Date - Aug 06 , 2026 | 04:44 AM