ప్రారంభించారు.. వదిలేశారు
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:38 AM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘బడికోసం’ పథకం వెలవెలబోతోంది. ప్రచారం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్పందన రావడం లేదు.
ప్రచారం లేక ‘బడి కోసం’ పథకం వెలవెల.. స్కూళ్ల అభివృద్ధి లక్ష్యంతో ప్రారంభం
మొదటిరోజే 4 కోట్లకు పైగా విరాళాలు.. తర్వాత నెల రోజుల్లో 10 లక్షలూ రాలేదు
అధికారుల నిర్లక్ష్యంతో కనిపించని స్పందన
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘బడికోసం’ పథకం వెలవెలబోతోంది. ప్రచారం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్పందన రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 24న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. స్కూల్ ఇన్‌ఫ్రా విభాగం ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పాఠశాలలకు విరాళం ఇచ్చే అవకాశం ఇందులో కల్పించారు. నగదు రూపంలో గానీ లేదా వస్తువుల రూపంలో గానీ విరాళాలు ఇచ్చేలా ఈ వెబ్‌సైట్ రూపొందించారు. ప్రారంభం రోజునే రూ.4 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత ఆ విభాగం అధికారులు దానిని పూర్తిగా వదిలేశారు. పూర్వ విద్యార్థులు, దాతలను భాగస్వామ్యం చేయాల్సిన పథకంపై ప్రచారాన్ని విస్మరించారు. చాలా మందికి ఈ వెబ్‌సైట్ ప్రారంభమైందన్న విషయం తెలియకపోవడం గమనార్హం. ఆయా పాఠశాలలకు ఉన్న అవసరాలను వస్తువుల రూపంలో కూడా తీర్చే విధానం ఇందులో ఉంది. ఉదాహరణకు ఒక పాఠశాలలో ఫ్యాన్లు కావాలంటే దాతలు నేరుగా ఫ్యాన్లు కొనుగోలు చేసి పాఠశాలకు డెలివరీ చేయొచ్చు. అలా సుమారు 70 అవసరాలను పాఠశాలల్లో గుర్తించారు. దీనిపై ఇంకొంత అవగాహన కల్పిస్తే దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పథకం ప్రారంభించిన తర్వాత అధికారులు నిర్లక్ష్యం చేయడంతో పెద్దగా చెప్పుకోదగ్గ విరాళాలు అందలేదు. మొత్తంగా ఇప్పటి వరకూ రూ.4.04 కోట్ల విరాళాలు రాగా, ఇందులో రూ.4 కోట్లకు పైగా ప్రారంభించిన రోజే వచ్చాయి. ప్రచారం లేకపోవడంతో దాదాపు నెల రోజుల్లో పట్టుమని రూ.10 లక్షల విరాళాలు కూడా అందలేదు. కాగా మొత్తం 43,068 పాఠశాలలకు రూ.6,320 కోట్లు అవసరమని పాఠశాల విద్యా శాఖ అంచనా వేసింది.