పోస్టింగ్స్ ఇవ్వరు.. వీఆర్‌లో జీతాలివ్వరు
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:32 AM
పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వరు.. వీఆర్‌లో జీతాలు చెల్లించరు.. ఇదేమి పద్ధతి అంటూ బీజేఎల్‌పీ నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
పదోన్నతుల్లోనూ పోలీసులకు అన్యాయం
హోంగార్డులకు చాలీచాలని వేతనం: విష్ణుకుమార్ రాజు
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వరు.. వీఆర్‌లో జీతాలు చెల్లించరు.. ఇదేమి పద్ధతి అంటూ బీజేఎల్‌పీ నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 50మందికిపైగా డీఎస్పీలు, 68మంది సీఐలను ఏడాదిన్నరగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వేకన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉంచారు. ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలి. లేదంటే ప్రతి నెలా సగం జీతమైనా చెల్లించాలి. రెండూ కుదరదంటే ఎలా అధ్యక్షా?’ అని ప్రశ్నించారు. ‘సరైన పద్ధతిలో పదోన్నతులు ఇవ్వడం లేదు. ఈ జాప్యం వల్ల అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు పదోన్నతులు లేకుండానే రిటైరవుతున్నారు. గత సమావేశాల్లోనూ ఇదే సమస్యపై ప్రశ్నించినా హోంమంత్రి స్పందించ లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంగార్డులకు పొరుగు రాష్ట్రంలో మంచి జీతాలు ఇస్తున్నారని, మన రాష్ట్రంలో హోంగార్డులకు వేతనాలు పెంచడం రూ.3.23లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సాధ్యం కాదా? అంటూ విష్ణుకుమార్‌రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.