నేటి నుంచి అసెంబ్లీ
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:59 AM
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం..
4 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు
డీఎస్సీ, గ్రూప్-1 సహా 10 అంశాలపై చర్చ
సభ ముందుకు మొత్తం 7 బిల్లులు
కీలకంగా బీసీ కోటా, స్థానిక సంస్థల బిల్లులు
నేటి ఉదయం బీఏసీ సమావేశం
అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 నియామక పరీక్షలో జరిగిన అక్రమాలతో పాటు సుమారు 10 అంశాలపై చర్చించాలని అధికార పార్టీ భావిస్తోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికకు సంబంధించిన బిల్లు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. ఈ రెండింటితో పాటు ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ బిల్లు, అవయదానానికి సంబంధించిన బిల్లు.. మొత్తం ఏడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను, ఎన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్నదానిపై సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సభకు..
అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలతో నివాళులర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు.
తొలిరోజు
సమావేశాల తొలి రోజు డీఎస్సీపై చర్చ జరగనుంది. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా.. అర్థవంతమైన చర్చ చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. దీంతో పాటు ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు, నీటిపారుదల ప్రాజెక్టులు, జలధార, పంటలకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలపై చర్చ జరగనుంది.
రెండోరోజు
రెండో రోజు క్యాబినెట్ సమావేశంలో రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని బీసీ కమిషన్ నివేదికను ఆమోదించనున్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానాన్ని తీసుకొచ్చే అంశంపైన చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాల్సిన ఇతర బిల్లులను కూడా క్యాబినెట్‌లో ఆమోదించనున్నారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికకు సంబంధించిన బిల్లుపై చర్చించనున్నారు.
మూడోరోజు
మూడో రోజు గత వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై సిట్ నివేదిక ఆధారంగా చర్చించాలని భావిస్తున్నారు. అదే రోజు శాంతిభద్రతలపైనా చర్చ జరగనుంది.
నాలుగోరోజు
నాలుగో రోజు కూడా గ్రూప్-1పై చర్చ కొనసాగే అవకాశం ఉంది. దీంతోపాటు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన, సూపర్ సిక్స్ అంశాలపై చర్చ జరగనుంది.