దృష్టి మరల్చేందుకే హెరిటేజ్‌పై ఆరోపణలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:35 AM
స్వార్థ రాజకీయాల కోసమే హెరిటేజ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గురువారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.
నెయ్యి కల్తీ చేసిన జగన్‌నే బొత్స ప్రశ్నించాలి
స్వార్థరాజకీయాల కోసం సభా సమయం వృథా
వైసీపీ సభ్యులపై కొల్లు ఫైర్
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): స్వార్థ రాజకీయాల కోసమే హెరిటేజ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గురువారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ‘2019-24 వైసీపీ పాలకులు చేసిన కల్తీ కుట్ర బట్టబయలవ్వడంతో తప్పించుకోవడం కోసం హెరిటేజ్‌పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి సైతం కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ సంస్థ నుంచి కొన్ని రకాల సరుకులు కొనుగోలు చేస్తుందే తప్ప వాటిని తిరుమలకు సరఫరా చేయడంలేదు. ఇందాపూర్ సంస్థ ఏవైనా దేవాలయాలకు నెయ్యి సరఫరా చేస్తుందేమో గానీ, జగన్‌రెడ్డిలా అధికారాన్ని అడ్డంపెట్టుకుని సొంత సంస్థలకు ప్రభుత్వ సొమ్మును ధారాదత్తం చేయడం చంద్రబాబుకు తెలియదనే విషయం గుర్తుంచుకోవాలి. 2019-24లో జరిగిన కల్తీ గురించి జగన్ రెడ్డి గల్లా పట్టుకుని బొత్స ప్రశ్నించాలి. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన జగన్‌రెడ్డికి వంతపాడేందుకు బొత్సలాంటివారు సిగ్గుపడాలి. హెరిటేజ్ సంస్థ ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదు కాబట్టే వారు బొత్సకు నోటీసులు ఇచ్చారు. ప్రజా సమస్యలపై కాకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం సభ సమయాన్ని వృథా చేయం సిగ్గుచేటు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గుణపాఠం తప్పదు’ అని హెచ్చరించారు. అలాగే, అంబటి రాంబాబు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తపడకుండా ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు.